iDreamPost
android-app
ios-app

మధ్యప్రదేశ్‌లో అధికారం ‘చే’జిక్కుతుందా?

మధ్యప్రదేశ్‌లో అధికారం ‘చే’జిక్కుతుందా?

మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలలో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారు? మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కూలుతుందా? మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని కాదని ఓటర్లు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడతారా? ఉప ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజులలో రాబోతున్న తరుణంలో రాజకీయ వర్గాలను ఈ చర్చ కుదిపేస్తోంది.

వివరాలలోకి వెళితే 2018 డిసెంబర్‌లో జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో మెజార్టీ కంటే రెండు స్థానాలు తక్కువగా 114 స్థానాలను గెలుచుకొని బీఎస్పీ,ఎస్పీ పార్టీలు స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.కాగా 2020 మార్చి నెలలో బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ తో కాంగ్రెస్ పార్టీని అధికార పీఠం నుండి కూలదోసింది.నాటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాధిత్య సింధియా తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం జరిగిన విశ్వాస పరీక్షలో కమలనాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీంతో బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.

నాటకీయ పరిణామాల తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు.రాజ్యసభ ఎన్నికల సందర్భంగా మరో ముగ్గురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించారు.అలాగే ముగ్గురు ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీలో ఖాళీ అయిన మొత్తం 28 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో 230 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం బీజేపీకి 107 మంది, కాంగ్రెస్‌కు 87 మంది శాసనసభ్యుల బలం ఉంది.అధికారం నిలుపుకోవడానికి కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 116కు చేరుకోవాలంటే బీజేపీకి మరో 9 సీట్లు అవసరమవుతాయి.

ఇక కాంగ్రెస్ తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించువాలంటే ఉప ఎన్నికలు జరిగిన 28 స్థానాలను ఖచ్చితంగా గెలిచి తీరాలి. అయితే ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అధికార బీజేపీ ముందు జాగ్రత్తగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేను బుట్టలో వేసుకొని ఆయనతో రాజీనామా చేయించింది.ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ప్రస్తుతం 229కి తగ్గడంతో మ్యాజిక్ ఫిగర్ 115కి మారింది. అంటే ఉప ఎన్నికలలో బీజేపీకి 8 సీట్లు గెలిస్తే చాలు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారాన్ని నిలబెట్టుకుంటారు.

కాగా మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలలో బీజేపీ 16-18 స్థానాలలో విజయం సాధిస్తుందని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. తద్వారా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది.ఇక ఆజ్‌తక్‌ సర్వే మాత్రం కాంగ్రెస్‌కు16-18, బీజేపీకి 10-12 ఇతరులకు 0-2 స్థానాలు వస్తాయని పేర్కొంది.

ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ నవంబర్ 10న జరిగే ఓట్ల లెక్కింపు దాకా ఇరు పార్టీ నేతలలో నెలకొన్న టెన్షన్ తగ్గించే అవకాశమే కానరావటం లేదు.