iDreamPost
android-app
ios-app

పోలవరం వివాదం.. ఎవరికి నష్టం..? ఎవరికి లాభం..?

పోలవరం వివాదం.. ఎవరికి నష్టం..? ఎవరికి లాభం..?

ఆంధ్రప్రదేశ్‌లో యువనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కువగా.. ప్రచారం తక్కువగా సాగిపోతున్నాయి. వరదల సమయంలోనూ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పోలవరం పనులను చూసిన ఏపీ ప్రజలు.. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు సాకారమవుతుందని ఆశిస్తున్న తరుణంలో తాజాగా ప్రాజెక్టు నిధులపై మొదలైన వివాదం అశనిపాతమైంది. వచ్చే ఏడాది డిసెంబర్‌ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే వైసీపీ ప్రభుత్వ లక్ష్యానికి తాజాగా మొదలైన వివాదం ఆటకం కలిగిస్తుందేమోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.

రివర్స్‌ టెండర్ల తర్వాత పనులలోనూ, నిధులలోనూ ఎలాంటి సమస్య లేకుండా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు నిధుల వివాదం నెలకొనడం వెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో చేరాలంటూ వైసీపీని బీజేపీ ఆహ్వానించిందనే ప్రచారం సాగింది. ప్రత్యేక హోదా ఇస్తేనే ఆలోచిస్తామని వైసీపీ స్పష్టం చేస్తూ ఆ ప్రచారానికి ముగింపు పలికింది. ఆ తర్వాతే పోలవరం ప్రాజెక్టు నిధులపై వివాదం చెలరేగిందనే చర్చ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో జరుగుతోంది.

పోలవరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని బీజేపీ తన రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తుందా..? అనే సందేహాలు తాజా పరిణామాలతో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. అలాంటిది నిధులపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేస్తూ రాజకీయ చర్చకు తెరలేపితే ఎవరికి నష్టం..? ఎవరికి లాభం..? అనే ప్రశ్నలు ఉత్పన్నమైతే.. నష్టపోయేది బీజేపీ అనే మాట వినిపిస్తోంది. ఏపీలో బీజేపీ సొంతంగా బలపడాలనే యోచిస్తోంది. అందుకు తగినట్లుగానే నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో రాజకీయాలు చేస్తోంది. టీడీపీ స్థానంలోకి వస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు కూడా చేశారు. 2024 ఎన్నికల్లో జనసేనతో కలసి ఏపీలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇలాంటి లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుకున్న బీజేపీకి.. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు. పోలవరం ఏపీ ప్రజల జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే మూడు ప్రాంతాలకు ఆయా ప్రదేశాల్లో పారుతున్న నదుల నుంచి నీరు అందుతుంది. విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది. బహుళార్థక ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తికి ఎవరు అడ్డంకులు సృష్టించినా.. వారికి నష్టం తప్పదని గత ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఘోర పరాభవం ద్వారా స్పష్టమవుతోంది.

కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా.. ప్రాజెక్టుకు ఖర్చు చేయడం, నిధుల లెక్కలు చెప్పడంపై, పనులు జరిగిన తీరు, జరిగిన ప్రచార్భాటం వల్ల టీడీపీ నష్టపోయింది. కేంద్ర నిధులు ఇస్తే.. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించి అవినీతి జరిగిందనే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. ఇరు పార్టీలు కలసి 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2018 వరకూ నాలుగేళ్లపాటు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం పంచుకున్నారు. అయినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. దీంతో ఏపీ ప్రజలు బీజేపీ, టీడీపీలకు తగిన విధంగా 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు.

ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ఉందని స్పష్టమవుతోంది. అవసరమైతే ప్రాజెక్టు పనులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని చెప్పిన వైసీపీ.. ప్రాజెక్టు పూర్తి కావడమే తమ లక్ష్యమని చాటి చెప్పింది. ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిధులపై చేస్తున్న ప్రకటనలు అంతిమంగా ఏపీలో ఆ పార్టీ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. అదే ప్రాజెక్టు పనులను కేంద్రమే చేపట్టి అనుకున్న లక్ష్యం లోపు పూర్తి చేస్తే.. బీజేపీ ఏపీలో ఎదిగేందుకు మంచి అవకాశం లభిస్తుందనేది ఓ విశ్లేషణ.