iDreamPost
android-app
ios-app

జగన్, మమతా బెనర్జీల దారిలోనా..జ్యోతిరాదిత్యా బాటలోనా

  • Published Jul 14, 2020 | 12:29 PM Updated Updated Jul 14, 2020 | 12:29 PM
జగన్, మమతా బెనర్జీల దారిలోనా..జ్యోతిరాదిత్యా బాటలోనా

సచిన్ పైలట్. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ తో ముడిపడిన కుటుంబం నుంచి వచ్చిన నేత. తండ్రి రాజేష్ పైలట్ వారసత్వంతో రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ సారధిగా ఎదిగారు. రాజీవ్ గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన తండ్రి హఠాన్మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాహుల్ కి సన్నిహితుడుగా ఎదిగారు. మొదట పార్లమెంట్ లో జాతీయ రాజకీయాల్లోనూ, అనంతరం రాజస్తాన్ రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకంగా ఎదిగారు. కానీ చివరకు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం అర్థాంతరంగా ముగిసింది. అనూహ్యంగా ఆయన ఎత్తులు ఫలించకపోవడంతో తీవ్ర ఎదురుదెబ్బ తినాల్సి వచ్చింది. చివరకు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు రాక తప్పని పరిస్థితిని ఆయన కొనితెచ్చుకున్నట్టు కనిపిస్తోంది.

కానీ కాంగ్రెస్ ని వీడాల్సిన స్థితిలో ఉన్న సచిన్ పైలట్ దారి ఎటు అన్నదే ఆసక్తికరమే. అదే ఇప్పుడు చర్చకు ఆస్కారం ఇస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి సొంత పార్టీలతో అధికారాన్ని దక్కించుకున్న ఇద్దరు నేతల అనుభవాలున్నాయి. అందులో మొదటి నాయకురాలు మమతా బెనర్జీ కాగా, రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బెంగాల్ లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ ని స్థాపించి, నాటి సీపీఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అధికారాన్ని దక్కించుకున్న మమతా బెనర్జీకి వ్యక్తిగతంగా మంచి గుర్తింపు ఉంది. నాయకురాలిగా తానేంటో ఆమె నిరూపించుకున్నారు. ఆ తర్వాత అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా సొంతంగా వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసుకుని, 8 ఏళ్లలో అధికార పీఠం ఎక్కడం అందరికీ తెలిసిందే. అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ జగన్ తన రాజకీయ ప్రస్థానంలో లక్ష్యాన్ని చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్ పునాదులకు గండి కొట్టిన ఇద్దరు నేతల దారిలో సచిన్ పైలట్ సాగుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కానీ వారిద్దరితో పోలిస్తే సచిన్ కి వ్యక్తిగతంగానూ, రాజస్తాన్ కి వ్యవస్థాపరంగానూ అనేక వైరుధ్యాలున్నాయి. ముఖ్యంగా తగిన నాయకత్వం లేని కారణంగా కాంగ్రెస్ కుదేలయ్యింది. ఆపార్టీ స్థానంలో సొంత పార్టీలతో ఈ ఇద్దరు నేతలు బలపేడేందుకు దోహదపడింది. కానీ రాజస్తాన్ దానికి భిన్నం. సంప్రదాయంగా కాంగ్రెస్ కి బలం ఉంది. రెండు ప్రధాన పార్టీల మధ్య వైరంలో స్థిరంగా ఆపార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది. దానికి తోడు రాజస్తాన్ కాంగ్రెస్ కి రాజకీయ నాయకత్వం లోటు కూడా లేదు. అశోక్ గెహ్లాట్ తర్వాత ఆయన తనయుడిని ప్రోత్సహించే ప్రయత్నం జోరుగా సాగుతోంది. దాంతో వైభవ్ గెహ్లాట్ కాబోయే నాయకుడిగా ఇప్పటికే ప్రచారం మొదలయ్యింది. కొన్నాళ్లుగా కాంగ్రెస్ వ్యవహారాల్లో చురుగ్గా పనిచేస్తున్న అశోక్ వారసుడికి పార్టీ మీద పట్టు సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చని చెబుతున్నారు

ఇలాంటి పరిస్థితుల్లో సచిన్ పైలట్ కి రెండో దారి జ్యోతిరాదిత్య బాటలో బీజేపీ కండువా కప్పుకోవడమే. ఆపార్టీ ఇప్పటికే సచిన్ కి తలుపులు తెరిచి ఉంచింది. సచిన్ పైలట్ తో పాటుగా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు కూడా వస్తారని ఆశించింది. రాజస్తాన్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే సంకేతాలు పంపించింది. కానీ తీరా చూస్తే ప్రస్తుతానికి ప్రభుత్వం సేఫ్ జోన్ లో ఉండడంతో కమలనాధులు ఆశించిన ఫలితం రాలేదనే చెప్పవచ్చు. కానీ సచిన్ పైలట్ లాంటి నాయకుడు వస్తే ఆపార్టీకి మరింత ఉపయోగపడుతుంది. కానీ రాజస్తాన్ బీజేపీలో ఇప్పటికే వసుంధర రాజే తర్వాత ఆమె తనయుడు, నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన దుష్యంత్ సింగ్ ఉన్నారు. వారితో పాటు మజీ సీఎం తనయుడు, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్ కూడా సొంత రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. అలాంటి వారందరినీ కాదని సచిన్ సారధ్యంలోకి బీజేపీ రావడం అంత సులువు కాదు.

జ్యోతిరాదిత్యకు కుటుంబీకులంతా బీజేపీ, సంఘ్ పరివార్ తో సంబంధీకులు కావడం, మధ్యప్రదేశ్ రాజకీయాల్లో శివరాజ్ సింగ్ తర్వాత స్టామినా ఉన్న నేత లేకపోవడంతో లైన్ క్లియర్ గా ఉంది. కానీ బీజేపీలో చేరితే సచిన్ కి అలాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి సొంతంగా పార్టీ పెట్టుకుని సత్తా చాటేందుకు సిద్ధపడడమా లేక కాంగ్రెస్ లో సర్ధుకుపోవడమా అన్నది ఆయన చేతుల్లో ఉంది. రెండూ కాదని బీజేపీలో చేరితే మాత్రం సచిన్ కి పెద్దగా కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదు. మహా అయితే కేంద్రంలో మంత్రి కాగలరేమో అని మాత్రం చెప్పవచ్చు.