iDreamPost
android-app
ios-app

చెప్పింది ఆకాశమంత – కట్టింది అణువంత

  • Published Aug 05, 2020 | 4:10 AM Updated Updated Aug 05, 2020 | 4:10 AM
చెప్పింది ఆకాశమంత – కట్టింది అణువంత

29000 మంది రైతుల వద్ద 33000 ఎకరాల పంట భూమి , 21000 ఎకరాల ప్రభుత్వ భూమి తీసుకొని crda ఏర్పాటు చేసి మీరు ఏ మహా నగరాన్ని నిర్మించారు బాబూ ?

అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు ,దానికేం ఖర్చు పెట్టాల్సిన పనిలేదు ,అదే సంపాదించుకొంటుంది. ఇప్పటి వరకూ పెట్టిన పెట్టుబడి చాలు అంటున్న బాబు గారు అమరావతిలో ఇప్పటిదాకా నిర్మించిన కట్టడాలు , ఆరాకొరాగా పనులు మొదలైన కట్టడాలు ఏంటీ అన్నది ఒక్క సారి చూద్దాం .

నిర్మాణం పూర్తయిన కట్టడాలు :

తాత్కాలిక అసెంబ్లీ , తాత్కాలిక సెక్రటరియేట్ ,
అంతర్గత దారులు కలిపి = 47.00 ఎకరా (526.52 కోట్లు)
తాత్కాలిక హై కోర్ట్ = 8.40 ఎకరా (176 .00 కోట్లు)

మొత్తం పూర్తయిన నిర్మాణాలు = 55.40 ఎకరాలు

నిర్మాణం ప్రారంభమైన కట్టడాలు :

గెజిటెడ్ ఆఫీసర్స్ బిల్డింగ్స్1,2 ctg = 11.50 ఎకరా
Crda బిల్డింగ్. = 5.78 ఎకరా
4th క్లాస్ ఎంప్లాయి బిల్డింగ్స్ = 13.00 ఎకరా
MLA,MLC నివాసాలు. = 10.48 ఎకరా
జడ్జిల నివాసాలు = 5.63 ఎకరా
IAS,IPS ల నివాసాలు = 6.00 ఎకరా
సెక్రటరీల నివాసాలు 1,2 ctg = 12.00 ఎకరా
NGO హౌసింగ్ = 26.60 ఎకరా
మంత్రుల క్వార్టర్సు. = 5.39 ఎకరా

నిర్మాణం జరుగుతున్న కట్టడాలు = 96.38 ఎకరాలు

ఈ నిర్మాణాలు కొన సాగుతున్న కట్టడాలు కూడా 20 శాతం నుండి 60 శాతం లోపు పనులు జరిగినవే . అంటే తాత్కాలిక కట్టడాలు మూడూ వదిలేస్తే బాబు గారు నికరంగా పూర్తి చేసింది ఒక్క డిజిపి బిల్డింగ్ మాత్రమే . ఈ నూట యాభై ఎకరాల కట్టడాలు కాక సీడ్ యాక్సెస్ రోడ్ , కనెక్టింగ్ రోడ్లు , డ్రైనేజ్ , ఇతర వసతుల కోసం ఇంకో రెండు వందల ఎకరాలు వాడుకలోకి తెచ్చినా మొత్తంగా రైతుల దగ్గర తీసుకొన్న 33 వేలు , ప్రభుత్వ భూమి 21 వేలు కలిపి 54000 ఎకరాలలో 350 ఎకరాల భూమికి మించి సద్వినియోగంలోకి తీసుకురాలేకపోయాడు . అంటే ఒకశాతం నగరం కూడా నిర్మించలేకపోయాడు.

ఈ రోజు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదంటున్న బాబు ఈ అరాకొరాగా మొదలెట్టిన నిర్మాణాలకు ఎవరు ఖర్చు పెడతారో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎలా పొందుతుందో చెప్పే ప్రయత్నం మాత్రం చేయలేదు .

2014 ఎన్నికలకు ముందు విభజిత రాష్ట్రానికి అనుభవుజ్ఞుడనైన తానైతే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని కొన్ని మీడియా సంస్థలతో ఉదృతంగా ప్రచారం చేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికని అనుసరించకుండా, రాష్ట్రంలో విపక్షాలతో సంప్రదింపులు లేకుండా అఖిల పక్షం ఏర్పాటు చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ ఇదిగిదిగో రాజధాని , అదిగదిగో రాజధాని అంటూ పలు ఊహాగానాలు రేపిన మీదట ప్రస్తుత 29 గ్రామాలతో కూడిన ప్రాంతాన్ని నిర్ధారించారు .

నికరంగా 150 ఎకరాల కట్టడాలు నాలుగేళ్లలో కట్టలేక కేవలం 50 ఎకరాలలో మూడు తాత్కాలిక కట్టడాలు కట్టి బేజారుమన్న బాబు గారు కనీసం ఓ ఎనిమిది వేల ఎకరాలలో సిటీ నిర్మించాలంటే ఎన్నేళ్ళు పడుతుంది . ఇటీవల ఆయన చెప్పినట్టు ఇంకో ఇరవై ఏళ్ళు బతికి రాజ్యమేలినా 600 ఎకరాలకి మించి నిర్మాణాలు చేయలేడనేది సత్యం .

నిర్మాణాలు 150 ఎకరాల్లోనే చేసినా భూ పందేరాలు వేల ఎకరాల్లోనే చేశారు బాబు గారు , కొన్ని ప్రభుత్వ సంస్థలకు అధిక ధరలతో భూములు కేటాయించిన టీడీపీ ప్రభుత్వం , ప్రయివేటు సంస్థలకు మాత్రం అవసరాన్ని బట్టి , ప్రాధాన్యతని బట్టి అనే పడికట్టు పదాల్ని మెన్షన్ చేస్తూ హోటల్స్ కి , ప్రయివేటు విద్యా సంస్థలకు , కార్పొరేట్ సంస్థలకు , ప్రీమియం యోగా సెంటర్స్ కి నామ మాత్రపు ధరలకు 1,239 ఎకరాలు కేటాయించడం విశేషం .

ఇది కాక సింగపూర్ కన్సార్టియంకి ప్రధానమైన స్టార్టప్ ఏరియా 1631 ఎకరాల్లో ఉచితంగా 50 ఎకరాలు , నామమాత్రపు ధరకు 200 కేటాయించి అభివృద్ధికి పెట్టుబడి మొత్తం ప్రభుత్వం పెట్టేట్లు , లాభాల్లో మాత్రం అగ్రభాగం సింగపూర్ కి , నామమాత్రపు లాభం ప్రభుత్వానికి వచ్చేట్టు కుదుర్చుకున్న అగ్రిమెంట్ పై భవిష్యత్ లో ఏదైనా వివాదం వస్తే న్యాయం కోసం భారత న్యాయ వ్యవస్థల పరిధిలో కాకుండా లండన్ కోర్ట్ లో కేసు వేయాల్సిన విధంగా నిబంధనలు రూపొందించటం పలు అనుమానాలకు విమర్శలకు తావిచ్చినా అవేమీ పట్టించుకోకుండా భూ పందేరాలు చేసేసారు .

ఇహ ఇంసైడర్ ట్రేడింగ్ గురించి , భూ అక్రమాల గురించి , బినామీల భాగోతం గురించి తర్వాతి కాలంలో పలు ఆరోపణలు రావటమే కాకుండా , ప్రాధమిక ఆధారాలతో కొందరు వ్యక్తులు , అధికారులు అరెస్ట్ కూడా కాగా , దాదాపు 4000 ఎకరాల పై చిలుకు భూమిని బినామీ పేర్లతో లోకేష్ , ఇతర మంత్రులు , నాయకులు కైవసం చేసుకున్నారని ఇందులో భాగంగా 803 మంది తెల్ల రేషన్ కార్డు దారుల చేత కొనిపించారని ఈ అక్రమాలన్నింటి పై విచారణ చేయించి దోషుల్ని శిక్షిస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రాధమిక ఆధారాలతో ప్రకటించింది .

ఏదేమైనా హడావుడిగా ల్యాండ్ పూలింగ్ అని , 2017 నాటికి అభివృద్ధి చేసిన ప్లాట్స్ ఇస్తామని రైతులను మభ్యపెట్టి 33 వేల ఎకరాల భూమి , 21 వేల ఎకరాల ప్రభుత్వ భూమి తీసుకొని సాగుకు పనికిరాకుండా చదును చేసి , ప్లాట్స్ చూపించకుండా పాడు పెట్టారు చంద్రబాబు . ఈ అనాలోచిత , దురుద్దేశ్యపూర్వక చర్యల వలన రైతులు , సమాజం ఎంత తీవ్రంగా నష్టపోయింది .

1. ముక్కారు పంటలు పండే ధాన్యాగారం లాంటి భూమిని లాక్కోవటం
2. స్వయంకృషితో పంట పండించి సగర్వంగా జీవించే రైతుల్ని మోసం చేసి సకాలంలో ప్లాట్స్ ఇవ్వకపోవడం రైతులకు జరిగిన నష్టం, .
3. సాధారణ భూములు వాడకుండా నదీ పరివాహక , మూడు పంటలు పండే భూముల్ని తీసుకొని పంటలు పండించకుండా నాశనం చేయడం జాతీయ ఆహార భద్రతా కు నష్టం,.
4. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందేట్లు ఆలోచించకుండా అనంతలో , కర్నూల్ లో నిర్మించాల్సిన సంస్థల్ని కూడా అమరావతిలో నిర్మించ తలపెట్టటంతో సీమ అస్తిత్వాన్ని దెబ్బకొట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ..
5. రైతులకు సకాలంలో అభివృద్ధి చేసిన ప్లాట్స్ ఇవ్వక , చెప్పినట్టు నిర్మాణాలు చేయకుండా రోజుకో ప్లాన్ తో మాయమాటలు చెప్పి ఈ రోజు రైతులు రోడ్డు పాలయ్యి వ్యవస్థకు వ్యతిరేకంగా నినదించే పరిస్థితికి తీసుకురావడం , ఇందులో కూడా టీడీపీ నాయకుల ప్రయోజనాల కోసం వారిని అమాయకుల్ని చేసి వాడుకోవడం సమాజ ద్రోహం .
6.నేడు వారిని అగమ్యగోచర పరిస్తితుల్లోకి నెట్టి బినామీల ద్వారా తన గుప్పిట్లో ఉంచుకొని అమరావతి పోరాటాల పేరిట వారి భుజం పైన తుపాకీ ఉంచి వెనక ఉండి తమ ప్రయోజనాల మేరకు కధ నడపడం .

నాలుగేళ్లలో కట్టిన 150 ఎకరాలకు కాక మిగిలిన 32850 ఎకరాలను పాడు పెట్టి నాలుగేళ్ళ నుండి రాష్ట్ర ఖజానా నుండి చెల్లిస్తున్న కవులు ధనం ప్రభుత్వానికి భారం కాదా ? . రాష్ట్ర ప్రజలందరి ఉమ్మడి సొత్తు అయిన ప్రభుత్వ ధనాన్ని ఒక ప్రాంతంలో భూముల అభివృద్ధి పేరుతో పాడు పెట్టి వారి రుణాలు ఏకమొత్తంగా మాఫీ చేసి , వారికి కవులు ఇస్తూ , అక్కడ వ్యవసాయం పై ఆధారపడ్డవారికి పింఛన్ ఇస్తూ (బినామీలకు కూడా) పలు సౌకర్యాలు కల్పిస్తూ , అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్లాట్లు ఇస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాగా వేసిన వారి భూముల విలువ పెంచుతూ ఖజానా పై తీవ్ర భారాన్ని మోపి సాధిస్తుంది ఏంటి .

పైగా ఇన్ని చెల్లిస్తూ ప్రతి రోజూ రాష్ట్రం కోసం , రాజధాని కోసం తమ భూముల్ని , భవితవ్యాన్ని త్యాగం చేసి తమ జీవితాల్ని , ప్రాణాల్ని పణంగా పెట్టామని రోజూ ఆ ప్రాంత రైతుల చేత మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఏంటి .

అన్ని ప్రాంతాల ప్రజల ఉమ్మడి ఆస్తి అయిన రాష్ట్ర ఖజానా పై అంతులేని భారాన్ని మోపుతూ రాజధాని , అభివృద్ధి మొత్తాన్ని ఒక చోట కేంద్రీకృతం చేస్తూ నిధులు మొత్తం ఒక ప్రాంతానికే వెచ్చిస్తూ ఆ ప్రాంతానికి అపార విలువ కట్టబెట్టే ప్రయత్నం మిగతా ప్రాంతాలకు ద్రోహం కాదా , ప్రాంతాల మధ్య అసమానతలు పెంచే చర్యలు కావా . పైగా అమరావతి కోసం రాష్ట్రం మొత్తం అర్రులు చాస్తుంది అని ఉద్యమ రంగు పులిమే ప్రయత్నం హాస్యాస్పదమే కాదు . ఇతర ప్రాంత ప్రజల్లో అసహనానికి , ప్రాంతీయ వివాదాలకు కారణం అవుతుంది .

ఇప్పటికైనా చంద్రబాబు భ్రమల్లో నుండి బయటికి వచ్చి , రైతుల్ని , రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడం ఆపేయాలి, రైతులు ఎం నష్టపోయారో వెల్లడించాలి. భూములిచ్చిన నిజమైన రైతులు సైతం ఏకీకృతమయ్యి , తామేమి నష్టపోతున్నామో తమకేమి కావాలో ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలి . ఒక ప్రాంతమే కాకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందే ప్రయత్నాలకు టీడీపీ సహకరిస్తుందో లేదో తెలియదు కానీ ఇలా పదే పదే అడ్డం తగులుతూ స్వప్రయోజనాల కోసం వివాదాస్పదం చేయడం ఆపకపోతే రాజధానితో పాటు అన్ని ప్రాంతాల ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకోవడంతో పాటు ఉనికి కోల్పోతుంది అని చెప్పొచ్చు …