iDreamPost
android-app
ios-app

ఉత్కంఠ రేకెత్తిస్తున్న తాడిపత్రి పీఠం దక్కేది ఎవరికో..?

  • Published Mar 18, 2021 | 4:54 AM Updated Updated Mar 18, 2021 | 4:54 AM
ఉత్కంఠ రేకెత్తిస్తున్న తాడిపత్రి పీఠం దక్కేది ఎవరికో..?

తాడిపత్రి పేరు వినగానే స్ఫురణకు వచ్చే పేరు జేసీ బ్రదర్స్ . 2004 నుండి హ్యాట్రిక్ విజయాలతో తాడిపత్రిలో తమ మాటే వేదంగా ఆధిపత్యం చెలాయిస్తున్న జేసీ బ్రదర్స్ హవాకు 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయంతో చుక్కెదురైంది . 2014 వరకూ కాంగ్రెస్ లో కొనసాగిన జేసీ బ్రదర్స్ అదే జిల్లాకు చెందిన టీడీపీ నేత పరిటాల రవి హత్య విషయంలో రవి భార్య సునీత నుండి , ఇతర టీడీపీ నేతల నుండి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు . అయితే 2014 ఎన్నికల నాటికి ఉన్న రాజకీయ పరిణామాల రీత్యా చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఆది నుండీ టీడీపీని నమ్ముకొని ఉన్న పరిటాల కుటుంబం , ఇతర టీడీపీ నేతలు ఈ చేరిక పట్ల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసినా బాబు లక్ష్యపెట్టలేదు .

ఆది నుండీ ట్రావెల్ బిజినెస్ లో ఉన్న జేసీ బ్రదర్స్ రవాణా వాహనాల పై పలు ఆరోపనలుండటంతో పాటు , కొన్ని తీవ్ర దుర్ఘటనలకు వీరి వాహనాలు కారణమయ్యాయి . 2013 లో తెలంగాణాలో జరిగిన ఓ ప్రమాదంలో జేసీ బ్రదర్స్ వాహనంలో ప్రయాణిస్తున్న 45 మంది సజీవ దహనం కాగా ఈ ఘటన పై పెద్ద ఎత్తున పోరాడిన టీడీపీ పార్టీ 2014 నాటికి ఆ ఊసు మర్చిపోయి జేసీ బ్రదర్స్ కి తమ పార్టీ కండువా కప్పింది . తర్వాత 2017 లో కృష్ణా జిల్లాలో జేసీ బ్రదర్స్ కు చెందిన బస్సు యాక్సిడెంట్ కి గురయ్యి డ్రైవర్ సహా పదకొండు మంది మృతి చెందిన ఘటనలో మృతులకు , వాహన డ్రైవర్ కు అధికార టీడీపీ ప్రభుత్వం కనీసం పోస్టుమార్టం కూడా నిర్వహించకుండా శవాలను తరలించడం పై నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించడంతో తిరిగి ప్రతిపక్ష నేతల పైనే కేసులు పెట్టింది ప్రభుత్వ యంత్రాంగం .

ఈ ఆందోళనను వ్యక్తిగతంగా తీసుకొన్న జేసీ దివాకర్ సోదరుడు ప్రభాకర రెడ్డి అనంతలో రోడ్డు పై బైఠాయించి సభ్య సమాజం వినలేని భాషలో జగన్ ని వ్యక్తిగతంగా దూషించాడు . నాటి నుండి జేసీ బ్రదర్స్ జగన్ పై వ్యక్తిగత ద్వేషం ప్రదర్శిస్తూ 2019 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి తీవ్ర కృషి చేసి విఫలమయ్యారు .

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జేసీ బ్రదర్స్ అక్రమాల పై కొరడా జులిపించడంతో దొంగ పర్మిట్లు , రిజిస్ట్రేషన్ పత్రాలతో తిరుగుతున్న పలు వాహనాలు సీజ్ కావడం , లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం , ప్రభుత్వ అధికారుల్ని దూషించడం వంటి ఘటనల్లో అరెస్ట్ కావడంతో జగన్ పై ద్వేషాన్ని పెంచుకున్న నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పై ఆధిపత్యం సాధించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర కృషి చేసారని చెప్పొచ్చు .

పోటాపోటీగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ 18 వార్డులను కైవసం చేసుకోగా , వైసీపీ 16 , సిపిఎం 1 , ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలవగా ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎంపీ , ఎమ్మెల్యేల ఓట్లతో వైసీపీ బలం 18 కి పెరిగి టీడీపీ , వైసీపీ బలాబలాలు సమానమయిన నేపథ్యంలో చైర్మన్ పదవి ఏ పార్టీ అభ్యర్థికి లభించనుందనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠభరిత అంశం అయ్యింది .

ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న సున్నిత ప్రాంతం కావడంతో నేటి ఎన్నికకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ , ద్రోణ్ కెమెరాల ఏర్పాటుతో పట్టణం పోలీస్ నిఘా యంత్రాంగాల పర్యవేక్షణలోకి వెళ్ళిపోయింది . ఫలితాలు రాగానే టీడీపీ పార్టీ సభ్యులతో బాబు తరహాలో క్యాంప్ నిర్వహించిన జేసీ ప్రభాకర్ వర్గం నేడు పట్టణానికి చేరుకోగా చైర్మన్ పదవి దక్కించుకోవాలన్న పట్టుదలతో ఇండిపెండెంట్ అభ్యర్థిని తన అదుపులో ఉంచుకొన్నాడని ప్రాధమిక సమాచారం .

మరో వైపు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చైర్మన్ పదవి కైవసం చేసుకోవడం పై ధీమాతో ఉన్నారని తెలుస్తుంది . చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ భాషాని ప్రకటిస్తారని వార్తలొస్తున్న నేపథ్యంలో అతని అభ్యర్థిత్వాన్ని పార్టీలకతీతంగా ముస్లిం మైనారిటీ కౌన్సిలర్లు అందరూ బలపరిచే విధంగా మత పెద్దలు కృషి చేస్తున్నారని తెలుస్తుంది .

జేసీ ప్రభాకర్ అదుపులో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా ఊహిస్తున్న ఫయాజ్ బాషా తమ్ముడు మున్నా వ్యక్తిగత డ్రైవర్ కావడం ఆసక్తికర అంశం. ఈ పరిణామాల నేపథ్యంలో చైర్మన్ పీఠం ఎవరు కైవసం చేసుకొంటారు . అసలు ఎన్నిక జరుగుతుందా , ఎన్నిక జరగటానికి అవసరమైన కనీస 50 శాతం కోరం హాజరు అవుతుందా , లేక టీడీపీ , వైసీపీ వ్యూహాల్లో భాగంగా హాజరు శాతం తగ్గి ఎన్నిక వాయిదా పడుతుందా అన్న అంశాలు రాష్ట్రంలో జరుగుతున్న చైర్మన్ ఎన్నికలు మొత్తం ఒకెత్తు తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ ఎన్నిక ఒకెత్తుగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు .

Also Read : ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో ఓటు తిరస్కరణ.. తాడిపత్రిలో ఏం జరగబోతోంది..?