iDreamPost
iDreamPost
తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈటల బీజేపీ చేరడంతో ఆ పార్టీ నుంచి ఆయనే అభ్యర్థి అని అందరూ భావిస్తున్నారు. ఈటలతోపాటు బీజేపీ నేతలు ప్రచారంలో, మీడియాతో ఇలానే మాట్లాడారు. ఇటీవల బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు కూడా పోటీలో ఈటల ఉన్నట్లుగానే మాట్లాడుకున్నారు. కానీ తాజాగా ఈటల రాజేందర్ సతీమణి జమున కాస్త ఆసక్తికర, మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా పోటీలో ఉండే అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యారు.
ఎవరు పోటీ చేయాలో నిర్ణయించలేదట
ఆదివారం హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఈటల జుమన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోటీలో తాను ఉన్నా, రాజేందర్ ఉన్నా ఒక్కటేనని.. అయితే ఇంకా ఎవరు పోటీ చేయాలన్నది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎవరికి అవకాశం వస్తే వారు పోటీ చేయాలన్న ఆలోచన ఉందని, ఎవరు పోటీ చేసినా గుర్తు అదే ఉంటుందని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటిదాకా ఈటల రాజేందరే బీజేపీ నుంచి పోటీలో ఉంటారని భావించగా.. తాజాగా జమున పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.
Also Read : న్యాయ రాజధాని దిశగా తొలి అడుగు!
సింపతీ ఓట్లు పడుతాయా?
ఈటల రాజేందర్ ను తెలంగాణ కేబినెట్ నుంచి అన్యాయంగా తొలగించారనే సింపతీ రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈటలపై మరింతగా సానుభూతి పెరిగింది. ఈ ప్రభావం ఒక్క హుజూరాబాద్ లో మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో కొంత ఉంది. ఆ సింపతీని క్యాష్ చేసుకోవాలంటే ఈటల రాజేందర్ పోటీలో నిలబడటం తప్పనిసరి. ఆయన భార్య పోటీలో నిలబడితే సానుభూతి ఓట్లు పడుతాయా అంటే అనుమానమే. గతంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడంతో ఉప ఎన్నిక జరిగింది. దుబ్బాకలో సోలిపేట భార్యను నిలబెడితే.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకు, సింపతీ ఓట్లు ఏవీ గెలిపించలేకపోయాయి. ఇప్పుడు జమున పోటీ చేస్తే అలాంటి ప్రతికూల ఫలితాలు వస్తాయనే కామంట్లు వినిపిస్తున్నాయి.
వ్యూహంలో భాగమా?
నిజానికి ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచే ఆయన భార్య జమున యాక్టివ్ అయ్యారు. ఈటల కంటే ఎక్కువగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఊర్లన్నీ చుట్టేస్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ పైనా తూటాల్లా విమర్శలు చేస్తున్నారు. దీంతో ముందు నుంచే వ్యూహం ప్రకారం ముందుకు సాగుతున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తన భార్యను హుజూరాబాద్ నుంచి గెలిపించుకుని, వచ్చే ఎన్నికల్లో ఈటల ఇంకో స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. లేదా లోక్ సభ స్థానానికి పోటీ చేయొచ్చన్న ఊహాగానాలూ ఉన్నాయి. జమున కామెంట్లపై ఈటల రాజేందర్, లేదా బీజేపీ హైకమాండ్ స్పందించాల్సి ఉంది. అప్పుడే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : డీఎస్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఇదేనా?