iDreamPost
iDreamPost
థియేటర్లు మూతబడిన వేళ విడుదల ఆగిపోయిన సినిమాలకు ఓటిటి మంచి వేదికగా నిలుస్తోంది ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ స్టార్ చిత్రాలేవి ఇందులో రానప్పటికీ వచ్చినవి టాక్ తో సంబంధం లేకుండా మంచి స్పందన దక్కించుకున్నాయి. ఓటిటి/ ఏటిటి పేరు ఏదైనా ఇది ఈ రకంగా మేలు చేస్తున్న మాట వాస్తవం. కానీ కొన్ని సినిమాలు మాత్రం అంతు చిక్కని రీతిలో ఎప్పుడు మోక్షం కలిగించుకుంటాయో అర్థం కాని అయోమయం నెలకొంది. అందులో ప్రధానంగా క్వీన్ రీమేక్ ముందు వరసలో ఉంది. కంగనా రౌనత్ హీరొయిన్ గా ఐదేళ్ళ క్రితం వచ్చిన క్వీన్ ని సౌత్ లో రీమేక్ చేసే ఉద్దేశంతో నాలుగు బాషలలో నలుగురు టాప్ హీరొయిన్స్ తో షూటింగ్ చేశారు.
తెలుగులో తమన్నా, తమిళ్ లో కాజల్ అగర్వాల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ ఇలా టాప్ బ్యూటీస్ తోనే భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టే తీసుకుంటూ పోయారు. షూటింగ్ కూడా పూర్తయ్యిందనే టాక్ ఉంది. దర్శకులు కూడా వేర్వేరు. ఇక్కడి వెర్షన్ కు ముందు నీలకంఠ ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దీన్ని పూర్తి చేశారు. దట్ ఈజ్ మహాలక్ష్మి పేరుతో పోస్టర్లు, టీజర్ కూడా రిలీజయ్యాయి. ఆ తర్వాతే ఇది పత్తా లేకుండా పోయింది. కాజల్ టీజర్ చిన్నపాటి వివాదం రేపింది కూడా. ఇప్పుడు చూస్తేనేమో నిర్మాతలు యాక్టర్లు ఎవరూ నోరు మెదపడం లేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బ్రేక్ పడిందన్న మాట వినిపించింది కానీ పోనీ ఓటిటి రూపంలోనైనా రిలీజ్ చేస్తే మంచి అవకాశం ఉంటుంది. కానీ దాన్నీ సద్వినియోగపరుచుకునేలా లేరు.
అన్ని బాషలలో డిమాండ్ ఉన్న హీరొయిన్స్ కాబట్టి డిజిటల్ విడుదల మంచి ఫలితాలనే ఇస్తుంది. కాని ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా ఆగిపోయిన ఈ సినిమాను ఇకనైనా పట్టించుకుంటే బెటర్. మరోవైపు ఈ నలుగురు భామలు ఎక్కడా దీనికి సంబంధించిన ప్రస్తావన తెచ్చేందుకు ఇష్టపడటం లేదు. బాలీవుడ్ లో క్రిటిక్స్ ని సైతం మెప్పించిన క్వీన్ రీమేక్ ఇక్కడ ఇలా ఈ పరిస్థితిలో ఆగిపోవడం అభిమానులకు బాధ కలిగించేదే. వాళ్ళకు ప్లస్ మేకర్స్ కు ఊరట కలగాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ థియేటర్లలోనే రిలీజ్ చేయయాలని డిసైడ్ చేసినా దాన్ని కనీసం అధికారికంగా ప్రకటిస్తే అయినా బాగుంటుంది. అలా కాకుండా నానుస్తూ పోతే ఉన్న కొంత ఆసక్తి కూడా పూర్తిగా చల్లారిపోతుంది. ఆలోగానే ఏదో ఒకటి చెప్పేస్తే మంచిది. అందులోనూ ఇలా కంటెంట్ ఉన్న సినిమా ఆగిపోవడం విచారకరమే.