iDreamPost
android-app
ios-app

శ్వేత పత్రంలో ఇవి కూడా చెబుతారా బాబూ..?

  • Published Aug 07, 2020 | 9:04 AM Updated Updated Aug 07, 2020 | 9:04 AM
శ్వేత పత్రంలో ఇవి కూడా చెబుతారా బాబూ..?

ప్రచారం లేకపోతే ఉండలేని ప్రాణులు కొన్ని ఉంటాయి. అందులో అగ్రగణ్యుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు అని ఆయన్ను ఎరిగిన వారు చెబుతుంటారు. దీన్ని నిజం చేస్తున్నట్లుగానే ఆయన ప్రవర్తన కూడా ఉంటుంది. అధికారం లో ఉండగా చేసిన ప్రచారం గిమ్మిక్కులు గమనించిన ప్రజలు పక్కనెట్టేశారు. కానీ ఆయన ఇంకా సితార సినిమాలో జమీందారు లాగా వ్యవహరిస్తూ జనాన్ని ఎంటర్టైన్ చేటున్నారు. రాజినామాల డెడ్ లైన్ విషయంలో తేలిపోయిన చంద్రబాబు తాజాగా ప్రతి రెండురోజులకు మీడియా ముందుకు వచ్చి జనాన్ని చైతన్యం చేస్తానని, అమరావతి పై శ్వేత పత్రం రిలీజ్ చేస్తానని.. కొంచెం అటూ ఇటూ గా భీష్మ ప్రతిజ్ఞ లాంటిది చేసేసారు.

గతంలో కూడా ఇలాంటివి ఆయన దగ్గర చాలా చూసాం, చెప్పినంత హడావిడి చేతల్లో ఉండదని కొందరు ఊరుకున్నారు. ఇంకొందరైతే మంచిపనే చేస్తున్నారని అభినందించే ప్రయత్నమే చేశారు. ఐతే ఇప్పుడు చర్చ అంతా శ్వేత పత్రంలో చంద్రబాబు ఏమి చెబితే బాగుంటుందో కూడా ఆయన అభిమానులు, వ్యతిరేకులు కూడా ఉదహరిస్తున్నారు.

వికేంద్రీకరణకు అనుకూలంగా శివరామ కృష్ణన్ కమిటీ నివేదికను పక్కన బెట్టి నివేదికకు పూర్తి వ్యతిరేకంగా అమరావతిని ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది? కేవలం రాజధాని డిజైన్లకు కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? దేశంలో ఇంజనీర్లు లేరా?

అసలు “చంద్రబాబు రాజధాని”లో కట్టినవి శాశ్వత భవనాలా? తాత్కాలిక భవనాలా? ఒకవేళ తాత్కాలికమే ఐతే, ప్రభుత్వం భూమి ఇచ్చినా కూడా చదరపు అడుగుకు 11 వేలు ఎందుకు ఖర్చు అయ్యింది?

టిడిపి నాయకులు, వారి బంధు మిత్ర గణాలు అమరావతిలో భూములు కొన్నది నిజమా కాదా?

ప్రతిపక్షాలు చేస్తున్న ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సూటిగా సుత్తిలేకుండా వివరణ. రాజధాని తరలింపు విషయంలో కేంద్రం కలుగజేసుకోవాలని కోరుతున్న చంద్రబాబు, ఏర్పాటు సమయం కేంద్రం అనుమతి ఎందుకు తీసుకోలేదు? లాంటి జనం నుంచి వచ్చే ప్రశ్నలకు కూడా చంద్రబాబు శ్వేత పత్రం లో చోటు కల్పించి సమాధానాలు చెబితే చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నానికి జనం ఆమోదం లభిస్తుంది. విశ్వసనీయత పెరుగుతుంది. మాకు అటువంటిదేమి లేదంటారా ఇక చెప్పేదేముంటుంది. ఎప్పటి మాదిరిగానే చంద్రబాబు ప్రచారంగానే ఇదికూడా మిగిలి పోతుంది. తనకు తానుగానే కొంచెం విలువ తగ్గించుకున్న వారవ్వడం ఖాయం అన్నది సర్వజనాభిప్రాయంగా వినిపిస్తోంది.

పాపం సొంత మీడియాను జనం నమ్మడం మానేయడంతో సోషల్ మీడియాలో వైరల్ విషయాలను కూడా తన ప్రచారానికే వాడేసుకుంటున్నారన్న అపవాదు కూడా ఇటీవలే బాబుగారి కీర్తి కిరీటంలో చేరిందాయే. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు సొంత జిల్లా ఐన చిత్తూరులో ఓ పేద రైతు తన కూతుళ్ళతో నాగలి దున్నాడం తెలుసుకుని ఎక్కడో ముంబైలో ఉన్న సోనూసూద్ స్పందించాడు. ఆ విషయం వైరల్ అయింది. దీన్నికూడా తనకు అనుకూలం మార్చుకునే ప్రయత్నం తిప్పికొట్టి.. చంద్రబాబు మీదకే తిరిగి విమర్శలు రేగాయి. చేసే పనిలో చిత్తశుద్ధి లోపిస్తే వచ్చే ఫలితమే అది. ఇప్పుడు శ్వేత పత్రం విషయంలో కూడా తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నిస్తే మరోసారి నవ్వులపాలు కాక తప్పదు.