వలస పాలకుల ఉక్కు సంకెళ్లు తెగిపోయాయి. రెండు శతాబ్దాలకు పైగా బ్రిటిష్ చేర నుంచి భారతమాతకు విముక్తి లభించింది. ఎందరో మహానుభావుల త్యాగఫలంగా దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. దానికి గుర్తుగా మన త్రివర్ణ పతాకం సగర్వంగా వినువీధిలో రెపరెపలాడింది. సరిగ్గా 75 ఏళ్ల క్రితం 1947 ఆగస్ట్ 14వ తేదీ అర్థరాత్రి దేశానికి స్వాతంత్య్రం లభించింది. అప్పటి నుంచి ప్రతియేటా ఆగస్ట్ 15ను జాతీయ పండుగగా జరుపుకొంటున్నాం. కానీ జాతీయ పతాకం ఎర్రకోటపై మొదటిసారి ఎగిరింది ఆ రోజు కాదని మనలో ఎందరికి తెలుసు?. జనగణమన గీతం కూడా అప్పటికి జాతీయ గీతం హోదా పొందలేదు. స్వాతంత్ర్యం సిద్ధించడానికి కారకుడైన జాతిపిత మహాత్మాగాంధీ తొలి స్వాతంత్ర్య వేడుకలకు ఎందుకు దూరంగా ఉండిపోయారు?.. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకొంటున్న వేళ ఆ విశేషాలు తెలుసుకుందాం.
ఆగస్ట్ 16న తొలి రెపరెపలు
1947 ఆగస్ట్ 14వ తేదీ అర్థరాత్రి మన దేశానికి బ్రిటీషర్లు స్వాతంత్య్రం ప్రకటించారు. దాంతో ఆగస్ట్ 15న మనం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటున్నాం. ఆ రోజు దేశ ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం సంప్రదాయంగా వస్తోంది. కానీ తొలి స్వాతంత్ర్య దినోత్సవమైన 1947 ఆగస్ట్ 15న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరలేదు. ఎందుకంటే నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి పదవి చేపట్టలేదు. స్వాతంత్య్రం ప్రకటించిన 14వ తేదీ అర్థరాత్రి ఢిల్లీలోని వైస్రాయ్ లాంజ్ (ఇప్పటి రాష్ట్రపతి భవన్) నుంచి స్వాతంత్ర్య సందేశం ఇచ్చి.. అక్కడే జెండా ఎగురవేశారు. ఆ మరుసటి రోజు 15న కూడా అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ తన కార్యకలాపాలు కొనసాగించారు. ఆ రోజే నెహ్రూ ఆయనకు తన మంత్రి మండలి సభ్యుల జాబితా అందజేసి ఆమోదం పొందారు. 15 మంది మంత్రులతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఇండియా గేట్ వద్ద ప్రిన్సెస్ గార్డెన్లో జరిగిన సభలో మాట్లాడారు. ఆ మరుసటి రోజు అంటే ఆగస్ట్ 15న ప్రధానమంత్రి హోదాలో చారిత్రక ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ఆప్పటి నుంచి ప్రతి ఆగస్ట్ 15న ఎర్రకోటపై పతాకావిష్కరణ సంప్రదాయంగా మారింది.
మూడేళ్ల తర్వాత జనగణమనకు జాతీయ హోదా
మనకు స్వాతంత్య్రం వచ్చే నాటికి ప్రత్యేకంగా జాతీయ గీతం లేదు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జనగణమన గీతాన్ని 1911లోనే రచించారు. ఆ ఏడాది డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో దాన్ని మొదటిసారి ఆలపించారు. అప్పటినుంచి స్వాతంత్ర్యోద్యమంలో ఆ గీతం వినిపిస్తున్నా స్వాతంత్య్రం సాధించిన తర్వాత మూడేళ్ల వరకు జాతీయ గీతం హోదా పొందలేదు. భారత్ పూర్తిస్థాయి గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన 1950 జనవరి 26కు రెండు రోజుల ముందు అంటే జనవరి 24న జనగణమనకు ప్రభుత్వం జాతీయ గీతం హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది.
మహాత్మాగాంధీ దూరం
1947 ఆగస్ట్ 15న జరిగిన తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహాత్మాగాంధీ పాల్గొనలేదు. అసలు ఆ రోజు ఆయన ఢిల్లీలోనే లేరు. దేశానికి ఆగస్ట్ 15న స్వాతంత్య్రం ఇవ్వనున్నట్లు బ్రిటిష్ పాలకుల నుంచి స్పష్టమైన సమాచారం అందిన వెంటనే జవాహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయనకు ఒక లేఖ రాశారు. ఉత్సవాల్లో పాల్గొని తమను ఆశీర్వదించాలని కోరారు. ఆ సమయంలో ఢిల్లీకి చాలా దూరంగా పశ్చిమ బెంగాల్లోని నోవాఖలిలో నిరాహార దీక్షలో ఉన్న గాంధీ బెంగాల్లో హిందూ ముస్లిం ఘర్షణలు చెలరేగి ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటుంటే.. తాను ఢిల్లీ వచ్చి ఉత్సవాల్లో పాల్గొనలేనని తిరుగు సమాధానం పంపారు. నిరాహారా దీక్షలో ఉన్న తాను మత ఘర్షణలు తగ్గే వరకు ప్రాణం పోయినా సరే తిరిగి రానని గాంధీ స్పష్టం చేశారు.