ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ సీటు వరుసగా ఈసారి కూడా జనరల్ కావడంతో ఈసారి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి జిల్లా పరిషత్ ఎన్నికలు జరుతుండడం, జిల్లాలో మొదటి నుండి వైసిపి బలంగా ఉండడంతో పాటు, ఈ సారి అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రతిపక్షం తెలుగుదేశం కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 4 స్థానాలను గెలుచుకోవడంతో జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీ ఎంత మేరా గట్టి పోటీ ఇవ్వగలదో చూడాలి.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసిపి చివరి నిమిషంలో కొందరు అసెంబ్లీ ఇంచార్జులను మార్చడం, టికెట్ల కోసం వైసిపి లో నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో వైసిపి అధినేత జగన్ టికెట్ దక్కని ఆశావహులకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా పరిషత్ చైర్మన్ గా కానీ ఎమ్మెల్సీలు గా అవకాశాలు కల్పిస్తానని చెప్పడంతో ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్ధిత్వానికి పోటీ కొంత ఎక్కువ గా ఉంటుందని మొదటి నుండి భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించిన వారిలో ప్రముఖంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రావి రామనాధం బాబు, గొట్టిపాటి భారత్, జంకే వెంకట రెడ్డి, తూమాటి మాధవరావు వంటి వారు ఉన్నప్పటికీ మారిన రాజకీయ పరిస్థితుల్లో తాజా సమీకరణాలను బట్టి, రావి రామనాధం బాబు ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్థానంలో పర్చూరు ఇంచార్జ్ గా నియమించి డిసిఎంఎస్ చైర్మన్ గా కూడా నియమించడంతో ఆయన రేసులో లేనట్టే.
మిగిలిన వారిలో జంకే వెంకట రెడ్డి,మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వైసీపీ టికెట్ K.నాగార్జున రెడ్డికి ఇచ్చినా ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చెయ్యకుండా వైసీపీ అభ్యర్థి గెలుపుకు పనిచేశాడని సానుభూతి ఉంది. కానీ గతంలో 2001లో జరిగిన జిల్లా పరిషత్తు ఎన్నికల్లో టీడీపీ తరుపున జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశించి పుల్లలచెరువు జెడ్పిటిసి గా పోటీ చేసి ఓడి పోయారు. ఆ ఎన్నికల నుంచి మొదలైన అసమ్మతి వర్గం రాజకీయాలకు తట్టుకోలేక చిఎవరికి టీడీపీని వీడాడు. గతంలో జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిన చేదు అనుభవంతో మరియు సీనియర నాయకుడిగా ,రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జంకే ఇప్పుడు జడ్పీ ఎన్నికల బరిలోకి దిగకపోవచ్చు.
కందుకూరు టికెట్ ఆశించిన తూమాటి మాధవరావు వ్యాపారం రీత్యా బిజీగా ఉండడం, గొట్టిపాటి భరత్ అంత యాక్టివ్ గా లేకపోవడంతో ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ముందు వరుసలో ఉన్నాడు. బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కూడా జడ్పీ చైర్మన్ పోటీకి ఆసక్తిగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు.
బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మొదట ఎమ్యల్సీ ఆశించినప్పటికీ మారిన పరిస్థితుల్లో ఎంఎల్సీ పదవికి వైసిపి లో రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహులు ఎక్కువమంది ఉండడంతో పోటీ ఎక్కువగా ఉండడం, అదే సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ వరుసగా రెండవసారి జనరల్ కావడంతో అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే క్రమంలో శివ ప్రసాద్ రెడ్డి పోటీకి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. శివప్రసాద్ రెడ్డి కి సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గంలో బలమైన కేడర్ తో పాటు బూచేపల్లి సుబ్బారెడ్డి ఆకస్మిక మరణంతో వారి కుటుంబం పై ఉన్న సానుభూతి, ఆర్ధిక స్థితిగతులు దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించడం లాంఛనమేనని చెప్పవచ్చు. దీనికి తగ్గట్టు శివ ప్రసాద్ రెడ్డి కి బంధుత్వంతో పాటు వైసిపికి గట్టి పట్టు ఉన్న తాళ్లూరు మండలం జనరల్ కి కేటాయించడంతో ఆయన అక్కడనుండి పోటీ చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. తాళ్లూరులో ఆయన గెలుపు నల్లేరు మీద నడకేనని చెప్పవచ్చు.
ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం విషయానికి వస్తే ఇటీవల ఎన్నికల్లో ఊహించని పరాభవంతో పార్టీ నాయకత్వం తీవ్ర నైరాశ్యంలో ఉండడం, పార్టీ తరుపున గెలిచినా ఎమ్మెల్యే లు ఒకరిద్దరు తప్ప మిగిలినవారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, గతంలో పార్టీకి ఆర్ధికంగా అండగా ఉన్న బలమైన నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పార్టీ వ్యవహారాలతో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తుండడం, అద్ధంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ క్వారీలపై వరుస దాడుల నేపధ్యం లో అయన వైసిపి వైపు చూస్తుండడంతో, పార్టీ సీనియర్ నేత, చీరాల శాసనసభ్యులు కరణం బలరాం కూడా జిల్లా పరిషత్ అభ్యర్థి ఎంపిక విషయంలో పట్టి పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో, ఆర్ధికంగా కొంత ఖర్చు భరించాల్సిన నేపథ్యంలో ఆ పార్టీ నుండి ఆర్ధికంగా బలమైన ఓసి అభ్యర్థులెవరూ పోటీ చెయ్యడానికి ముందుకు రాకపోవడంతో ఇక తప్పని పరిస్థితుల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఆ పార్టీ తరపున జిల్లా పరిషత్ అభ్యర్థిగా కట్టా శివయ్య పేరుని ప్రతిపాదించగా కరణం బలరాం కూడా కట్టా శివయ్య అభ్యర్థిత్వానికే మద్దతు ఇచ్చాడు.
సంత నూతలపాడు మండలానికి చెందిన కట్టా శివయ్య బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందిన నియోజకవర్గం స్థాయి నేత. ఆర్ధికంగా కొంత పరవాలేదు కానీ జిల్లా స్థాయి జెడ్పి చైర్మన్ కోసం పోటీ పడగలిగే స్థాయి కాదంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో వైసిపిలో ఉన్న ఆయన దామచర్ల జనార్దన్ తో ఉన్న సాన్నిహిత్యంతో దామచర్ల ఆహ్వానం మేరకు అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం ముందే తెలుగుదేశంలో చేరాడు. తెలుగుదేశంలో ఈయనకి పెద్దగా పోటీ లేదనే చెప్పాలి.
గతంలో 2014 లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 56 స్థానాలకు గాను వైసిపి అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన ఇద్దరు జెడ్పిటిసి సభ్యులపై పాత కేసులను తిరగదోడి జిల్లా పరిషత్ ఎన్నికల రోజునే అరెస్ట్ చెయ్యడంతో చివరి నిమిషంలో ఇరుపార్టీల బలాబలాలు సమానం కావడంతో తీవ్ర ఉత్కంఠత నెలకొన్న సమయంలో వైసిపి నూకసాని బాలాజీ ని, తెలుగుదేశం పార్టీ మన్నే రవీంద్ర ని అభ్యర్థులుగా ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో జరిగిన అనూహ్య నాటకియా పరిణామాలలో తెలుగుదేశం నుండి రెబల్ గా బరిలో నిలిచిన ఈదర హరిబాబు కి వైసిపి బయట నుండి మద్దతు ఇవ్వడంతో ఈదర హరిబాబు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైయ్యారు. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో జెడ్పి వైస్ చైర్మన్ గా ఉన్న వైసిపికి చెందిన నూకసాని బాలాజీ టిడిపిలో చేరారు.
ఏదిఏమైనా జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రధాన పోటీ మాత్రం వైసిపి, తెలుగుదేశం మధ్యనే అని చెప్పవచ్చు. ఇక మిగిలిన జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ తో పాటు పవన్ కల్యాణ్ జనసేన ప్రభావం ఈ ఎన్నికల్లో నామమాత్రమేనని చెప్పవచ్చు. కాగా గతంలో దగ్గుబాటి చెంచురామయ్య, దిరిశాల వెంకటరమణ రెడ్డి, పోతుల చెంచయ్య, గొట్టిపాటి హనుమంతరావు, గుత్తా వెంకట సుబ్బయ్య, ముక్కు కాశి రెడ్డి, కాటం అరుణమ్మ, ఈదర హరిబాబు వంటి ఎందరో ఉద్దండులైన నాయకులు చేపట్టిన ప్రకాశం జిలా జెడ్పి పీఠం ఈ సారి ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో అందరూ ఊహిస్తునట్టు జిల్లాలో బలంగా ఉన్న అధికార పార్టీ వైసిపి జిల్లా పరిషత్ ని కైవసం లాంఛనమేనా?మొన్నటి ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన టీడీపీ సత్తా చాటుతుందా?వేచి చూడాలి …