iDreamPost
android-app
ios-app

Chennai, Hyderabad, Floods- జలవిలయం… మన స్వయంకృతం

  • Published Nov 14, 2021 | 6:20 AM Updated Updated Mar 11, 2022 | 10:35 PM
Chennai, Hyderabad, Floods- జలవిలయం… మన స్వయంకృతం

శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంత పురోగతి సాధించినా ప్రకృతి ముందు మానవుడు ఎప్పుడూ అల్పుడే. చంద్రుని మీద పాదం మోపినా… వాతావరణ స్థితిగతులను ఖచ్చితంగా అంచనాలు వేసినా విపత్తులు సంభవించినప్పుడు చేష్టలుడిగి చూడడం మినహా చేయగలిగింది ఏమి లేదన్నట్టుగా సామాన్యుడి జీవితం మారిపోయింది. సాధించిన ప్రగతి అంతా నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోవడానికే ఉపయోపడగుతుంది. ఇదే సమయంలో మనిషి సాగిస్తున్న ప్రగతి వల్ల కూడా ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతుండడం దురుదృష్టకర పరిణామం. మానవుని స్వార్ధం కావచ్చు.. లేదా అవసరం కావచ్చు .. కారణం ఏదైనా నేటి విలయాలకు అంతిమంగా ప్రజలే కారణమువుతున్నారు.

భారీ వర్షాలకు చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. కొద్దిపాటి వర్షానికే ముంబై, హైదరాబాద్‌ వంటి నగరాలు జలదిగ్బంధనంలో చిక్కుకుంటున్నాయి. లోతట్టు కాలనీలు రోజుల తరబడి ముంపులో ఉంటున్నాయి. ప్రజల కష్టాలు, నష్టాలు అన్నీఇన్నీ కావు. ఇవన్నీ చూస్తుంటే మహానగరాల్లో నివాసం సురక్షతం కాదన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అల్పపీడనం, వాయుగుండం, తుఫాను ప్రభావాలతో గతంలో భారీ వర్షాలు కురిసేవి. కాని ఇటీవల కాలంలో మూడు రోజులు పాటు కురవాల్సిన వర్షం ఒకే రోజు కురుస్తుంది. జల విలయం సృష్టిస్తుంది. ఇందుకు కారణం కోస్తా తీరంలో ఆక్వాసాగు ఎక్కువగా పెరగడమే అంటే అతిశయోక్తి కాదు.

వర్షాల కోసం గతంలో మేఘమధనం చేసేవారు. సోడియం క్లోరేడ్‌, సిల్వర్‌ నైట్రేట్‌ మేఘాలలో చల్లేవారు. దీనితో మేఘాలు ఘనీభవించి వర్షం పడేది. కోస్తా జిల్లాల్లో ఆక్వా సాగు అంచనాలకు మించి పెరగింది. సాగుకు వాడే ఉప్పునీరు, రసాయనాల కలయక వల్ల సోడియం క్లోరైడ్‌ ప్రకృతిలో పెరిగింది. ఇదే సమయంలో మైనింగ్‌ వల్ల బయటకు వచ్చే కెమికల్స్‌ వాతావరణంలో కలిసి వర్షం పడేందుకు దోహదపడుతుంది. ఈ కారణాల వల్ల తీరప్రాంతంలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 50 సెంటీమీటర్లు దాటి వర్షం పడుతోంది. గతంలో ముంబైలో ఒక్కరోజే 90 సెంటీమీటర్ల వర్షం పడిన విషయం తెలిసిందే. సగటున రోజుకు 20 సెంటీమీటర్లకు పైబడి, మూడు నాలుజులు ఏకదాటీగా వర్షం కురవడానికి ఇదే కారణం. దీని వల్ల మహానగరాలు ముంపుబారిన పడుతున్నాయి.

కాకినాడ, చైన్నై, విశాఖపట్నం, ముంబై వంటి నగరాలు సముద్రమట్టంతో ఇంచుమించు సరిసమానంగా ఉన్నాయి. కాకినాడ 2 అడుగులు, కోనసీమ 3 అడుగులు, విశాఖ, చెన్నై వంటి నగరాలు 4 అడుగులుఎత్తులో ఉన్నాయి. ఉత్తర, దక్షణ ధృవాలు వేగంగా కరుగుతుండడం వల్ల ఏటా సముద్ర మట్టం సెంటీమీటరున్నర పెరుగుతుంది. దీని వల్ల ముంపునీరు దిగడం గతంకన్నా ఆలస్యమవుతోంది.అలాగే వాయుగుండం, తుఫానుల సమయంలో సముద్ర కెరటాలు ఎగిసిపడినప్పుడు ముంపు దిగని పరిస్థితి నెలకొంది.

Also Read : Konaseema Cyclone – కోనసీమ విషాదానికి పాతికేళ్లు

నగరాలు, పట్టణాలోనే కాదు.. ఒక మోస్తరు పల్లెల్లో కూడా అపార్ట్‌మెంట్‌ సంస్కతి పెరిగింది. ఒక ఇంటి నుంచి రావాల్సి మురుగు నీరు 20 నుంచి 100 ప్లాట్‌ల నుంచి వస్తుంది. ఇందుకు తగినట్టుగా డ్రైన్లను విస్తరించలేదు. పైగా నగరాల్లో చిన్నచిన్న డ్రెయిన్లు కబ్జా చేసి నిర్మాణాలు చేశారు.

 గతంలో వర్షాలు పడినప్పుడు భూమి ద్వారా చాలా వరకు నీరు ఇంకిపోయేది. ఇప్పుడు ఇళ్లు, ప్లాట్‌ల నిర్మాణాలతోపాటు సీసీ రోడ్ల నిర్మాణాలు పెరిగాయి. దీనితో పడిన వర్షం నీరంతా మురుగునీటి కాలువ ద్వారా బయటకు వెళ్లాల్సి వస్తుంది.

 ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెరగడం వల్ల మురుగునీటి కాలువలల్లో నీరుపారే సామర్ధ్యం పడిపోతుంది. చిన్న డ్రెయిన్ల నుంచి పెద్ద డ్రెయిన్ల వరకు ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల 40 శాతం ముంపునీరు దిగే సామర్ధ్యం తగ్గిందని అంచనా.

నగరాలు, పట్టణాల్లో చెరువులు, నదీపాయలు కబ్జాలు బారిన పడడం ముంపునకు పెను ముప్పుగా మారింది. హైదరాబాద్‌లో మూసీ నదీగర్భంలోనే ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జరిగాయి. హుస్సేన్‌ సాగర్‌ వంటి చెరువులు కబ్జాలలో ఉన్నాయి. చెన్నైలో అడయార్‌, కూవమ్‌ నదులతోపాటు చెరువులు కబ్జాలకు గురాయ్యయి. బకింగ్‌ హామ్‌ కెనాల్‌ చిక్కిశల్యమైంది. అడయార్‌ నదిపైనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. భారీ వర్షం కురిస్తే చెన్నై ఎయిర్‌ పోర్టు ముంపులో చిక్కుకోవడానికి కారణం ఇదే. ఇటువంటి కారణాల వల్ల వర్షం నీరు చెరువుల్లో సామర్ధ్యం మేరకు నిల్వ ఉండే పరిస్థితి లేదు. వీటి వల్ల లోతట్టు ప్రాంతాలే కాదు.. మెరక ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకుంటున్నాయి.
‘చెన్నై, ముంబై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో గతంలో ఒకేరోజు 50 సెంటీమీటర్ల వర్షం కురిసిన సందర్భాలున్నాయి. అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం తక్కువ. కాని ఈ స్థాయిలో ముంపులేదు. ఇప్పుడు ముంపునకు కారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెరగడంతోపాటు చెరువులు, మురుగునీటి కాలువలు కబ్జాలబారిన పడడమే’ అని గోదావరి కాలుష్యంపై అధ్యయనం చేస్తున్న అమలాపురం వాసి పెచ్చెట్టి కృష్ణ కిషోర్‌ తెలిపారు.


ఎత్తిపోతలే శరణ్యమా?:

సముద్ర మట్టాలు ఇదే విధంగా పెరిగితే భారీ వర్షాల సమయంలోనే కాదు.. సాధారణ సమయంలో కూడా ముంపునీరు ఎత్తిపోతల పద్ధతిలో సముద్రంలోకి తోడాల్సి వస్తుందని జాతీయ పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వ్యయ, ప్రయాసలతో కూడుకున్న అంశం. అయినప్పటికీ మరోదారి లేదు. అదే విధంగా మహానగరాల్లో ముంపు విషాదంగా మారుతున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముమ్మడిగా ముప్పును ఎదుర్కొనేందుకు మాస్టార్‌ ప్లాన్‌ అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. చెరువులు, నదీపాయలు, నాళాలు కబ్జాల నుంచి తొలగించాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణాలను క్రమబద్ధీకరణ చేయడంతోపాటు ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాల్సి ఉంది. లేకుంటే మన మహానగరాలు వర్షాకాలంలో ‘వెన్నిస్‌’నగరాన్ని తలపించనున్నాయి.

Also Read : Bhola Cyclone -అయిదు లక్షల మందిని అంతం చేసిన భోలా తుఫాను