ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడూ? 2021-22 బడ్జెట్ ఎప్పుడు ఆమోదిస్తారు?
మళ్ళీ ఓటాన్ అకౌంట్ తప్పదా?
స్థానిక ఎన్నికల షెడ్యూల్ తో కొత్త సమస్యలా?
ఇదే చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ ఆమోదానికి గత ఏడాది కరోనా కారణమయ్యింది. లాక్ డౌన్ కారణంగా పూర్తి బడ్జెట్ కి అవకాశం లేకుండా పోయింది. 2019-20 బడ్జెట్ కూడా సాధారణ ఎన్నికల మూలంగా అదే పరిస్థితి. ఇప్పుడు మళ్లీ వరుసగా మూడో ఏడాది సైతం పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు స్థానిక ఎన్నికలు అడ్డంకి అవుతాయా అనే అనుమానం వస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలిదశ పోలింగ్, రెండో దశ నామినేషన్ల ఉపసంహరణ, మూడో దశ నామినేషన్ల ప్రక్రియ నడుస్తోంది. ఈనెల 23 నాటికి గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. ఆ తర్వాత మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ఎస్ఈసి ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికలు కూడా తదుపరి ఉంటాయని ప్రచారం సాగుతోంది. ఇవన్నీ తన హయాంలోనే జరిగిపోవాలని నిమ్మగడ్డ ఆశిస్తున్నారు. మార్చి 31తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. ఇక అప్పటివరకు ఎన్నికల కోడ్ కొనసాగించాలనే లక్ష్యంతో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న నిమ్మగడ్డ చివరకు బడ్జెట్ ఆమోదానికి కూడా అడ్డుపడాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తోంది.
తెలుగుదేశం గత ఏడాది కూడా 9 నెలల కాలానికి ప్రతిపాదించిన బడ్జెట్ అడ్డుకునే యత్నం చేసింది. మండలిలో ఆర్థిక బిల్లుని ఆమోదించకుండా మెలిక పెట్టింది. చివరకు ఉద్యోగుల జీతాల చెల్లింపు సమస్య వస్తుందని తెలిసినా తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టు సాగింది. ఈసారి కూడా బడ్జెట్ విషయంలో అదే పంథాలో సాగుతోంది. అందుకు నిమ్మగడ్డని అడ్డుపెట్టుకుని ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి గతంలో కరోనా పేరుతో వాయిదా వేసిన మున్సిపల్, మండల,జిల్లా పరిషత్ ఎన్నికలుమొదట పూర్తి చేసి ఉంటే పార్టీ రహిత ఎన్నికలు కాబట్టి పంచాయతీ ఎన్నికల వల్ల బడ్జెట్వాయిదా వేయాల్సిన అవసరం ఉండేది కాదని నిపుణులు చెబుతున్నారు.నిమ్మగడ్డ దానికి విరుద్ధంగా వ్యవహరించడం వెనుక పూర్తి బడ్జెట్ పెట్టకుండా అడ్డుకోవాలనే లక్ష్యం ఉన్నట్టుగా కొందరు సందేహిస్తున్నారు. తెరవెనుక రాజకీయాల్లో దిట్టగా చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి స్కెచ్ వేసినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఆర్ధికమంత్రి బుగ్గన గవర్నర్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ విషయం చర్చకు వచ్చి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.