నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు కౌంట్ డౌన్ సిద్ధమవుతోంది. సీనియర్ నేత, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కరోనా కారణంగా మరణించడంతో ఈ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. టీఆర్ఎస్ కి ఒకనాడు ఉప ఎన్నికల స్పెషలిస్ట్ గా ప్రత్యేక గుర్తింపు ఉండేది. అయితే ప్రస్తుతం 8ఏళ్లుగా అధికారంలో ఉండడం, గతం మాదిరిగా సెంటిమెంట్ ప్రభావం సన్నగిల్లుతుండడం వంటివి టీఆర్ఎస్ ని పరీక్షకు నిలబెడుతున్నాయి. అందులోనూ దుబ్బాకలో ఓటమి, జీహెచ్ఎంసీలో స్వల్ప మెజార్టీతో గట్టెక్కాల్సిన పరిస్థితి రావడంతో నాగార్జున సాగర్ ఎన్నికలకు ఎన్నడూ లేనంత ప్రాధాన్యత ఏర్పడింది.
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటికి మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండుసార్లు 2009, 14 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆపార్టీ తరుపున సీనియర్ నేత కే.జానారెడ్డి గెలిచారు. కానీ 2018లో మాత్రం ఆయన అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ తరుపున నోముల నర్సింహయ్య వరుసగా రెండోసారి ఆయనతో తలబడ్డారు. 2014లో 16వేలకు పైబడిన ఓట్ల తేడాతో ఓటమి పాలయిన నోముల 2018లో దానికి ప్రతీకారం తీర్చుకున్నారు. 7,771 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆయన రెండేళ్లు తిరిగే సరికి మొన్నటి డిసెంబర్ లో హఠాన్మరణం పాలుకావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
అదే సమయంలో రాష్ట్ర రాజకీయ వాతావరణంలో కూడా మార్పు కనిపిస్తోంది. వరుసగా రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఓడించి పీఠం దక్కించుకున్న కారు పార్టీ జోరుకి కమలం బ్రేకులు వేస్తామని చెబుతోంది. దుబ్బాకలో విజయం తర్వాత కాషాయదళం జోరు పెంచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దక్కిన ఓట్లు, సీట్లుతో ఉత్సాహకంగా కనిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వ సమస్యలు ఆపార్టీని కుదులుచేస్తున్నాయి. తెలంగాణా కాంగ్రెస్ నేతల కుమ్ములాటలు హస్తం పార్టీని అతలాకుతలం చేస్తున్నాయి. చివరకు ఇప్పుడు బీజేపీ తర్వాత మూడోస్థానానికి చేరినట్టు పలువురు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో నాగార్జున సాగర్ లో హవా చాటాలని కమలం కదనోత్సాహం చూపుతోంది. అదే సమయంలో కారు పార్టీ పట్టు సడలకుండా చూసుకుంటోంది. మధ్యలో కాంగ్రెస్ కి బలమైన క్యాడర్ ఉన్న సాగర్ లో ఏమేరకు రాణిస్తుందన్నది చర్చనీయాంశం అవుతోంది.
ముక్కోణపు పోరు అనివార్యంగా కనిపిస్తున్న సాగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో రావచ్చని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. గుర్రమ్‌పోడ్, పెద్దవూర, అనుముల, త్రిపురారం, నిడమానూరు, తిరుమలగిరి -సాగర్ తో కలిపి ఆరు మండలాలున్న ఈ నియోజకవర్గంలో అభ్యర్థులను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. తాజాగా సీఎం కేసీఆర్ కూడా హాలియా పర్యటన సాగర్ ఉప ఎన్నికల వేడి రాజేసినట్టే కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణాలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పాత జిల్లాల్లో 6 జిల్లాల పరిధిలో ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు. మార్చి 16న దానికి పోలింగ్ జరుగుతోంది. ఓవైపు రెండు ఎమ్మెల్సీ సీట్లు, మరోవైపు సాగర్ ఎమ్మెల్యే సీటు ఎన్నికలు ఏకకాలంలో జరుగుతున్న తరుణంలో తెలంగాణా ఓటర్ల మూడ్ తెలిసే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇది కొలమానంగా ఉంటుందని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా అన్ని పార్టీలు బలంగా సన్నద్ధమవుతున్నట్టు చెప్పవచ్చు. అధికార పార్టీ హవా సాగుతుందా.. హస్తం ఉనికిని నిలబెట్టుకుంటుందా.. కమలం జోరు కొనసాగిస్తుందా అన్నది సాగర్ ఓటర్ల చేతుల్లో ఉంది.