iDreamPost
iDreamPost
ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం చేస్తానన్న సీఎం జగన్‌రెడ్డి.. ఇప్పుడు నాన్న మద్యం తాగకపోతే అమ్మకు అమ్మఒడి లేదంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జనాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగుడుకి, సంక్షేమానికి లింకుపెట్టిన మహానుభావుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. నాన్న మద్యం తాగకపోతే అమ్మకు అమ్మఒడి లేదని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇలా మాట్లాడడం పద్దతేనా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పేద పిల్లల చదువులకు ఎటువంటి ఆటంకం ఉండకూడదని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమ్మ ఒడి పథకం అమలు చేస్తుంటే అటు తల్లిదండ్రులను, ఇటు ప్రభుత్వాన్ని అవహేళన చేస్తూ బాబు మాట్లాడడంపై పథకం లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఒడి లబ్ధిదారుల తల్లిదండ్రులందరినీ ప్రభుత్వం తాగుబోతులుగా మార్చేస్తోంది అన్న అర్థం వచ్చేలా మాట్లాడడం పేదలపై ఆయనకు ఉన్న చులకన భావాన్ని సూచిస్తోందని అంటున్నారు. తాగుడుకి, సంక్షేమానికి ముఖ్యమంత్రి లింకు పెట్టడమేమిటి?చంద్రబాబే బోడి గుండుకు, మోకాలికి ముడిపెడుతున్నారు? అర్థం పర్థంలేని విమర్శలు చేసి పార్టీకి మైలేజీ, తనకు ఇమేజీ తెచ్చుకుందామని భావిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు బాబు తీరును విమర్శిస్తున్నారు.
Also Read : Kanakamedala Ravindra – రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి.. టీడీపీ ఎంపీ లెక్కలివిగో
బాబు సీఎంగా ఏరియల్ సర్వే చేయలేదా?
అందరు కష్టాల్లో ఉంటే జగన్‌రెడ్డి గాలిలో ఒక ట్రిప్ వేశారని, జగన్‌రెడ్డి ఏరియల్ సర్వే చేస్తే వరద బాధితుల కష్టాలు కనిపిస్తాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీ వాయిదా వేసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే ఏమౌతుంది? అన్నారు. వరద బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వడంలోనూ ప్రభుత్వం విఫలమైందని తప్పుబట్టారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఏరియల్ సర్వే చేయలేదా అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ ఏరియల్ సర్వే చేయడమే ఏదో తప్పన్నట్టు పదే పదే అనడం ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి సమంజసమేనా అన్న విమర్శలు వినివస్తున్నాయి. బాధితులకు సాయం అందడం ముఖ్యంకాని వారి పరిస్థితిని జగన్ ఏ విధంగా పరిశీలించారు అన్నది అప్రస్తుతం కదా? వరద బాధితుల వద్దకు వెళ్లిన చంద్రబాబు వారి ఇబ్బందులను తెలుసుకోవడానికి బదులు తన బాధలు చెప్పుకున్నారని, చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. సీఎంగా ఉన్నప్పుడు చీటికిమాటికి చార్టర్డ్ విమానాల్లో తిరుగుతూ జనం సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేసిన చంద్రబాబు కంటే తమ నేత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో మేలని అంటున్నారు.
వరద బాధితులకు తక్షణ సాయం అందించడమే కాక, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనడం బాధ్యతా రాహిత్యం కాదా? మానవ తప్పిదం వల్లే వరదల్లో ప్రాణనష్టం జరిగిందని ఆరోపిస్తున్న చంద్రబాబు గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన బెట్టుకోవడం తన తప్పిదం అని ఎందుకు ఒప్పుకోరు అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించేదానికి ఏమని సమాధానం చెబుతారు. అంతటి ఘోర కలిపై అసలు విచారణే జరుగకుండా అడ్డుకున్న చంద్రబాబుకు ప్రకృతి వైపరీత్యాలకు జనం మరణిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక అర్హత ఉందా? అని పరిశీలకులు అంటున్నారు. ప్రతీదీ రాజకీయం చేయాలనుకోవడం తగదని, ముఖ్యంగా జనం కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ధోరణి తగదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read : Jr Ntr – మాట్లాడినా తప్పే, మాట్లాడకున్నా తప్పే.. జూనియర్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?