iDreamPost
iDreamPost
ఏపీ రాజకీయాల్లో విజయవాడ కు ప్రత్యేక స్థానం ఉంది. అన్ని పార్టీలు ఈ నగరాన్ని కీలకంగా భావిస్తాయి. దాంతో పాటు గడిచిన ఏడేళ్లుగా దాదాపు రాజధాని నగర హోదా అనుభవిస్తోంది. అయితే తాజాగా పాలనా వికేంద్రీకరణ చట్టాలకు అమోదం దక్కిన తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో విజయవాడ మరింత ఆసక్తిరేపింది. అయితే తుది ఫలితాల్లో జనం జగన్ కి జై కొట్టారు. 2019లో కూడా విజయవాడ తూర్పు, ఎంపీ స్థానాలను కూడా వైఎస్సార్సీపీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టేశారు. దాంతో విజయవాడ నగర మేయర్ పీఠం చుట్టూ ఆసక్తికర చర్చ సాగుతోంది.
విజయవాడ నగర మేయర్ సీటు ఈసారి జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యింది. దాంతో పలువురు ప్రయత్నాలు చేశారు. ఎన్నికలకు ముందు పలువురి పేర్లు వినిపించినప్పటికీ, ఫలితాల తర్వాత కొందరి పేర్లు పక్కకిపోయాయి. విజయం దక్కించుకున్న కార్పోరేటర్లు కొందరు గట్టిగా ప్రయత్నాలు చేశారు. అయితే జగన్ మాత్రం విజయవాడకు చెందిన పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా బీసీ మహిళకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. విజయవాడలో బలమైన బీసీ సామాజిక వర్గం “నగరాలు”కు చెందిన మహిళ రాయన భాగ్యలక్ష్మికి విజయవాడ మేయర్ పీఠం దాదాపు ఖాయం అయ్యింది. ఊహాగానాలకు ఇక తెరిపడినట్టేననే పలువురు భావిస్తున్నారు.
Also Read:జమ్మలమడుగు లెక్కలు ఇంత త్వరగా మారిపోయాయే ..!
మేయర్ సీటు కోసం గత పాలకవర్గంలో ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించిన బండి పుణ్యశీల పేరు బలంగా వినిపిస్తోంది. ఆమె అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ పార్టీలో కొనసాగారు. పలువురు కార్పోరేటర్లు పార్టీని వీడినా ఆమె మాత్రం వైఎస్సార్సీపీ వాయిస్ ని వినిపించేందుకు ప్రయత్నించారు. బ్రాహ్మణ్ కులానికి చెందిన ఆమె ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని వివాహమాడారు. దాంతో ఆమెకు అనుభవంతో పాటుగా ఈ కుల ఈక్వేషన్ కలిసివస్తుందని కొందరు అంచనా వేశారు.
అదే సమయంలో 58వ డివిజన్ నుంచి గెలిచిన అవుతు శైలజారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఆమె భర్త కాంట్రాక్టర్ గా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఆమెకున్నాయి. దాంతో ఆమె ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇంకా మరికొందరు పేర్లు కూడా వినిపించినా చివరకు బీసీ సామాజికవర్గానికి బెజవాడ మేయర్ పీఠం కట్టబెట్టడం కీలక పరిణామంగా కనిపిస్తోంది.
Also Read:బిజెపి, జనసేన మైత్రి మూన్నాళ్ళ ముచ్చటేనా?
ఇక గుంటూరు మేయర్ పదవి ఇద్దరికీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి రెండున్నర సంవత్సరాలు వైశ్య సామాజిక వర్గానికి చెందిన గాంధీ ,చివరి రెండున్నర సంవత్సరాలు కావేటి మనోహర్ నాయుడి ఖాయం అయ్యింది. మనోహర్ నాయుడి పేరు తొలి నుంచి వినిపించింది. పెద్దకూరపాడు నియోజకవర్గ బాధ్యుడిగా వ్యవహరించిన మనోహర్ నాయుడి కి టికెట్ దక్కకపోయినా పార్టీ గెలుపుకోసం కృషి చేశారన్న సానుభూతి పార్టీలో ఉంది.
వైజాగ్ కి కూడా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు వదులుకున్న వంశీకృష్ణ యాదవ్ ని ఖాయం చేశారు. దాంతో పాటుగా ఎమ్మెల్యేలు, మంత్రుల బంధువులకు కీలక పదవుల విషయంలో వైఎస్సార్సీపీ అధినేత ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు.
విజయనగరం మేయర్ గా దేవాంగుల సామాజికవర్గానికి చెందిన ఆశాపు సుజాతకి అవకాశం దక్కొచ్చు.
ముఖ్య నాయకుల బంధువులకు ప్రధాన పదవులు లేవని తేల్చిచెప్పడంతో తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం మీద ఆశలు పెట్టుకున్న భూమన తనయుడి కోరిక నెరవేరే అవకాశం లేదని చెబుతున్నారు.
Also Read:విశాఖ మేయర్ ఆయనేనా?
ఇక అనంతపురం మేయర్ సీటుని ముస్లీం మైనార్టీలకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు.మొదటి నుంచి ప్రచారంలో ఉన్న కోగటం విజయభాస్కర్ రెడ్డి, చవ్వా రాజశేఖర్ రెడ్డి లకు అవకాశం దక్కనట్లే. సైఫుల్లా బేగ్, అబూ సాలేహా, ముంతాజ్ లలో ఒకరిని అదృష్టం వరించవచ్చు. వీరిలో అబూ సాలేహా బీసీ వర్గానికి చెందినవారు.
కర్నూల్ మేయర్ పదవి ముందు నుంచి ప్రచారంలో ఉన్న బీసీ నేత బీవై రామయ్య, కడప మేయర్ పదవి బీసీ నేత సురేష్ బాబుకే దక్కే అవకాశం ఉంది.
ఈ సాయంత్రం వరకు ప్రచారంలో ఉన్న పేర్లు తాజా సమీకరణాలతో వెనక్కి పోయి కొత్త నేతల పేరు తెర మీదికి వచ్చినట్లయ్యింది. ముఖ్యమంత్రి సరైనా సమయంలో తన మనసులోని మాటను బయట పెట్టారు.