iDreamPost
iDreamPost
కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు దఫాలు మూడు పార్టీల నుంచి పోటీ చేసినా చలమలశెట్టి సునీల్ గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. మూడు సందర్భాల్లోనూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చిన ఆయన ఒక సంచలనంగా మారారే తప్ప తన లక్ష్యం నెరవేర్చుకోలేకపోయారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ఈయన మాజీ ఎంపీ తోట సుబ్బారావుకు బంధువు. విద్యాధికుడైన సునీల్ వ్యాపార రీత్యా లండన్ లో స్థిరపడి, ఆ దేశం పౌరురాలినే వివాహం చేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఇక్కడకు వచ్చి ఒక్కసారిగా రాజకీయంగా తెరపైకి వచ్చారు.
2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ
కాపు సామాజిక వర్గానికి చెందిన సునీల్ ఆర్థికంగా స్థితిమంతుడు. ఆయనకున్న పవర్ ప్రాజెక్టులు, కాంట్రాక్టు వ్యాపారాలను సోదరుడు చూసుకుంటారు. కాకినాడ లోక్‌సభ స్థానం పరిధిలో ఆయన సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉండడంతో ప్రజారాజ్యం టికెట్ సాధించి 2009లో బరిలోకి దిగారు. అదే సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ సిటింగ్ ఎంపీ మల్లిపూడి మంగపతి పళ్లంరాజుపై పోటీ పడ్డారు. హోరాహోరీ ప్రచారంతో దీటుగా పోటీ ఇచ్చారు. అయితే ప్రత్యర్థులు ఈయన స్థానికేతరుడని, అసలు భారతీయ పౌరసత్వమే లేదని, గెలిచినా అందుబాటులో ఉండరని ప్రచారం చేశారు. దీన్ని తిప్పికొట్టడం సునీల్‌కు బాగా కష్టమైంది. ఆ ఎన్నికల్లో పళ్లంరాజు 3,23,607 ఓట్లు, సునీల్ 2,89,563 ఓట్లు సాధించగా టీడీపీ అభ్యర్థిని వాసంశెట్టి సత్య 2,58,046 ఓట్లు సాధించారు. ఈయన ఓడిపోయినా టీడీపీ అభ్యర్థిని మూడు స్థానానికి పరిమితం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి 33.51 శాతం ఓట్లు సాధించగా సునీల్ 29.99 శాతం ఓట్లు సాధించి తన రాజకీయ అరంగ్రేటాన్ని ఘనంగా చాటుకున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ కన్ను తూర్పు గోదావరిపై, సురక్షిత సీటు కోసం వెతుకులాట
2014లో వైఎస్సార్ సీపీ నుంచి..
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఈయన వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ టికెట్ సాధించి కాకినాడ నుంచి 2014లో పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు కాపు సామాజిక వర్గ అభ్యర్థులకే టికెట్ ఇచ్చాయి. తెలుగుదేశం తరఫున తోట నరసింహం, కాంగ్రెస్ తరఫున సిటింగ్ ఎంపీ పళ్లంరాజు బరిలో నిలిచారు. తోట నరసింహం 46.76 శాతంతో 5,14,402 ఓట్లతో గెలిచారు. సునీల్ 46.45 శాతంతో 5,10,971 ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి పళ్లంరాజు కేవలం 19,754 ఓట్లతో మూడు స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆయనకు 1.80 శాతం ఓట్లే రావడం గమనార్హం. ఈ దఫా కూడా సునీల్ రెండో స్థానానికే పరిమితం అయ్యారు.
వైఎస్సార్ సీపీలో చక్రం తిప్పి..
2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం సునీల్ వైఎస్సార్ సీపీ రాజకీయాల్లో కొన్నాళ్లు చక్రం తిప్పారు. పార్టీలోకి మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణను ఆహ్వానించారు. పార్టీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్‌గా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్థానంలో ముత్తా కుమారుడు శశిధర్‌ను నియమించేలా అధిష్టానాన్ని ఒప్పించారు. 2017లో జరిగిన కాకినాడ మేయర్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన అధికార టీడీపీ వైపు మొగ్గు చూపారు.
Also Read : వారసత్వాన్ని నిలబెట్టిన జక్కంపూడి రాజా
2019లో టీడీపీ నుంచి బరిలోకి..
వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన ఆయన 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మళ్లీ ఎంపీగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున వంగా గీత, జనసేన తరఫున జ్యోతుల వెంకటేశ్వరరావు పోటీ చేశారు. వంగా గీత 43.47 శాతంతో 5,37,630 ఓట్లు సాధించి గెలిచారు. సునీల్ 41.38 శాతంతో 5,11,892 ఓట్లు సాధించారు. జనసేన అభ్యర్థి 10.72 శాతంతో 1,32,648 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.
వెన్నాడిన దురదృష్టం
మూడు సార్లు వివిధ పార్టీల నుంచి పోటీ చేసినా గెలిచేస్తారేమోనన్నంత ఊపును తీసుకొచ్చారు. ఆయనను దురదృష్టం వెన్నాడిందని అభిమానులు అంటుంటారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన సునీల్.. గత ఏడాది ఆగస్టులో వైసీపీలో చేరారు. ఆ తర్వాత లండన్ వెళ్లిపోయారు. ఇక్కడ ఏదైనా పని పడినప్పుడు అడపాదడపా అక్కడి నుంచి వచ్చి వెళుతున్నారు.
Also Read : పెద్దాపురం పై బొడ్డు వారసుడి గురి…..