iDreamPost
iDreamPost
కరోనా వైరస్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. యూరప్, ఉత్తర అమెరికాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. బెల్జియం, హాలెండ్ లాంటి దేశాలను అల్లకల్లోలంగా మార్చేస్తోంది. అందుకు తోడుగా దక్షిణాఫ్రికాలో నమోదయిన ఒమిక్రాన్ వేరియంట్ మరింత ఆందోళన కలిగిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ కూడా ఈ వైరస్ ని ప్రమాదకరంగా పేర్కొనడంతో ప్రపంచంలోని అనేక దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇండియాలో కూడా ఈ వేరియంట్ వ్యాపించకుండా జాగ్రత్తలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశించినంత సాగడం లేదు. వాస్తవానికి ప్రధాని మోదీ చెప్పిన విధంగా అయితే వచ్చే నెలాఖరుకి ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. కానీ నేటికీ దేశంలో రెండు డోసులు పూర్తయిన వారి సంఖ్య పావు వంతు కూడా లేదు. అనేక చోట్ల వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆశించిన రీతిలో సాగలేదు. లక్ష్యాలకు దూరంగా ఉండిపోయింది. చాలామంది సామాన్యుల్లో వ్యాక్సిన్ల పట్ల అపోహలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి వైరస్ వ్యాపిస్తే ఎలాంటి ముప్పు వస్తుందోననే చర్చ మొదలయ్యింది.
మరోవైపు రెండు డోసులు వేసుకున్న వారు కూడా బూస్టర్ డోసు వేసుకోవాలంటూ వైద్య ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. దాంతో మరో డోసు కూడా వేసుకున్నప్పటికీ నియంత్రణ సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశంలో దాదాపు 50 కోట్ల మంది ఒక్క డోసు కూడా వ్యాక్సిన్ తీసుకోని పరిస్థితుల్లో మూడో డోసుగా బూస్టర్ డోస్ అవసరమని చెప్పడం కలకలం రేపుతోంది. రెండో డోసులు తీసుకుని ధీమాగా ఉన్న వారిలో కూడా ఆందోళన పెంచుతోంది.
మొదటి వేవ్ కన్నా సెకండ్ వేవ్ పెను విపత్తుగా కనిపించింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలయ్యి ఏప్రిల్, మే నాటికి వెల్లువలా విరుచుకుపడింది. ఈసారి కూడా మళ్లీ ఫిబ్రవరి తర్వాత దేశంలో కొత్త వేరియంట్ విజృంభించే పరిస్థితి వస్తే మరింత ముప్పు వస్తుంది. దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితికి చేరుతున్న సమయంలో కొత్త వేరియంట్ అంటే కష్టమేననే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త వైరస్ నియంత్రణకు కేంద్రం విదేశాల నుంచి వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సి న అవసరం ఉంది. ముఖ్యంగా యూరప్, అమెరికా, దక్షిణాఫ్రికా తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి విధిగా పరీక్షలు నిర్వహించడం, అన్ని రకాల జాగ్రత్తలు పాటించడం ద్వారా అలాంటి వేరియంట్ మళ్లీ దేశంలోకి చొరబడకుండా చూడాల్సిన అవసరం ఉంది.
ఒకవైపు క్రికెట్ మ్యాచులు, సినిమా రిలీజ్ లు, పిల్లల పరీక్షలు, ఎన్నికల కోలాహలం సహా జనం రద్దీగా ఉండే కార్యక్రమాలు సాగడం లేదా మొదలుకాబోతున్న తరుణంలో కేంద్రం తీసుకునే జాగ్రత్తలను బట్టి ఈసారి కరోనా నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. అందుకే సామాన్యులు సైతం ఈ ముప్పు తమ వరకూ రాకూడదని, రాదనే ఆశాభావంతో కనిపిస్తున్నారు.
Also Read : Noida Airport – ప్రపంచం సరసన ‘నోయిడా’ విమానాశ్రయం