iDreamPost
android-app
ios-app

చేజారిపోతోందా.. ఎప్పటికి సర్థుకుంటుంది..? ఉత్తరాది వణికిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమా..?

  • Published Apr 24, 2021 | 8:15 AM Updated Updated Apr 24, 2021 | 8:15 AM
చేజారిపోతోందా.. ఎప్పటికి సర్థుకుంటుంది..? ఉత్తరాది వణికిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమా..?

ప్రపంచమంతా కుదుటపడుతున్న వేళ హఠాత్తుగా దేశం విలవిల్లాడుతోంది. రికార్డు స్థాయి కేసులు, మరణాలతో ప్రపంచమంతా మనల్ని దూరం పెట్టే పరిస్థితి వచ్చేసింది. అనేక దేశాల పౌరులను ఇండియాకి వెళ్లొద్దని హెచ్చరించడం, పైగా మనదేశం నుంచి వచ్చే విమాన సర్వీసులు నిలిపివేయడం గమనిస్తే ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందో అర్థమవుతోంది. అదే సమయంలో దేశంలో గంటకి వంద మందికి పైగా కోవిడ్ కారణంగా మృతి చెందుతున్నట్టు అధికారికంగా ప్రకటిస్తున్నారు. రికార్డులకెక్కని మరణాల సంఖ్య ఎవరికీ తెలియకపోవచ్చు గానీ ఇంత దయనీయ స్థితి అందరినీ కలచివేస్తోంది.

హఠాత్తుగా పక్షం రోజుల వ్యవధిలో కోవిడ్ విజృంభించింది. నియంత్రించే చర్యలు లేక ప్రభుత్వాలు చేతులెత్తేసే స్థితి వచ్చింది. తొలుత మహారాష్ట్ర, తర్వాత గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, తాజాగా ఢిల్లీలో పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఉత్తరాదికి చెందిన 10 రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉంది. ఆక్సిజన్ కొరత ఎప్పటికీ తీరుతుందన్నది అంతుబట్టడం లేదు. చివరకు ఆక్సిజన్ కోసం ఢిల్లీ సీఎం, ప్రధాని మధ్య ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా జరిగిన పరిణామాలు చర్చనీయాంశాలయ్యాయి.

ఆస్పత్రిలో బెడ్స్ లేదు.. బెడ్ దొరికినా ఆక్సిజన్ లేదు.. చివరకు అన్నీ పూర్తయితే ఆంబులెన్సు లేదు. ప్రాణం పోతే శ్మశానంలో కూడా చోటు దక్కని అత్యంత దుస్థితిని దేశం ఎదుర్కొంంటోంది. కానీ కేంద్ర హోం మంత్రి అదే సమయంలో బెంగాల్ ఎన్నికల పర్యటనలో ఉన్నారు. ప్రధాని తన పర్యటన మానుకుని సీఎంలతో భేటీ అవుతున్నట్టు ప్రకటన చేసుకుంటున్నారు. ఓవైపు దేశమంతా ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అల్లాడుతుంటే ఎన్నికల గురించి కీలకమైన ఇద్దరు ప్రధాన నేతలు ఆలోచిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందనే వాదన , విమర్శలు వినిపిస్తున్నాయి. నెటిజన్లయితే కేంద్రం తీరు మీద తీవ్రంగా మండిపడుతున్నారు. ఢిల్లీ హైకోర్టునేరుగా దేశంలో ప్రభుత్వం పాలన లేదని, ప్రస్తుతం ఈ దేశాన్ని దేవుడే కాపాడుకోవాలనే వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టయితే ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని పేర్కొంది.

సామాన్యుడి నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకూ అందరూ తాజా పరిస్థితిని చూసి తీవ్రంగా తల్లడిల్లిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి అత్యంత దారుణ పరిస్థితిని దేశం ఎన్నడూ ఎదుర్కొని ఉండదని అంతా చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం, దానికి నాయకత్వం వహిస్తున్న పాలకులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాబోయే రెండు వారాల్లో ఇది మరింత ముదిరితే వేలాది మంది ప్రజలు పిట్టల్లా రాలిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్టేననే వాదన వినిపిస్తోంది. ఓవైపు వ్యాక్సిన్ కొరత, మరోవైపు ఆక్సిజన్ కొరత అందరిలో అలజడి రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కొంత పరిస్థితి అదుపులో ఉందనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర వంటి చోట్ల లాక్ డౌన్ తో వలసకూలీలు వెనక్కి వస్తున్న సమయంలో పరిస్థితి ఎటు దారితీస్తోందననే ఆందోళన మొదలవుతోంది.