iDreamPost
android-app
ios-app

రాధే శ్యామ్ ఇంకెప్పుడు నిర్ణయిస్తాడు

  • Published Sep 23, 2020 | 7:57 AM Updated Updated Sep 23, 2020 | 7:57 AM
రాధే శ్యామ్ ఇంకెప్పుడు నిర్ణయిస్తాడు

బాహుబలి, సాహోల తర్వాత ప్రభాస్ చేస్తున్న రాధే శ్యామ్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ లాక్ డౌన్ రాకపోయి ఉంటే ఈ దసరాకో లేదా దీపావళికో ఖచ్చితంగా విడుదలయ్యేది. ఇప్పటికైతే షూటింగును ఎప్పటి నుంచి రీ స్టార్ట్ చేయాలనే దాని మీద యూనిట్ పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు సమాచారం. వచ్చే నెల రెండు వారాల పాటు ఇటలీ షెడ్యూల్ చేయబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు, వీసా తదితర పనులు అన్నీ పూర్తి చేస్తున్నారట. అది పూర్తయ్యాక మళ్ళీ విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా మిగిలిన బ్యాలెన్స్ అంతా హైదరాబాద్ లోనే పూర్తి చేస్తారు. గ్రీన్ మ్యాట్ వాడాల్సిన సీన్స్ దాదాపు ఇక్కడే పూర్తయ్యాయి.

సో రాధే శ్యామ్ షూట్ కు సంబంధించిన డౌట్స్ అయితే క్లియర్ అయినట్టే. ఇక పాటల చిత్రీకరణ సంగతి తేలాల్సి ఉంది. ట్విస్ట్ ఏంటంటే ఇంత జరిగాక కూడా సంగీత దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. సాహో తరహాలోనే జాప్యం చేసుకుంటూ వచ్చి చివరి నిమిషంలో ప్రకటించేలా ఉన్నారు. అయితే దీని వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. సాహోకి ఇలాగే ఆఖరి నిమిషంలో ముగ్గురు నలుగురిని తీసుకొచ్చి సాంగ్స్ చేయిస్తే ఏదీ గొప్పగా అనిపించే స్థాయిలో క్లిక్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం జిబ్రాన్ ను విడిగా తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రాధే శ్యామ్ వంతు వచ్చింది. మూడు నాలుగు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు.

ఫామ్ లో ఉన్న థమన్ లేదా దేవిలాంటి వాళ్ళనో తీసుకోకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే సందేహం రావడం సహజం. అయితే నేషనల్ మార్కెట్ లో ఆడియో సేల్ అవ్వాలంటే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు అయితేనే బెటరని హిందీ వెర్షన్ నిర్మాణ సంస్థ టి సిరీస్ ఒత్తిడి చేయడం వల్లే ఇలా జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. మరి ఆ భేదం ఉన్నప్పటికీ కీరవాణి తన సంగీతంతో బాహుబలి ద్వారా నార్త్ ఆడియన్స్ ని మెప్పించారుగా. అయినా వందల కోట్ల బడ్జెట్ తో రూపొందే సినిమాలకు ఇలాంటి జాప్యం జరగడం ఎంత మాత్రం మంచిది కాదు. తగినంత సమయం ఇస్తే మంచి అవుట్ ఇవ్వడానికి ఏ సంగీత దర్శకుడైనా ప్రయత్నిస్తాడు. అలా కాకుండా రిలీజ్ డేట్ అనుకున్నాక తీసుకుంటే అదిగో సాహో లాగే మళ్ళీ దెబ్బ తినే ప్రమాదం ఉంది. మరి రాధే శ్యామ్ మేకర్స్ ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారో లేదో వేచి చూడాలి