Idream media
Idream media
జయలలిత మరణం అనంతరమే అన్నాడీఎంకే పని అయిపోయందని చాలా మంది భావించారు. జయ లేని పార్టీని నిలుపుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీరు సెల్వం అంతర్గతంగా కుమ్ములాడుకున్నా పార్టీని మాత్రం ఏదోలా నెట్టుకొస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రాకపోయినా, పర్వాలేదనిపించేలా సీట్లు రాబట్టుకున్నారు. ఈపీఎస్, ఓపీఎస్ ల సారథ్యంలో అన్నాడీఎంకే ఎన్నికలకు వెళ్లింది. ఓడిపోయినా, పరువును నిలబెట్టుకుంది. ఇదంతా ఒకరకంగా బీజేపీ చలువే అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకేలో ఇప్పుడు మరో మహత్తర ఘట్టం మొదలుకానుంది. అదే ప్రధాన కార్యదర్శి ఎంపిక.
ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందిన పార్టీగా అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలను నిర్వహించుకోవాల్సి ఉందట. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పూర్తి స్థాయిలో సంస్థాగత ఎన్నికలను నిర్వహించుకోలేదు. అన్నింటికీ మించి సుప్రీంను ఎన్నుకోలేదు. అయితే జయ మరణం అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎంపిక చేస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మనస్ఫూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తానని శశికళ ప్రకటించారు. ఆమె జైలుకెళ్లడంతో ఆ పదవి కోల్పోయారు. ఆమె కనుసన్నల్లో పాలన సాగి ఉంటే.. అన్నాడీఎంకే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కష్టం. అదంతా గతం. ఇప్పుడు అన్నాడీఎంకేకు అంతర్గత రాజకీయం పెద్ద సంకటంగా మారే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి.
జయలలిత ఉన్న రోజుల్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గా వ్యవహరిస్తూ వచ్చారు. మొత్తం ఏడు సార్లు జయలలిత ఆ హోదాలో పార్టీకి నియంతలా సాగారు. జైలుకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై పన్నీరు సెల్వాన్ని పెట్టి వెళ్లిన జయ, పార్టీ గుత్తాధిపత్యాన్ని మాత్రం ఎప్పుడూ తన గుప్పిట్లోనే ఉంచుకున్నారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేకు ఇప్పటి వరకూ ప్రధాన కార్యదర్శి అంటూ ఎవరూ లేకపోవడం గమనార్హం. సీఎం సీట్లో కూర్చుని ఉండిన పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలు ఆ హోదా జోలికి వెళ్లలేదు. కేవలం కన్వీనర్, డిప్యూటీ కన్వీనర్ హోదాల్లో వారు కొనసాగారు. ప్రధాన కార్యదర్శి పదవి మాత్రం ఖాళీనే.
మరి ఆ పార్టీ అంతర్గత రాజ్యాంగం మేరకు అధినేత పదవి అలా ఖాళీగానే ఉంది. సీఈసీ వద్ద గుర్తింపు పొందిన పార్టీలు ఐదేళ్లకు ఒకసారి సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలనే నియమం నేపథ్యంలో.. ఇప్పుడు అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్పటికే గడువు ముగిసినా.. మరోసారి ఆరు నెలల సమయాన్ని కోరుతూ సీఈసీకి లేఖ రాసిందట ఆ పార్టీ. ఆ గడువు లభించడం లాంఛనమే అయినా.. కొత్త ప్రధానకార్యదర్శి విషయంలో అన్నాడీఎంకే ఏకగ్రీవ నిర్ణయానికి రాగలదా? అనేది ఆసక్తిదాయకంగా మారింది.