iDreamPost
iDreamPost
జనసేన వ్యవహారం ఆసక్తిగా మారింది. తాను యుద్ధానికి సిద్ధమయి వచ్చానని ఆపార్టీ అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటించారు. ఎలాంటి పద్ధతిలో యుద్దమన్నది మీరు నిర్ణయించుకోండి అంటూ పార్టీ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. కానీ ఆయన సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు తప్ప ముంగిట్లో ఉన్న బద్వేలు ఉప ఎన్నికల గురించి మాత్రం పల్లెత్తు మాట పలకలేదు. దాంతో బద్వేలులో జనసేన ఏం చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ముఖ్యంగా తాను రాజకీయ విధానాలకు అనుగుణంగా మిత్రపక్షాలను మారుస్తాననే సంకేతాలు ఇచ్చిన తరుణంలో జనసేన- టీడీపీ మైత్రీ మళ్లీ ఖరారయ్యిందే ప్రచారం ఊపందుకుంది. దానికి అనుగుణంగానే పవన్ అడుగులు, మాటలుండడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో బాబు తో వెళతారా లేక బీజేపీ వెంట ఉంటారా అనే చర్చ మొదలయ్యింది.
బీజేపీ, జనసేన కలిసి ఇప్పటికే స్థానిక ఎన్నికల బరిలో దిగారు.. కానీ ఇరువురికి ఎటువంటి ఊరట దక్కలేదు. పైగా జనసేన ఓటింగ్ బలం పడిపోయింది. బీజేపీ కూడా ఎక్కడా కోలుకున్న దాఖలాలు లేవు. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థి అంటూ రత్నప్రభని ప్రకటించారు. కానీ ఆమె కూడా ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. పవన్ ప్రచారం కూడా పనిచేయలేదు. దానికి తోడు పవన్ తమకు పూర్తిగా సహకరించలేదనే అభిప్రాయం బీజేపీ నేతలు వ్యక్తపరిచారు. అతని తీరు మీద అసంతృప్తితో ఉన్నట్టు కనిపించారు. దానికి అనుగుణంగానే కొన్ని నెలలుగా విడివిడిగా కార్యాచరణ సాగుతోంది. పవన్ కూడా ఒంటరిగా పిలుపులు ఇస్తున్నారు. తమ పార్టీ వ్యవహారంగానే కొన్ని కార్యక్రమాలు నడుపుతున్నారు.
Also Read : బద్వేల్ ఉప ఎన్నిక: చప్పుడు లేని బీజేపీ, జనసేన..!
అంతేగాకుండా తాను అమరావతి కోసమే బీజేపీకి మద్ధతు ఇచ్చానని చెప్పుకున్న పవన్ అది జరగకపోవడంతో ఇక పక్కకు జరుగుతున్నట్టేనా అనే అభిప్రాయం బలపడింది. ఇరు పార్టీలు కటీఫ్ చేసుకున్నట్టు సంకేతాలు వచ్చేశాయి. కానీ అనూహ్యంగా బద్వేల్ ఉప ఎన్నికలు ముందుకు రావడంతో మళ్లీ ఇరు పార్టీల నేతలు కలిశారు. ఉమ్మడి భేటీలకు దిగారు. ఉప ఎన్నికలపై చర్చించారు. వాస్తవానికి గత సాధారణ ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి జనసేన బలపరిచిన అభ్యర్థికి 1300, బీజేపీకి 700 చిల్లర ఓట్లు వచ్చాయి. దాంతో ఇరు పార్టీలు కలిసినా 2వేలు కూడా దాటడం గగనమే అన్నట్టుగా ఉంది.
ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆపార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. ఉప ఎన్నికల మీద చర్చించారు. ఉమ్మడిగా బరిలో దిగాలని ఆశిస్తున్నట్టు పవన్ కి తెలిపారు. కానీ బద్వేలు విషయంలో పవన్ లో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఇరు పార్టీలు కలిసి ముందుకెళతారా లేక విడిపోయి సాగుతారా అన్నది బద్వేలులో నిర్ణయించే అవకాశం కనిపించడం లేదు. యూపీ ఎన్నికల వరకూ బీజేపీతో కటీఫ్ విషయంలో పవన్ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి బద్వేలులో బీజేపీకి అండగా ఉంటామని ప్రకటించే అవకాశాలున్నట్టు సమాచారం.
Also Read : బద్వేలు ఉప ఎన్నిక – పెద్దిరెడ్డి సారథ్యంలో వైసీపీ టీం ఇదే..