iDreamPost
iDreamPost
రాష్ట్రంలో బలమైన సామాజికవర్గాల్లో ఒకటైన కాపు సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకుని రాజకీయ లబ్ది పొందే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కుల అజెండాను బయటపెట్టారు. కాగా తెలుగుదేశం మొదటి నుంచీ కాపు సామాజికవర్గాన్ని అవసరం ఉన్నప్పుడు వాడుకుంటూ.. అవసరం లేనప్పుడు కూరలో కరివేపాకులా తీసి పారేయడం అలవాటుగా మార్చుకుంది. అందుకే గత ఎన్నికల్లో ఆ సామాజికవర్గ ఓటర్లు టీడీపీని దూరం పెట్టి వైఎస్సార్సీపీని అక్కున చేర్చుకున్నారు.
దాన్ని విస్మరించిన టీడీపీ నేతలు ఇప్పుడు మళ్లీ కాపు వర్గంపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో కాపులను నిర్లక్ష్యం చేసిన విషయాన్ని మరుగు పరిచి రెండున్నరేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం కాపు సామాజికవర్గానికి చేసిందేమీ లేదని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం కాపులకు ఎన్నో పథకాలు అమలు చేసిందని.. ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయడంలేదని ఆరోపించారు. దాంతో ఏ ప్రభుత్వం హయాంలో కాపుల సంక్షేమానికి ఎం చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read : బీజేపీలో ఆ ముగ్గురి కథ ముగిసిందా?
రెండున్నరేళ్లలోనే రూ. 12 వేల కోట్లు
కాపుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రజాసంకల్ప యాత్రలోనే జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల కోసమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా కాపు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు, ఉపాధి అవకాశాలు పెంచే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించే మేళాలు, విదేశాల్లో చదువుకునేవారికి ఆర్థిక సాయం వంటివన్నీ ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు.
కాపు సామాజికవర్గంలో 45-60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందించే కాపు నేస్తం పథకం అమలు చేస్తున్నారు. ఇవి కాకుండా సమాజంలో ఇతర వర్గాలతోపాటు పేద కాపులకు అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, చేదోడు, విదేశీ విద్యా దీవెన తదితర పథకాలు అమలు చేస్తున్నారు. ఇవన్నీ కలిపి గత రెండున్నరేళ్లలో కాపు సామాజికవర్గ సంక్షేమానికి సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేశారు.
Also Read : Gazette Notification – ప్రాజెక్టులు అప్పగింత లేదు .. అధ్యయనం కోసం కమిటీ
మభ్యపెట్టిన మాయ చేసిన టీడీపీ
గత టీడీపీ హయాంలో కాపులను మభ్యపెట్టి మోసం చేశారు. దానికి నిరసనగానే 2016లో ఆ సామాజికవర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించింది. ఆ సందర్బంగా ముద్రగడ సహా కాపు నాయకులు, యువతపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధించింది. చివరికి ఒత్తిడికి తట్టుకోలేక కాపుల అభివృద్ధికి ఏటా వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ. 5వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రూ.100 కోట్లకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అలాగే కాపులను బీసీ జాబితాలో చేర్చి 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.
అక్కడ ఉన్నది టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే అయినా.. రిజర్వేషన్ ఉత్తర్వులు జారీ చేయించడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. చివరికి కేంద్రం దాన్ని తిరస్కరించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతంలో.. కాపుల 5 శాతం చేర్చి చంద్రబాబు తెలివిగా కొత్త చిచ్చు రగిలించారు. దాంతో అది పెండింగులో పడిపోయింది. ఈ వాస్తవాలను విస్మరించి టీడీపీ హయాంలో కాపులకు ఎంతో చేశారని ఆ పార్టీ నాయకులు చెప్పడాన్ని కాపు వర్గీయులు తప్పుపడుతున్నారు. టీడీపీ మేలు చేసి ఉంటే గత ఎన్నికల్లో ఆ వర్గీయులు ఎందుకు ఆ పార్టీని తిరస్కరించారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Also Read : Drugs Trafficking – చంద్రబాబు తాను చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా, మళ్లీ యూటర్న్ తీసుకుంటారా