iDreamPost
iDreamPost
త్రివిధ రక్షణ దళాల అధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్ను మూయడంతో ఆయన వారసుడు ఎవరన్న చర్చ మొదలైంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఎవరికి అవకాశం లభిస్తుంది.. ఎంపిక విధి విధానాలు ఏమిటి? సీడీఎస్ లేని కాలంలో ఎవరు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారన్న సందేహాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. బిపిన్ రావత్ మరణం నేపథ్యంలో కీలకమైన రక్షణ వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైనా కొత్త సీడీఎస్‌పై చర్చించలేదు. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం వారం రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితమే సృష్టించిన ఈ పదవిని తొలుత చేపట్టిన ఘనతను బిపిన్ రావత్ సొంతం చేసుకున్నారు. ఇంకో ఏడాది పదవీ కాలం ఉండగానే ఆయన కన్ను మూయడంతో ఇప్పుడున్న ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అధిపతుల్లో ఒకరికి ఆ అవకాశం లభిస్తుందంటున్నారు. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఉన్న ఎయిర్ మార్షల్ బలభద్ర రాధాకృష్ణ పేరు కూడా పరిశీలనకు రావచ్చంటున్నారు.
నియామక ప్రక్రియ ఉందా?
త్రివిధ రక్షణ దళాలను సమన్వయం చేసేందుకు సీడీఎస్ పోస్టు అవసరమన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. చివరికి 2019లో ప్రధాని నరేంద్ర మోదీ సీడీఎస్ పోస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే ఏడాది డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్‌గా రిటైర్ అయిన జనరల్ బిపిన్ రావత్‌ను తొలి సీడీఎస్‌గా నియమించారు. దీనికి సంబంధించి నిర్ధిష్టమైన నియామక ప్రక్రియ ఏదీ లేదు. సుదీర్ఘ అనుభవం, ప్రతిభ ఆధారంగా రాజకీయ నిర్ణయంతో ఈ పదవిని భర్తీ చేయాల్సి ఉంటుంది. రక్షణ వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో సీడీఎస్‌గా ఆర్మీకి చెందిన వారినే నియమిస్తున్నారు. దాన్నే అనుసరించడంతో పాటు త్రివిధ దళపతుల్లో అత్యంత సీనియర్, అపార ప్రజ్ఞాపాటవాలు ఉన్నందున ఆర్మీకి చెందిన బిపిన్ రావత్‌ను అప్పట్లో కేంద్రం సీడీఎస్‌గా నియమించింది.
ఆర్మీ చీఫ్‌కే ఎక్కువ అవకాశాలు
ప్రస్తుతం త్రివిధ దళపతుల్లో సీనియారిటీ ప్రకారం చూస్తే ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నెరవణేకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. బిపిన్ రావత్ తర్వాత రక్షణ దళాల్లో ఆయనే అత్యంత సీనియర్ అధికారి. బిపిన్ తర్వాత ఆర్మీ చీఫ్ అయిన ఆయన వచ్చే ఏప్రిల్లో ఆర్మీ నుంచి రిటైర్ కానున్నారు. ఇటీవలి వరకు తొలి వైస్ సీడీఎస్‌గా ఉన్న అడ్మిరల్ హరికుమార్ నవంబర్ 30న నేవీ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి కూడా సెప్టెంబర్ 30నే వాయుసేన అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరితో పోలిస్తే ఆర్మీ చీఫ్ నెరవణే సీనియర్. కాగా ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఉన్న బలభద్ర కృష్ణ పేరు కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం రావత్ స్థానంలో ఆయనే యాక్టింగ్ సీడీఎస్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే త్రీస్టార్ హోదా అధికారి కావడంతో సీడీఎస్ అయ్యే అవకాశం లేదంటున్నారు.
Also Read : Bipin Rawat Biography – జీవితాంతం దేశ రక్షణలోనే బిపిన్ రావత్