Idream media
Idream media
టిడిపి ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చారు. అయితే ఆ సమావేశంలో రాసుకొచ్చి పాఠం చదివి. వినిపించారు. టిడిపి నేతలు ఎప్పుడూ ప్రభుత్వంపై విమర్శించినట్లే ఈ మీడియా సమావేశంలో కూడా లోకేష్ అదే పనిచేశాడు.
లాక్ డౌన్ తరువాత తొలిసారిగా మీడియా ముందు వచ్చిన లోకేష్ బాబు…వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చాలా రోజుల తరువాత మీడియా సమావేశంలో మాట్లాడిన లోకేష్ కొన్ని అంశాలపై అవగాహన రాహిత్య వ్యాఖ్యలు చేశారు.అతను చెప్పదలచుకున్న విషయానికి సంబంధించి ప్రింట్లు పట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. లోకేష్ ఎల్లో మీడియాలో ప్రచురించిన అన్ని వార్తలను చదివి వినిపించాడు.
తెలుగు మీడియం పాఠశాలల ప్రాముఖ్యత గురించి చెబుతూ తెలుగు మీడియం పాఠశాలలో నేర్చుకుని పరీక్షల గురించి చెప్పడానికి ఒక ఉదాహరణగా చూపించవచ్చని అన్నారు. తెలుగు మీడియం గురించి ఎల్లో మీడియాలో వచ్చిన పుంఖాల పుంఖాల కథనాలు చదివి వినిపించారు. తాను ఇంగ్లీషు మీడియంలో చదవడం వల్లనే తెలుగు సరిగా మాట్లాడలేకపోతున్నానని లోకేష్ సెలవిచ్చారు. అందుకే మీడియంను ఎంచుకునే ఆప్షన్ విద్యార్థులకు ఇవ్వాలని, ఇంగ్లీషు తెలుగు మీడియంలో ఏదో ఒకటి ఎంచుకునేందుకు అవకాశం కల్పించాలని లోకేష్ వ్యాఖ్యల సారాంశం.
ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న లోకేష్ వాదనే కరెక్ట్ అనుకుందాం. మరి ఆయన కొడుకుకి లోకేష్ ఏ అప్షన్ ఇచ్చాడు? దేవాన్ష ని అడిగి ఇంగ్లీషు మీడియంలో చేర్పించాడా..? తానూ ఇంగ్లీష్ మీడియంలో చదవటం వల్లనే తెలుగుతో ఇబ్బంది పడుతున్నాను అని చెప్పిన లోకేష్ తన కొడుకుకు ఆ ఇబ్బంది కలగకూడదని తెలుగు మీడియంలో చదివిస్తున్నారా?ఇంగ్లీష్ మీడియంలో చదవటం వల్లనే తెలుగు సరిగా రాదన్న లోకేష్ .. మరి తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ మీద పట్టు సాధించలేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న యువత గురించి ఎందుకు మాట్లాడరు?ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుతున్నది ఎవరు?ఆర్ధికంగా పూర్తిగా వెనుకబడి ,నెలకు 500 రూపాయల కాన్వెంట్ ఫీజు కూడా చెల్లించలేని వారి పిల్లలు కదా?అంటే అవకాశం లేని వారు మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు,ఇలాంటి వారి కోసం జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఎందుకీ యాగీ?
ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల తెలుగురాదని లోకేష్ వాదన వాస్తవానికి దూరంగా ఉంది. ఆయనకు తెలుగు రాకపోతే ఇంగ్లీష్ చదివిన వారందరికి అందరికి రాదని అనడం దారుణం. ఇంగ్లీషు మీడియంలో చదివి తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడిన వారెందరో ఉన్నారు. అలాంటి వారు టిడిపిలో కూడా ఉన్నారు అది కాస్త లోకేష్ తెలుసుకోవాలి. తెలుగు మీడియంలో చదవడం వల్ల ఇంగ్లీష్ రానోళ్లు కూడా అదే పార్టీలో మంత్రులుగా చేసిన వారున్నారు. ఇప్పుడు నేతలుగా ఉన్నవారున్నారు. ఇలాంటి వాస్తవాలను తెలుసుకోకుండా లోకేష్ బాబు మాట్లాడారు.
ఇక సాక్షి పేపర్, సాక్షి ఛానల్ తెలుగు మాధ్యమాన్ని ఆంగ్లంలోకి మార్చమని అతను సలహా ఇచ్చాడు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలని ఒక అసంబద్ధ వాదన చేశాడు.ఈ వాదన లోని లాజిక్ ఎవరికి అర్థం కాలేదు. దీంతో జర్నలిస్టులు అయోమయంలో పడ్డారు. లోకేష్ వాదనలో పసలేదని స్పష్టం అవుతుంది.
తెలుగు మీద అంత మక్కువ ఉంటే నాడు చంద్రబాబు పాలనలో లోకేష్ మంత్రిగానే ఉన్నారుగా…అప్పుడేం చేశారు..? తెలుగు అభివృద్ధికి ఏం చర్యలు చేపట్టారు..? తెలుగు భాషా సంఘాన్నైనా పటిష్ఠం చేశారా..? ఒక్క జీవోనైనా తెలుగులో ఇచ్చారా..? హైకోర్టు తీర్పులను తెలుగులో ఇప్పించారా..? అవేం చేయని వారు ఇప్పుడు ఒక్కసారిగా తెలుగు మీద ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నారు..? ఎందుకంటే ఆ అంశం పెట్టుకొని రాజకీయం చేయడానికే కదా..!
ఈ ప్రెస్ మీట్ ఫినిషింగ్ టచ్ ఏమిటంటే…తన ట్వీట్లు వైసిపి నాయకుల్లో వణుకుపుట్టిస్తున్నాయని పేర్కొన్నారు. “వైసిపి నేతలు నా ట్వీట్లతో వణికిపోతున్నారు. ఈ కోవిడ్ సీజన్ తరువాత నేను క్షేత్రస్థాయిలోకి వస్తే వారి పరిస్థితి ఏంటీ?” అని లోకేష్ అనడంతో అందరు ఒకసారి ఉలుక్కిపడ్డారు. ఇలాంటి నోటి దురుసు, బాధ్యతరాహిత్య, అవగాహన రహిత వ్యాఖ్యలు వల్లే ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీ చిత్తుగా ఓడించిన విషయాన్ని లోకేష్ మరిచిపోయారా..? క్షేత్ర స్థాయిల్లో ప్రజల వద్దకు వెళ్తే…ఛీకొడతారు. మేము ఆపదలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో సైకిల్ పై షికార్లు కొట్టి…ఇప్పుడు మా ముందుకు వస్తావా అని కడిగేస్తారు. అది లోకేష్ తెలుసుకోవటం లేదు. అందుకనే చిత్తుగా ఓడిపోయారు.
ప్రశ్నలు అడిగేందుకు జర్నలిస్టులకు లోకేష్ అవకాశం ఇచ్చాడు. కానీ లోకేష్ జర్నలిస్టుల ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా పక్కదారి పట్టారు.