iDreamPost
android-app
ios-app

Vangalapudi Anitha – అనిత తాపత్రయం..!

  • Published Dec 23, 2021 | 2:25 PM Updated Updated Dec 23, 2021 | 2:25 PM
Vangalapudi Anitha – అనిత తాపత్రయం..!

ఏడారిలో మండుటెండలో ఐస్‌క్రీమ్‌ దొరికినవాడి ఆనందంలా ఉంది తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైఖరి. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందంటూ సినీ హీరో నాని చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆమె బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టేసే యత్నం చేశారు. హీరో నాని ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాడు కాబట్టి వారి ఇంట్లో మహిళలను ఇప్పుడు మంత్రులు టార్గెట్ చేస్తారని జోస్యం చెప్పేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి అశోక్ గజపతి తల్లిని తిట్టిన మంత్రులకు నాని కుటుంబ సభ్యులను తిట్టడం పెద్ద లెక్క కాదని వ్యాఖ్యానించారు. పెద్ద హీరోలు విజయవాడ వచ్చి సీఎం జగన్‌ను, మంత్రి పేర్ని నానిని కలిసి వెళ్లడం కాదని, సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న అన్యాయంపై నాని లాగా పెద్ద హీరోలు నోరు విప్పాలని కోరారు. అన్ని రంగాలకు జగన్ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.

ఏమి కల్పనా చాతుర్యం!

అధికార పక్ష నాయకులు ముఖ్యంగా మంత్రులు మహిళలను అవమానపరుస్తున్నారు అనే ఒక అవాస్తవాన్ని నిజం చేయడానికి పచ్చబ్యాచ్‌ కొద్దిరోజులుగా గట్టి ప్రయత్నమే చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీపై అలిగి బయటకు వచ్చేసింది మొదలు ఆ పార్టీ నాయకులంతా ఈ ప్రచారాన్ని భుజానికెత్తుకున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించినవారి ఇంట్లో మహిళలను మంత్రులు తిడతారనే అభిప్రాయం ప్రజల్లో కల్పించడానికి తాపత్రయపడుతున్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ నాయకులు బూతులు మాట్లాడుతున్నారంటూ టీడీపీ నాయకులు రోజూ ఆరోపణలు చేయడం, దానికి పచ్చ మీడియా దరువేయడం నిత్యకృత్యం అయిపోయింది. అందులో భాగంగానే వంగలపూడి అనిత హీరో నాని కుటుంబ సభ్యులను మంత్రులు టార్గెట్‌ చేస్తారని జోస్యం చెప్పడం. మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తల్లిని తిట్టిన మంత్రులకు నాని కుటుంబ సభ్యులను తిట్టడం పెద్ద లెక్క కాదని అనిత వ్యాఖ్యనించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

 ఆల్‌ రెడీ మంత్రులు అశోక్ గజపతిరాజు తల్లిని తిట్టేశారు అని జనం అనుకోవాలన్నది ఆమె వ్యూహం అని అర్థం అవుతోంది. ఏ మంత్రులు, ఎప్పుడు అశోక్‌ గజపతి తల్లిని తిట్టారు? అన్నది ఆమెకే తెలియాలి. విజయనగరంలో జిల్లా రామతీర్థంలో బోడికొండపై కోదండరామ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం మాజీ మంత్రి అశోక్ గజపతి అడ్డుతగిలి వీరంగం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవాన్ని మరుగుపరుస్తూ ఆయన మంత్రులను విమర్శించిందీ మీడియా సాక్షిగా అందరూ గమనించారు. వాస్తవాలు ఇలా ఉంటే అశోక్‌ తల్లిని మంత్రులు తిట్టినట్టు ఒక అవాస్తవాన్ని ప్రచారం చేయడానికి పచ్చబ్యాచ్‌ యత్నిస్తోంది. దానికి కొనసాగింపుగానే అనిత వ్యాఖ్యలు ఉన్నాయని టీడీపీ నేతల నైజం తెలిసిన వారికి సులువుగా అర్థం అవుతుంది.

విశ్వసనీయత కోల్పోయినా అదే పంథా..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు చేసే ఆరోపణలను, విమర్శలను జనం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ప్రజలకు ఉపయోగించే ఏ కార్యక్రమం చేపట్టినా దానిపై వ్యతిరేక ప్రచారం చేస్తుండడంతో అది బూమరాంగ్‌ అయి టీడీపీ నేతల కామెంట్లకు విశ్వసనీయత లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. అయినా తెలుగుదేశం నాయకులు తమ పంథా మార్చుకోవడం లేదు. గుడి నిర్మించినా, బడులను పునర్నిర్మిస్తున్నా, వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నా టీడీపీ నాయకులు రంధ్రాన్వేషణలు చేస్తూ రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే ఆయా వర్గాల ప్రజలు వీరి మాటలను పట్టించుకోవడం లేదు.

Also Read : చంద్రబాబు చివరకు మందుబాబుతో రాజకీయమా, బోయపాలెం ఘటనకు కారణాలేంటి..

ఎవరైనా, ఎప్పుడైనా ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు చేస్తే అందులో నిజానిజాలతో సంబంధం లేకుండా వెంటనే వాటిని టీడీపీ నేతలు వెనకేసుకొస్తున్నారు. ఆ విధంగానే హీరో నాని కామెంట్‌ను అనిత వెనకేసుకు రావడమే కాక ఆ వ్యాఖ్యల నుంచి రాజకీయ ప్రయోజనాలను పిండుకోవాలని తాపత్రాయ పడుతున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉంచాలనే  సినిమా టికెట్ల ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రాద్ధాంతం చేసేకన్నా జనానికి పనికొచ్చేలా, వారికి భారం కాని రీతిలో వేరే ప్రత్యామ్నాయం ఏదైనా సూచిస్తే టీడీపీకి గౌరవం పెరుగుతుంది. అంతేగాని ఉన్నవీ లేనివీ కలగలిపి ప్రభుత్వంపై బురద జల్లాలనుకుంటే వారి చేతికే అది అంటుతుంది అన్న వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.