iDreamPost
iDreamPost
గెలిస్తే మన ఘనత… ఓటర్ మహాశయుని తీర్పునకు కృతజ్ఞతలు. ఓడితే తప్పు ఈవీఎం లదే.. లేదా దొంగ ఓట్లు. ఏపీ రాజకీయాల్లో నయా ట్రెండ్. ఈ ప్రచారం టీడీపీ అధినేత చందబాబు నాయుడుదే పేటెంట్. కాని చిత్రంగా చంద్రబాబు బాటలోనే బీజేపీ పయనిస్తోంది. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏ స్థాయిలో కూడా పోటీ ఇవ్వని బీజేపీ ఓటమి నెపమంతా ఓటర్ల మీదకు నెట్టేస్తోంది. వైఎస్సార్‌సీపీ వేలాది దొంగ ఓట్లు వేసిందని, అందుకే భారీ మెజార్టీ వచ్చిందంటూ ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తున్నారు.
‘ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించలేక, ఓడినవారు తప్పుడు విమర్శలు చేయడం సహజమే’ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల సందర్భంగా అన్నమాట. కాంగ్రెస్‌తో కుమ్మక్కవడం వల్లే బీజేపీ హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచిందనే ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. సంజయ్ చెప్పినట్టుగానే బద్వేల్ ఉప ఎన్నికల ఓటమి విషయంలో ఏపీ బీజేపీ నాయకులు సహజంగానే తప్పుడు ఆరోపణలకు దిగారు. అధికార వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీ గెలుపునకు వక్రభాష్యాలు చెబుతున్నారు. ఇతర నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించడం వల్ల భారీ మెజార్టీ వచ్చిందనే ప్రచారానికి తెరదీశారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. దీనితో తామే ప్రత్యామ్నాయమని బీజేపీ పోటీకి దిగింది. అయితే ఎన్నికల ఆరంభమైన నాటి నుంచి ఏ సందర్భంలోను ఇక్కడ బీజేపీ పోటీ ఇవ్వలేదు. వచ్చిన ఫలితాలే ఇందుకు ఉదాహరణ.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి సుధ రికార్డుస్థాయి మెజార్టీతో గెలిచింది. భారీ తేడాతో ఓటమి తప్పదని ముందే గ్రహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటింగ్ ముందు నుంచే వైఎస్సార్‌సీపీ దొంగ ఓట్లు వేయించిందని, ఇందుకు పోలీసులు, అధికారులు సహకరించారనే విమర్శలకు దిగారు.ఏకంగా 30 వేల దొంగ ఓట్లు వేసిందని వీర్రాజు చెప్పిన గణంకాలే తప్పని తెలిసినా ఆయన ఈ ప్రచారాన్ని ఆపలేదు. ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యంలో తీర్పును అవమానిస్తున్నామనే విషయాన్ని కూడా ఆయన పట్టించుకోలేదు.
బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన పనతల సురేష్ సైతం ఇదే ప్రచారానికి దిగారు. ‘బద్వేల్‌లో బీజేపీదే నైతిక విజయం. వైఎస్సార్ సీపీకి వచ్చిన మెజార్టీ అంతా దొంగ ఓట్లే. పోలీసులు, అధికారులు వైఎస్సార్‌సీపీకి సహకరించారు’ అనే విమర్శలకు దిగారు. ఆయన కూడా ఓటర్ల తీర్పునకు వ్యక్రభాష్యం చెప్పారు. రాజకీయాల్లో రాణించాలంటే ఓర్పు చాలా అవసరం. ఎంతోమంది నాయకులు రాజకీయాల్లో చేరిన వెంటనే పదవులు పొందలేదు. ప్రజా క్షేత్రంలో గెలుపు సాధించలేదు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన దొమ్మేటి వెంకటేశ్వర్లు విజయం కోసం నాలుగు ఎన్నికల్లో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుపై పోటీపడ్డారు. 1985, 1994లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. 1999లో పార్టీ టిక్కెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. అయినా ఎప్పుడూ కూడా ఓటర్లను అవమానించలేదు.పోలింగ్ విధానాన్ని తప్పుపట్టలేదు.
2004లో కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీ చేసి చిక్కాల మీద గెలుపు సాధించారు. గెలుపు కోసం ఆయన 19 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇదే జిల్లాల్లో ప్రత్తిపాడు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే అయిన వరుపుల సుబ్బారావు సైతం గెలుపు కోసం ఏళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చింది. తొలిసారిగా 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మాజీమంత్రి ముద్రగడ మీద ఓటమి పాలయ్యారు. 1985లో పోటీ చేసే అవకాశం రాలేదు. 1989లో ముద్రగడ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీపీలోకి వచ్చిన సుబ్బారావు మరోసారి ఓటమి పాలయ్యారు. 1994, 1999లో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. టీడీపీని వదిలి 2004లో కాంగ్రెస్‌లో చేరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. మధ్యలో ఒకసారి డీసీసీబీ చైర్మన్ చేసినా తాను కలగన్న ఎమ్మెల్యే అయ్యేందుకు సుబ్బారావు 21 ఏళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి వారు కోకొల్లలు. బీజేపీ అభ్యర్థి సురేష్ వంటివారు ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలిగాని, ప్రజాతీర్పును అపహాస్యం చేయకూడదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
‘బాబు’ ఆధ్యుడు:
ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినప్పుడు నెపం ఓటర్ల మీద.. ఈవీఎంల మీద నెట్టివేయడాన్ని రాజకీయాల్లోకి తెచ్చింది చంద్రబాబు నాయుడు. 2009 ఎన్నికల్లో ఓటమి చెందినప్పుడు ఆయన ఇదే విధానం అవలంభించారు. నాడు దివంగత నేత వైఎస్సార్ విజయానికి ఈవీఎంల ట్యాంపరింగ్ కారణమని ఆరోపించారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలనే ప్రచారానికి దిగారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంల పనితీరును తప్పుపట్టలేదు. అధికారంలో ఉన్న ఐదేళ్లల్లో ఒక్కసారి కూడా ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ రద్దు చేయమని కేంద్రాన్ని కోరలేదు. తిరిగి 2019 ఎన్నికల్లో ఓటమి ఖాయమని ముందే తేలడంతో మరోసారి నెపాన్ని ఈవీఎంల మీద నెట్టేశారు. చంద్రబాబుకు తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇదే ప్రచారానికి దిగారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ విధానంలో జరిగింది. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. దీనితో ప్రజలు ఈవీఎం ట్యాంపరింగ్ ప్రచారాన్ని నమ్మడం లేదని దొంగ ఓట్లు విషయాన్ని తెరమీదకు తెచ్చారు. తరువాత జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలో దీనిని ప్రచారంలో పెట్టారు. తాజాగా బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీ సాధించడానికి దొంగ ఓట్లు కారణమనే ఆరోపణలకు దిగారు. జనసేనతో పొత్తు ఉండడంతో బీజీపీ సైతం ఇలా ఓటర్లను అవమానించే ప్రచారానికి దిగిందేమోనని ప్రజలంటున్నారు.