iDreamPost
android-app
ios-app

ఆ పార్టీకి ఏమైంది.? నేతలు వస్తున్నారు.. పోతున్నారు..!

  • Published Jul 24, 2021 | 1:47 PM Updated Updated Jul 24, 2021 | 1:47 PM
ఆ పార్టీకి ఏమైంది.? నేతలు వస్తున్నారు.. పోతున్నారు..!

తెలంగాణలో టీఆర్‌‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది బీజేపీ. గత రెండేళ్లలో బాగా పుంజుకుంది. బండి సంజయ్ నాయకత్వంలో ముందుకు పోతోంది. కానీ చాలా ఏళ్లుగా బీజేపీలో ఓ సమస్య ఉంది. కొత్తగా వచ్చిన నేతలు.. మళ్లీ కొన్నాళ్లకే తమ దారి తాము చూసుకుంటున్నారు. బీజేపీని నమ్ముకుని వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని, తమకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని చెబుతూ వేరే పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. తాజాగా మోత్కుపల్లి నర్సింహులు వ్యవహారంతో ఇది మరోసారి రుజువైంది. తన అనుభవాన్ని, రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకొని తనకు బీజేపీలో సముచిత స్థానం కల్పించలేకపోయారని, అందుకే తాను చాలా బాధపడుతున్నానని రాజీనామా లేఖలో మోత్కుపల్లి పేర్కొన్నారు. ఇలా గతంలోనూ పలువురు నేతలు వెళ్లిపోయారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న కొందరు నేతల వల్లే ఇలా జరుగుతోందని, కొత్తగా పార్టీలో చేరిన నేతలకు వీరు సహకరించటం లేదనే ప్రచారం సాగుతోంది.

మోత్కుపల్లి.. అసంతృప్తి జ్వాల

టీడీపీలో ఉన్నప్పటి నుంచే మోత్కుపల్లి అసంతృప్తితో ఉండేవారు. టీఆర్ఎస్, టీడీపీ పొత్తు కోసం గతంలో ప్రయత్నించిన నేతల్లో ఈయన ఒకరు. దాదాపు పొత్తు ఖరారు అయిందన్న సమయంలో రేవంత్ రెడ్డి లాంటి కొందరు వ్యతిరేకించారు. దీంతో పొత్తు పొడవకుండానే అస్తమించింది. తర్వాత మోత్కుపల్లి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసి పార్టీ బహిష్కరణకు గురయ్యారు. కొన్నాళ్లకు బహుజన లెఫ్ట్ ఫ్రంట్.. తర్వాత బీజేపీలోకి చేరారు. అయితే మోత్కుపల్లిని బీజేపీ కార్యక్రమాలకు పెద్దగా ఆహ్వానించలేదు. పార్టీలో పెద్ద పదవి ఏదీ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మొన్న ‘దళిత బంధు’ పథకంపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి వెళ్లి.. బీజేపీలో కలకలం రేపారు మోత్కుపల్లి. ఎందుకంటే.. ఆ సమావేశానికి వెళ్లకూడదని బీజేపీ నిర్ణయించింది. పార్టీ గీత దాటి వెళ్లిన మోత్కుపల్లి.. టీఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే బీజేపీ లీడర్లపై విమర్శలు చేసి చివరికి పార్టీకి రాజీనామా చేశారు.

Also Read : ఆ సీనియర్ నేత బీజేపీలోనూ ఇమడలేకపోయారా..?

నాగం జనార్దన్ రెడ్డి.. కమలంలో పార్టీలో ఇమడలేక

2011లో టీడీపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత తెలంగాణ నగారా సమితిని నాగం జనార్దన్ రెడ్డి ఏర్పాటు చేశారు. అయితే కొన్నాళ్లకే బీజేపీలో చేరారు. 2014లో బీజేపీ నుంచి మహబూబ్ నగర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాతి నుంచి పార్టీకి దూరంగా ఉండిపోయారు. తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తితో ఉండే వారు. రాష్ట్రనేతల్లో కొందరు పొమ్మనలేక పొగపెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన చివరికి కాంగ్రెస్ గూటికి చేరారు. 2018 ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈయన రాకను వ్యతిరేకించిన మాజీ మంత్రి డీకే అరుణ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

వీళ్లకూ అదే పరిస్థితి..!

ఇటీవల బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటనలో తనకు అవమానం జరిగిందని, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని బాధపడ్డ ఆయన జిల్లా అధ్యక్ష పదవికి, బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడా చాలా ఏళ్ల కిందటే బీజేపీ నుంచి బయటికి వచ్చారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్. ఒకనొక దశలో ఆయన కూడా పార్టీ నుంచి బయటికి వస్తారని, శివసేనలో చేరుతారని ఊహాగానాలు వినిపించాయి. పార్టీలో తనను పట్టించుకోవడం లేదని, పార్టీ సమావేశాలకు పిలవడం లేదన్నది ఆయన వాదన.

వీరే కాక.. దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తదితరులు అసంతృప్తితో ఉన్నట్లు గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్య బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌‌కు కూడా పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదన్న వాదనలూ ఉన్నాయి. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి ఢిల్లీకి వెళ్తే.. బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ కీలక నేతలు ఎవరూ రాలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం జరుగుతున్న ప్రచారంలో కూడా.. అప్పడప్పుడు రాష్ట్ర నేతలు వస్తున్నా ప్రచారం బాధ్యతలు మొత్తం ఈటల దంపతులే చూసుకుంటున్నారు.

Also Read : ఎంపీటీసీ భర్తకు కేసీఆర్‌ ఎందుకు ఫోన్‌ చేశారు..?