iDreamPost
android-app
ios-app

కౌన్ బనేగా టీఆర్ఎస్ క్యాండిడేట్?

  • Published Aug 02, 2021 | 10:52 AM Updated Updated Aug 02, 2021 | 10:52 AM
కౌన్ బనేగా టీఆర్ఎస్ క్యాండిడేట్?

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఒక్కరో ఇద్దరో కాదు.. డజనుకుపైగా లీడర్ల పేర్లను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రైవేటు వ్యక్తులతో హుజూరాబాద్ లో సదరు నేతలపై సర్వే చేయించారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం కూడా తెప్పించుకున్నారు. కానీ ఎవరిని నిలబెట్టాలనే దానిపై ఓ నిర్ణయానికి రాలేదు. దీంతో అటు తిరిగి, ఇటు తిరిగి మళ్లీ వ్యవహారం మొదటికి వస్తోంది.

కౌశిక్ రెడ్డి ఔట్..

హుజూరాబాద్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డిని నిలబెట్టవచ్చని టీఆర్ఎస్ వర్గాలు భావించాయి. ‘టీఆర్ఎస్ టికెట్ నాకే’ అని ఆడియోతో సహా దొరికిపోయి… కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు కౌశిక్ రెడ్డి. 10 రోజుల కిందట టీఆర్ఎస్ లోకి చేరినప్పుడు జరిగిన సమావేశంలో.. కౌశిక్ కు ప్రాధాన్యం ఇస్తామని, ఆయన సేవలు వినియోగించుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో హుజూరాబాద్ నుంచి పోటీ చేసేది కౌశిక్ రెడ్డేనని వార్తలు వచ్చాయి. కానీ ఉన్నట్టుండి కేసీఆర్ నిర్ణయం మార్చుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉప ఎన్నిక బరిలో కౌశిక్ రెడ్డి లేరనే విషయాన్ని స్పష్టం చేశారు.

Also Read : కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ సంతోష‌మే కానీ..?

ఎల్.రమణ.. పెద్దిరెడ్డి.. పొనగంటి లక్ష్మయ్య..

కౌశిక్ రెడ్డి ఆడియో వివాదం తర్వాత టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ పేరు తెరపైకి వచ్చింది. ఈటల రాజేందర్ బీసీ నినాదంతో ఎన్నికలకు వెళ్తుండటంతో.. బీసీ అభ్యర్థినే నిలబెడుతారనే ప్రచారం జరిగింది. దీంతో ఇప్పటికీ రమణ పేరు పరిశీలనలో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. మంత్రి పదవి ఇచ్చి మరీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు ఈటలను బీజేపీలోకి చేర్చుకోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఇనుగాల పెద్దిరెడ్డి మొన్ననే టీఆర్ఎస్ లో చేరారు. కానీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. వీళ్లే కాకుండా పొనగంటి లక్ష్మయ్య, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్లు కూడా వినిపించాయి.

ఈయన వైపు కేసీఆర్ మొగ్గు?

తెలంగాణ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పొనగంటి మల్లయ్యకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్.రమణకు కూడా ఓ పదవి ఇస్తానని కేసీఆర్ గతంలో ప్రకటించారు. వీరుకాక ప్రధానంగా వినిపించిన పేర్లలో చివరి వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్. టీఆర్ఎస్ వీ విద్యార్థి విభాగం అధ్యక్షుడైన శ్రీనివాస్ కు పార్టీలో మంచి పేరుంది. ఆయనకు కేటీఆర్‌ ఆశీస్సులు కూడా ఉన్నాయి. విద్యార్థి సంఘం నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, పార్టీ అభ్యర్థిగా పెద్దల ఆశీస్సులతో పోటీకి దిగుతారని చర్చ జరిగింది. ఈయన వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి కేసీఆర్ వెతుకులాట ఇక్కడితో ఆగిపోతుందా? లేక ఇంకొంత మంది పేర్లు బయటికి వస్తాయా? ఏమో మరి? పెద్దాయన ఆలోచన ఎలా ఉందో?

Also Read : పదవుల పంట.. కారును గమన్యానికి చేర్చునా..?