iDreamPost
android-app
ios-app

లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన చివరి “స్వతంత్ర” అభ్యర్థి ఎవరు?

  • Published Jul 05, 2020 | 8:43 AM Updated Updated Jul 05, 2020 | 8:43 AM
లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన చివరి “స్వతంత్ర” అభ్యర్థి ఎవరు?

నేను కాదు నా తరుపున పూచిక పుల్లను పోటీకి పెట్టినా గెలుస్తుంది.. పార్టీ వాడికి టికెట్ ఇస్తుందా?. వాడ్ని ఓడించి నాసత్తా చూపిస్తాను… ఇలాంటి సవాళ్లు ఈ మధ్య తగ్గాయి కానీ ఒక దశాబ్ధం కిందటి వరకు ఇలాంటి సవాళ్లు ప్రతి ఎన్నికలో వినిపించేవి.. శాసనసభకు,లోక్ సభ ఎన్నికలలో చివరిసారి ఎవరు గెలిచారు?తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది.

70వ దశాబ్దంలో ఒక లోక్ సభ స్థానంలో సగటున మూడున్నర నుంచి నాలుగు లక్షల ఓట్లు ఉండగా 80లలో ఐదు నుంచి ఆరు లక్షలకు ఇప్పుడు 10 లక్షలకు చేరుకుంది. ఇన్ని లక్షల ఓట్లు ఉండే లోక్ సభ ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా గెలవటం అంటే మాటలా? అంత ఎందుకు గత ఆంధ్రా శాసనసభ ఎన్నికల్లో ఎంతమంది స్వతంత్రులు గెలిచారు?. ఆంద్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇండిపెండెంట్ గెలవలేదు … 2014లో ఇద్దరు ఇండిపెండెంట్స్ గెలిచారు.. మొదటి నుంచి ఇండిపెండెట్స్ గెలుస్తూనే వచ్చారు కాని మొన్నటి ఎన్నికలలో ఒక్కరు కూడా గెలవలేదు. జనసేన తరపున రాపాక వరప్రసాద్ గెలవకుండా ఉంటే కేవలం రెండే పార్టీలు గెలిచిన ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోయేది.

ఇంక విషయానికి వస్తే తెలుగుదేశం ఆవిర్భావం తరువాత లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్రంగా గెలిచినవారు లేరు. రాజకీయ దురంధరుడు, ఇందిరా కాంగ్రెస్ తరుపున 1978-1980 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన చెన్నారెడ్డి 1984 లోక్ సభ ఎన్నికలలో కరీంనగర్ నుంచి టీడీపీ మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో చెన్నారెడ్డి మీద కాంగ్రెస్ అభ్యర్థి చొక్కారావు 80 వేల మెజారిటీతో గెలిచారు. టీడీపీ ఆవిర్భవం తరువాత లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధీ గట్టి పోటీ ఇచ్చింది ఈ ఎన్నికలే… ఆ తరువాత జరిగిన తొమ్మిది ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎవరు రెండవ స్థానంలో కూడా నిలవలేదు.

టీడీపీకి పూర్వం

స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో అనేకమంది నాయకులకు వ్యక్తిగతంగా పేరు ఉండేది. పార్టీలతో సంబంధం లేకుండా కొందరు నాయకులు లోక్ సభ ఎన్నికల్లో గెలిచారు. అనేక సందర్భాలలో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు అన్ని కలిసి మంచి గుర్తింపు ఉన్న కాంగ్రెసేతర నాయకుడిని ఇండిపెండెంట్‌గా బరిలోకి దించి గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. సోషలిస్టు పార్టీ,స్వతంత్ర పార్టీ,ప్రజాపార్టీ,కృషికార్ లోక్ పార్టీ ,కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా అనేక పార్టీల మద్దతుతో వివిధ ఎన్నికల్లో పలువురు నాయకులు లోక్ సభకు ఎన్నికయ్యారు.

స్వతంత్రుల పోటీ – 1971 వైజాగ్

1971 ఎన్నికల్లో విశాఖపట్టణం నుంచి కాంగ్రెస్,స్వతంత్ర పార్టీ,జన సంఘ్,కమ్యూనిస్ట్ పార్టీల తరుపున అభ్యర్థులు పోటీకి నిలబడలేదు. సిట్టింగ్ ఎంపీ తెన్నేటి విశ్వనాథం మరోసారి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. కాంగ్రెస్ నాయకుడు పివిజి రాజు కూడా ఇండిపెండెంట్‌గా పోటీచేశారు. వీరిద్దరితో పాటు SN పాత్రుడు అని మరో నాయకుడు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు… అంటే ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ…

తెన్నేటి విశ్వనాథంకు విశాఖ పట్టణంలో మంచి పట్టు ఉండేది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి అనేక సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. పీవీజీ రాజుకు కూడా ప్రజల్లో మంచి పట్టు ఉండేది. పోటీ తీవ్రంగా ఉంది.. కాంగ్రెస్ తరుపున అభ్యర్థి లేకపోవటంతో కాంగ్రెస్ మద్దతుదారులు ఎవరికీ ఓటు వేయాలో తెలియని సందిగ్ధంలో ఉండిపోయారు..

పీవీజీ రాజు తన ప్రచారంలో ఎక్కడ కూడా ఇందిరాను విమర్శించకుండా, గెలిస్తే కాంగ్రెసులో చేరుతాను అంటూ ప్రచారం చేశారు. తెన్నేటి చాలా సంవత్సరాల కిందటే కాంగ్రెస్‌కు దూరం అయ్యారు. ప్రకాశం పంతులు గారితో కలిసి ప్రజాపార్టీలో కొంత కాలం కలిసి పనిచేశారు. ప్రకాశం పంతులు గారు 1953లో ప్రజాపార్టీని వీడి కాంగ్రెసులో చేరి ముఖ్యమంత్రి అయ్యారు.. తెన్నేటి విశ్వనాథం మాత్రం కాంగ్రెసులో చేరకుండా కొంత కాలం ప్రజాపార్టీని కొనసాగించారు. కొంతకాలం సోషలిస్టు పార్టీతో పని చేశారు. ఆ తరువాత నుంచి ఇండిపెండెంట్ గానే పోటీచేస్తూ వచ్చారు. దీనితో కాంగ్రెస్ ఓట్లు విశ్వనాథం కన్నా పీవీజీ రాజుకే ఎక్కువ పడ్డాయి. అంతిమంగా 67 వేల మెజారిటీతో పీవీజీ రాజు గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చివరిసారి ఇండిపెండెంట్‌గా ఎన్నికయ్యింది పీవీజీ రాజు .. ఆయన తరువాత మరెవరూ గెలవలేదు.

నిజమైన స్వతంత్ర వీరుడు తెన్నేటి విశ్వనాథం

1971లో పీవీజీ రాజు ఇండిపెండెంట్ గా గెలిచినా ఆ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ నుంచి అభ్యర్థి లేకపోవటం వలన దాన్ని ఎంతవరకు లెక్కలోకి తీసుకోవాలి?. స్వతంత్ర అభ్యర్థుల మధ్య జరిగిన పోటీలో ఎవరో ఒక స్వతంత్ర అభ్యర్థి గెలవటం సహజం ..

1967 లోక్ సభ ఎన్నికల్లో విశాఖపట్టణం నుంచి తెన్నేటి విశ్వనాథం స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయగా కాంగ్రెస్ తరుపున వెంకట్ రావ్ అనే నాయకుడు పోటీచేశారు . స్వతంత్రపార్టీ తరుపున అప్పారావ్ అనే నాయకుడు మరో ఇద్దరు ఇండిపెండెంట్ లు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తెన్నేటి విశ్వనాథం కాంగ్రెస్,స్వతంత్ర పార్టీల అభ్యర్థులను ఓడించి 35 వేల మెజారిటీతో గెలిచారు.

నాడు కాంగ్రెసుకు ప్రధాన ప్రత్యర్థి స్వతంత్ర పార్టీ. ముఖ్యంగా గౌతు లచ్చన్న నాయకత్వంలో ఉత్తరాంధ్రలో స్వతంత్ర పార్టీ బలంగా ఉండేది.1967 ఎన్నికల్లో కూడా స్వతంత్ర పార్టీ తరుపున శ్రీకాకుళం నుంచి గౌతు లచ్చన్న, పార్వతీపురం నుంచి వి యెన్ రావ్ ఎంపీ లుగా గెలిచారు. దీన్నిబట్టి అప్పట్లో స్వతంత్రపార్టీ బలాన్ని అంచనా వేయొచ్చు. బలమైన కాంగ్రెస్,స్వతంత్ర పార్టీలను ఢీకొట్టి ఇండిపెండెంట్ గా గెలిచిన తెన్నేటి విశ్వనాథంనే లోక్ సభకు ఎన్నికయిన చివరి ఇండిపెండెంట్ గా గుర్తించాలి.

1977 ఎన్నికల్లో జనతా పార్టీ తరుపున పోటీచేసిన తెన్నేటి విశ్వనాథం మీద కాంగ్రెస్ నేత ద్రోణం రాజు సత్యనారాయణ గెలిచారు. ఈ గెలుపుతో ద్రోణం రాజును జెయింట్ కిల్లర్ అని పత్రికలు రాశాయి. ఆ ఎన్నికలే తెన్నేటి విశ్వనాథంకు చివరి ఎన్నికలు. తెన్నేటి 84 సంవత్సరాల వయసులో 1979 లు చనిపోయారు.

తండ్రి కొడుకుల రాజకీయం

1971 గెలుపు తరువాత కాంగ్రెసులో చేరిన పీవీజీ రాజు చనిపోయేంతవరకు కాంగ్రెసులోనే కొనసాగారు. పీవీజీ చిన్న కొడుకు అశోక్ గజపతిరాజు 1978లో జనతాపార్టీ తరుపున పోటీచేసి గెలిచారు. పెద్ద కొడుకు ఆనంద్ 1980 లోక్ సభ ఎన్నికలలో జనతా(సెక్క్యులర్)/లోకదళ్ తరుపున అనకాపల్లి నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1983 ఎన్నికల్లో ఆనంద్ మరియు అశోక్ ఇద్దరు టీడీపీ తరుపున ఎమ్మెల్యేలు గా గెలిచారు. మొదట ఆనంద్ గజపతి రాజు ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు.

మంత్రిగా ఉన్న ఆనంద్ 1984 లోక్ సభ ఎన్నికలలో బొబ్బిలి నుంచి పోటీచేసి గెలిచారు. అన్న ఖాళీ చేసిన మంత్రి పదవి తమ్ముడు అశోక్ కు దక్కింది. తన కొడుకులు ఏపార్టీలో చేరినా పీవీజీ మాత్రం కాంగ్రెసులోనే ఉండిపోయారు. కొడుకుల తరుపున బహిరంగంగా ప్రచారం చేయలేదు.. తన కొడుకులకు మద్దతు ఇవ్వమని ఎవరిని అడిగినట్లు కూడా వార్తలు రాలేదు. తండ్రి,కొడుకులవి ఎవరి రాజకీయాలు వారివే అన్నట్లు పరిస్థితి ఉండేది. పీవీజీ రాజు డెబ్బయేళ్ళ వయస్సులో 1995 నవంబర్లో చనిపోయారు.

దీనితో ఇందిరా కాంగ్రెస్(ఐ)ని స్థాపించి 1978 మార్చిలో జరిగిన ఆంద్ర శాసనసభ ఎన్నికల్లో గెలిచారు. బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని జాతీయ కాంగ్రెస్ తరపున కేవలం 30 మంది మాత్రమే గెలిచారు. వారిలో 15 మంది వారంలోనే కాంగ్రెస్(I)లో చేరారు(వీరిలో వైస్సార్ కూడా ఉన్నారు).ఫలితాలు వచ్చిన ఆరు నెలలోనే మిగిలినవారు కూడా ఇందిరా కాంగ్రెసులో చేరారు. చివరికి బ్రహ్మానందరెడ్డి కూడా ఇందిరా కాంగ్రెసులో చేరారు. 1980 లోక్ సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్(I) మాత్రమే మిగిలింది.

1980 -నరసరావు పేట ఎన్నిక – కోడెల గురువు పోటి

ఇండిపెండెంట్ పోటీలలో 1971 ఎన్నికల తరువాత చెప్పుకోదగ్గది 1980 నరసరావుపేట లోక్ సభ ఎన్నిక. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి 1978 జనవరి మొదటి వారంలో ఇందిరా గాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు.

1980 లోక్ సభ ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డి నరసరావుపేట నుంచి పోటీచేశారు. ప్రతిపక్షాలు అన్ని కలిసి పోపూరి బ్రహ్మానందం అనే నాయకుడిని పోటీకి దించాయి. పోపూరి బ్రహ్మానందం సిపిఐ నాయకుడు, పల్నాడు ప్రాంతంలో కమ్యూనిస్టుల బలం ఎక్కువ ఉండేది. గురజాల, మాచర్ల నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. పక్కన ఉన్న సత్తెనపల్లెలో కూడా కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు.

పోపూరి బ్రహ్మానందంకు దూకుడు రాజకీయ నేతగా పేరుండేది. కమ్మ,రెడ్డి సామాజికవర్గాల నుంచి మంచి మద్దతు ఉండేది. వాస్తవంగా ఆ ఎన్నికల్లో కులం ప్రాతిపదిక కాదు. ఆ ఎన్నికల్లో పోపూరి బ్రహ్మానందం కు ఒక లక్షా యాబై వేల ఓట్లు వచ్చాయి. బ్రహ్మానందరెడ్డి 84 వేల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికే స్వతంత్ర అభ్యర్థి గట్టిపోటీ ఇచ్చిన చివరి లోక్ సభ ఎన్నిక …

1980 ఎన్నికల్లో ఓటమి తరువాత 1981 లో జరిగిన సమితి ఎన్నికల్లో పోపూరి బ్రహ్మానందం నర్సరావుపేట సమితి అధ్యక్షుడిగా గెలిచారు.

పోపూరి బ్రహ్మానందం కోడెలకు తొలి నాళ్లలో గురువు. 1983 ఎన్నికల్లో కోడెల తరుపున వ్యూహ రచన పోపూరి బ్రహ్మానందమే చేశారు. గెలిచిన తరువాత కోడెల పోపూరి బ్రహ్మానందం సలహాలను కాదని ఆయన్ని విస్మరించి ఒక కమ్యూనిస్ట్ లాయర్ (ఇప్పటికీ ఉన్నారు) సలహాలు పాటించటంతో 1984 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెసులో చేరి బ్రహ్మానందరెడ్డి విజయం కోసం పనిచేశారు. బ్రహ్మానంద రెడ్డి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. పోపూరి బ్రహ్మానందం చివరి రోజుల్లో రాజకీయ ప్రాధాన్యతను కోల్పోయారు . రాజకీయంగా ఎవరికీ చెందని నాయకుడిగానే చనిపోయారు.

ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభకు పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థుల చరిత్ర… రాబోయే కాలంలో శాసనసభకు కూడా ఇండిపెండెంట్‌గా గెలవటం కష్టం అవుతుంది..