iDreamPost
iDreamPost
దేశ నూతన రాష్ట్రపతి ఎన్నికలకు వచ్చే ఏడాది వరకూ సమయం ఉంది. కానీ ఈలోగానే కొత్త రాష్ట్రపతిగా ఎవరూ అనే విషయమై చర్చోపచర్చలు మొదలయ్యాయి. కొందరి పేర్లు కూడా ప్రతిపాదనలు, ప్రస్తావనలోకి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ కి వచ్చే ఏడాది జూన్ 25 నాటికి ఐదేళ్ల పదవీకాలం ముగుస్తుంది. అంటే దాదాపుగా ఏడాది ముందు నుంచే కొత్త రాష్ట్రపతి గురించి చర్చ మొదలుకావడం విశేషం.
ఈసారి ఏకంగా రతన్ టాటా పేరుని సినీ నటుడు నాగబాబు ప్రతిపాదించడంతో సోషల్ మీడియాలో పలువురు సరైన సూచనగా భావిస్తున్నారు. నిజానికి రామ్ నాథ్ కోవింద్ సమయంలో కూడా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పేరుని కూడా కొందరు ముందుకు తీసుకొచ్చారు. రాజకీయాలతో ప్రమేయం లేని వారి పేర్లను ప్రతిపాదించడం ఇటీవల ఆనవాయితీగా వస్తోంది. కానీ రాష్ట్రపతిగా నిర్వహించాల్సిన విధులు, అధికారాల విషయమై స్పష్టత లేని సమయంలో వచ్చే సమస్యలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు ఏంటి
సహజంగా భారత రాష్ట్రపతిగా దేశంలో 35 ఏళ్ల వయసు నిండిన భారతీయ పౌరసత్వం కలిగిన వారందరూ దాదాపుగా అర్హులే. అయితే లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు కావాల్సిన అర్హతలు కూడా అవసరం. అదే సమయంలో ప్రభుత్వ సంస్థలు, లేదా ప్రభుత్వం ద్వారా ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్న పదవుల్లో ఉండకూడదనే నిబంధన కూడా ఉంది. రాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, ఢిల్లీ, పాండిచ్చేరి తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు కలిపి ఎన్నుకుంటారు. 2/3వ వంతు మెజార్టీతో గెలవాల్సి ఉంటుంది.
విధులేంటి
రాష్ట్రపతికి విశేష అధికారాలుంటాయి. అందులో శాసనపరమైన అధికారులు, కార్యనిర్వాహక అధికారాలు, న్యాయ పరమైన అధికారాలతో పాటుగా అత్యవసర అధికారాలు కూడా ఉంటాయి. అంటే దేశంలో సాధారణ చట్టాలు రూపొందించడం మొదలుకుని వాటి అమలు, న్యాయపరమైన చిక్కులు సహా అన్ని విషయాల్లోనూ రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలుంటాయి. అదే సమయంలో ఎమర్జెన్సీ విధించాలన్నా రాష్ట్రపతి నిర్ణయం మేరకే జరుగుతుంది.
అయితే రానురాను రాష్ట్రపతికి ఉన్న విశేష అధికారాలను కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలే వినియోగించుకోవడం జరుగుతోంది. రాష్ట్రపతి పదవిని కూడా దాదాపుగా రబ్బరు స్టాంపు అన్నట్టుగా చిత్రీకరించడం చూస్తున్నాం. విశేష అధికారాలున్న పదవిలో ఉన్న వారు వాటిని వినియోగించుకునే శక్తి సామర్థ్యాలు ప్రదర్శించడానికి బదులుగా ఆయా ప్రభుత్వాలతో రాజీపడడం దానికి మూలంగా ఉంది.
కీలక సందర్భాల్లో ముఖ్యపాత్ర
దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ నుంచి అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు ఆనాటి ప్రభుత్వాల వైఖరికి అనుగుణంగా వ్యవహరించిన అనుభవాలున్నాయి. చివరకు రాష్ట్రపతి పాలన విధిస్తూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాను కేంద్రం రద్దు చేసిన సమయాల్లో కూడా అదే రీతిన వ్యవహరించిన చరిత్ర ఉంది. కానీ కొందరు మాత్రం దానికి మినహాయింపుగానే చెప్పాలి. అందులో కొందరు రాష్ట్రపతులు ఆయా ప్రభుత్వాలు చెప్పింది ఆచరించడమే కాకుండా, భిన్నాభిప్రాయాలున్న సమయంలో నిక్కచ్చిగా నిలిచిన చరిత్ర కూడా ఉంది. కేంద్రం పంపించిన ప్రతీ ఫైల్ మీద సంతకం పెట్టే పని మాత్రమే తమది కాదని చెప్పిన అనుభవాలున్నాయి. అందులో కేఆర్ నారాయణన్ వంటి వారు తమ రాజనీతిజ్ఞతను ప్రదర్శించడం ద్వారా మంచి కీర్తి గడించారు. జైల్ సింగ్,నీలం సంజీవరెడ్డి,నారాయణన్ ,శంకర్ దయాళ్ శర్మ వంటి వారికి కూడా అలాంటి చరిత్ర ఉంది.
లోక్ సభలో బలాబలాలను బట్టి రాష్ట్రపతి సామర్థ్యం తెలుస్తుంది..
పార్లమెంట్ లో ఏకపార్టీ ఆధిక్యం ఉన్న సమయంలో రాష్ట్రపతికి పెద్దగా సమస్యలుండవు. కానీ బలాబలాల విషయంలో తేడాలున్న సమయంలో మాత్రం రాష్ట్రపతి కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరిని అధికారంలోకి పిలవాలి అనే విషయం నుంచి పార్లమెంట్ నిర్వహణ వరకూ అన్నింటా రాష్ట్రపతిది ముఖ్యభూమిక. రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రపతిని తొలగించడానికి మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంట్ కి మాత్రమే అవకాశం ఉంది. కానీ ఆ పార్లమెంట్ నిర్వహణ విషయంలో కూడా రాష్ట్రపతి దే పెద్ద పాత్ర. దేశంలో 1989 నుంచి పదేళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో రాష్ట్రపతులుగా పనిచేసిన వారంతా తమ సామర్థ్యాన్ని చాటుకున్నారు. అప్పటికే గవర్నర్లుగానూ, ఉప రాష్ట్రపతులుగానూ, వివిధ పదవులు నిర్వహించిన వారి అనుభవాన్ని రంగరించి రాజ్యాంగ పరిరక్షణలో ప్రధాన భూమిక పోషించారు.
ఇతర సామర్థ్యాలు ఎన్ని ఉన్నా..
దేశంలోనే కాకుండా ప్రపంచమంతా కీర్తి గడించిన అనేక మంది ప్రముఖులు ఉంటారు. వారికి వివిధ రంగాల్లో ప్రావీణ్యత కూడా ఉంటుంది. కానీ రాష్ట్రపతికి అవసరమైన పరిజ్ఞానం, రాజ్యాంగ అవగాహన, అవసరమైన సమయాల్లో దానిని వినియోగించే సామర్థ్యమే అత్యంత కీలకం. సైంటిస్టులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు కూడా ఆయా రంగాల్లో గొప్పవారే అయినప్పటికీ దేశ పాలనా వ్యవహారాల్లో వారికి ఉన్న సామర్థ్యమే రాష్ట్రపతి స్థానానికి ప్రధాన అర్హత అవుతుంది. గొప్ప క్రీడాకారులనే పేరుతో గౌరవంగా రాజ్యసభకు పంపిస్తే పలువురు ఆటగాళ్లు ఏం చేశారో చూశాము.
కాబట్టి భారత రాష్ట్రపతి పదవికి కేవలం త్యాగం చేశారని, ఇతర అర్హతలున్నాయనే కారణాలతో కాకుండా రాజ్యాంగ పరిరక్షకుడిగా ఎంతమేరకు తన పరిధిని విజయవంతం చేయగలరన్నది ప్రధానం అవుతుంది. ముఖ్యమైన సందర్భాల్లో దేశభద్రతకు కూడా రాష్ట్రపతి నిర్ణయమే ఆధారం అవుతుంది కాబట్టి అనేక అంశాల్లో నైపుణ్యత అవసరం ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రపతుల ఎంపిక జరిగితే అది దేశానికి మేలు చేస్తుంది. రాజ్యాంగాన్ని పరిపుష్టం చేసేందుకు దోహదపడుతుంది. దానికి భిన్నంగా ఏదో ఒక రంగంలో సాధించిన ఘనతను కొలమానంగా తీసుకుంటే చివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారు చెప్పిన దానికే తలాడించాల్సిన స్థితి పెరుగుతుంది.