iDreamPost
android-app
ios-app

‘కులం’ లేకుండా ఆయన లేడా!

  • Published Aug 24, 2020 | 7:00 AM Updated Updated Aug 24, 2020 | 7:00 AM
‘కులం’ లేకుండా ఆయన లేడా!

కులం.. ఇతర రాష్ట్రాల కంటే ఏపీ రాజకీయాల్లో ఈ కార్డు కొంచెం ఎక్కువే ప్రభావం చూపుతుందన్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే ఈ ధోరణి ముందునుంచీ ఉన్నది కాదని, ఎప్పుడైతే నారా చంద్రబాబునాయుడు అధికారంలో కొచ్చారో అప్పటి నుంచి మాత్రమే ఈ ధోరణి పెచ్చుమీరిందన్నది వారి వాదన.

తన అధికారం కోసం కులాలను పోత్రహించారని చంద్రబాబుపై ఉన్న ప్రధాన ఆరోపణ కూడాను. ఇది ఆరోపణ మాత్రమే కాదు అన్నట్లుగానే చంద్రబాబు వ్యవహారశైలి కూడా ఉంటుందన్నది ఇప్పటికే తేలిన వాస్తవం. తన పార్టీకే చెందిన వ్యక్తులు ఎవరైనా చట్టానికి చిక్కితే వెంటనే వారి కులాన్ని బైటకు తీసి, ఆ కులం నాయకులచేత ఖండించడం ఆయన ఇప్పటి వరకు అనుసరిస్తున్న వ్యూహం. దీని కారణంగా తెలుగుదేశం పార్టీ ఎంత వరకు ప్రయోజనం పొందింది అన్నది ప్రశ్నార్ధకమే.

ఎందుకుంటే ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీగా ఆవిర్భవించినప్పుడు రాష్ట్రంలోని అన్ని కులాలకు చెందిన ప్రతినిధులు ఆ పార్టీ వాయిస్‌ను బలం విన్పించేవారు. విపక్షాలను ఎదుర్కొవాల్సి వచ్చినప్పుడు సమిష్టిగానే సమాధానమిచ్చేవారు. అయితే చంద్రబాబు టీడీపీగా రూపాంతరం చెందాక ఏకులానికి, ఆ కులం నాయకులు మాత్రమే మైకుల ముందుకొస్తున్నారు. దీంతో ఎంతో విలువైన విషయమే అయినప్పటికీ అది కుల విషయంగా మాత్రమే మిగిలిపోతోంది. ఈ తేడాను అనుభవజ్ఞులు స్పష్టంగానే గుర్తించి ఈ తీరుపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.

అచ్చెన్నాయుడి ఈఎస్‌ఐ కేసు కావొచ్చు. డా. సుధాకర్‌ వ్యవహారం కావొచ్చు, రమేష్‌ హాస్పటల్స్‌ వ్యవహారం అయినా గానీ.. ఇక్కడ చంద్రబాబు వైపు నుంచి వచ్చే వాదనే విమర్శకులకు పనిపెంచుతోంది. ఆయా ఘటనల్లో తప్పు జరిగిందా? లేదా? అన్నది సూటిగా చెప్పకుండా (ఒప్పుకోకుండా) వారివారి కులాల్ని తెరమీదకి తెచ్చి వ్యవహారాన్ని పక్కదారి పట్టించే విధంగా చంద్రబాబు అనుసరించే వైఖరి ఆయన ఫార్టీటు ఇయర్స్‌ అనుభవానికి తగదన్న సలహాలు కూడా ఇవ్వాల్సి వస్తోంది.

ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న క్రైసిస్‌ పార్టీ ఏర్పడ్డాక ఎప్పుడూ ఎదుర్కొలేదన్నది రాజకీయ పండితుల ఖచ్చితాభిప్రాయం. వ్యక్తులను, సమాజాన్ని విడదీసి తన పబ్బం గడుపుకుందామన్న చంద్రబాబు ధోరణే ప్రస్తుతం ఆపార్టీ పరిస్థితికి కారణం అన్నది వారి పరిశీలనలో తేలిన వాస్తవంగా చెబుతారు.

ఉమ్మడి రాష్ట్రంలో పలు సమాజిక వర్గాలకు చెందిన వారు తమ స్వశక్తితో రాణించి వ్యాపార, రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. అయితే చంద్రబాబు అనుసరించిన కుల వ్యూహం కారణంగా ఆయన సొంత సామాజికవర్గానికే ఎక్కువ ఇబ్బందులు ఏర్పడ్డాయన్నది ఇతర పార్టీల్లోని అదే సామాజికవర్గం నాయకులు తేల్చి చెబుతున్నారు. మొదట్లో ఇది వ్యతిరేక పార్టీల్లోని వారి అభిప్రాయంగానే ఉన్నప్పటికీ, వాస్తవాలను, సమాజంలో ఎదురవుతున్న ఫలితాలను గమనించాక అందరిలోనూ ఇదే అభిప్రాయం విస్తృతమవుతున్న దాఖలాలు కన్పిస్తున్నాయి.

దీంతో చంద్రబాబు అనుసరించిన కుల వ్యూవహం ఎవరికి ప్రయోజనం చేకూరింది అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఆయనొక్కడికే (మూడు సార్లు సీయంగా అయ్యేందుకు) తప్పితే ఎవ్వరికీ పెద్దగా ప్రయోజనం కలగలేదన్న సమాధానం కూడా వెనువెంటనే వచ్చేస్తుంది.