Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి. ఈ పరిణామాలన్నీ ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్టీకి దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. రాష్ట్రంలో కాస్తో కూస్తో పట్టున్న విశాఖలో మొత్తం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి తలెత్తింది. పరిపాలనా రాజధానిగా విశాఖ ప్రకటన వెలువడినప్పటి నుంచీ అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆ ప్రకటనతో విశాఖవాసులంతా వైసీపీకి వీరాభిమానులు అయిపోయారు. దీంతో రాజకీయ నేతలు కూడా వైసీపీ గూటికి చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఒక్కసారి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒకేసారి భారీ స్థాయిలో అందరూ వైసీపీ లో చేరే అవకాశాలు ఉన్నాయి. కానీ జగన్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో ఒక్కొక్కరుగా పార్టీలు మారుతున్నారు.
ఆనంద్ తో ఆరంభం..
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆడారి ఆనంద్‌కుమార్ టీడీపీ తరపున అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆయన విశాఖ డెయిర్‌కి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. తండ్రి ఆడారి తులసీరావు సీనియర్ తెలుగుదేశం నాయకులు. తండ్రి బాటలోనే ఆనంద్ కూడా టీడీపీలోనే కొనసాగారు. ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో ఆనంద్ పార్టీ మారిపోయారు. వైసీపీలో చేరారు. ఆయన తర్వాత మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్ కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు కూడా తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరిపోయారు. ఇటీవలే విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ కూడా వైసీపీకి మద్దతు తెలిపారు. ఆయన కుమారులను వైసీపీలో చేర్చారు.
కొత్త మెలికతో…
వాసుపల్లి గణేశ్ అనంతరం తర్వాత ఎవరు..? అనే చర్చ విశాఖలో మొదలైంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పుపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా అడుగు ముందుకు పడడం లేదు.
ఆయన అందరికంటే ముందుగానే వైసీపీ తీర్థం తీసుకునేందుకు యత్నించారు. కొన్ని రాజకీయ కారణాలతో కొన్నాళ్లు ఆ ప్రక్రియ ఆగింది. కొద్దిరోజుల క్రితం గంటా నేరుగా జగన్‌తోనే మాట్లాడుకొని చేరికకు ఏర్పాట్లు చేసుకున్నట్లు మరోసారి వార్తలొచ్చాయి. అయితే వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఆలోచించే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు కూడా పార్టీ మారతారనే ప్రచారం మొదలైంది. మరి ఏం జరుగుతుందో.. ఎవరు ముందో.. ఎవరు వెనకో.. వేచి చూడాలి.