Idream media
Idream media
జాతీయ విద్యా విధానం సుధీర్ఘ కాలం తర్వాత మార్పులకు లోనైంది. ఇప్పటి వరకు ఉన్న జాతీయ విద్యా విధానాన్ని 1986లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1992లో దాన్ని సవరించారు. మళ్లీ ఇప్పుడు మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన విధానంలో అధికంగా వృత్తి నైపుణ్యాలకు ప్రాధాన్యమిచ్చినట్లుగా కనిపిస్తోంది. మార్కుల బోధనకు తిలోదకాలిచ్చి నైపుణ్యతో కూడిన విద్యా బోధనే లక్ష్యంగా కనిపిస్తోంది. గణాంకమైన, సృజనాత్మకమైన, శాస్త్రీయమైన, బహుభాషాపరమైన, డిజిటల్ విద్య దిశగా భారీ మార్పులు చేసినట్లుగా అర్థమవుతోంది.
మొత్తంగా ఈ విధానాన్ని పరిశీలిస్తే సుదూర దృష్టి అవగతం అవుతున్నా కొన్ని విషయాల్లో స్పష్టత కరువైంది. మార్కులే లక్ష్యంగా బట్టీ కొట్టే మూస విధానానికి స్వస్తి చెప్పి భవిష్యత్ కు అవసరమైన సాంకేతికపరమైన అంశాలను అధికంగా జోడించడం ఆహ్వానించదగ్గ పరిణామం. 2030 నాటికి అందరికీ నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకుని అందుకనుగుణంగా మార్పులు చేసినట్లుగా కనిపిస్తోంది. నూతన విద్యా విధానంలో భాగంగా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్య తప్పనిసరి చేసింది.
ఆరో తరగతి నుంచే..
ఇప్పటి వరకూ వృత్తి పరమైన కోర్సులు ఇంటర్మీడియట్ నుంచి మాత్రమే విద్యార్థులకు అందుబాటులో ఉండేవి. వాటికి కూడా తగిన ప్రాధాన్యం ఉండేది కాదు. అందువల్ల ఎక్కవగా ఆదరణకు నోచుకునేవి కావు. అవగాహనా లోపంతో రెగ్యులర్ కోర్సులకే అందరూ అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. భవిష్యత్ అంతా వృత్తి నైపుణ్యంపైనే ఆధారపడి ఉంటుందని ముందే గుర్తించిన కేంద్రం ఆరో తరగతి నుంచే వొకేషన్ కోర్సులను ప్రవేశపెడుతూ నూతన విద్యా విధానంలో పొందుపరిచింది. విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్ ఆధారంగా విద్యను నేర్పే ప్రయత్నం చేస్తోంది. ఆరో తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్, ప్రోగామింగ్ కరికులమ్ ప్రవేశపెట్టి భవిష్యత్ వేగాన్నిఅందుకునే దిశగా మార్పులు చోటుచేసుకున్నాయి. 2025 నాటికి దేశంలో కనీసం సగం మంది వృత్తి విద్యల్లో నైపుణ్యం పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది సఫలీకృతమైన ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇది ఎంత వరకు కలిసి వస్తుందనేది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన తేవడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది.
గణిత శాస్త్ర పునాదులపై…
నూతన విధానంలో గణిత శాస్త్రానికి అధిక ప్రాధాన్యం కమిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 10+2+3 (టెన్త్, ఇంటర్, డిగ్రీ) విద్యా విధానానికి స్వస్తి పలికి ఆ స్థానంలో 5+3+3+5 విద్యా విధానాన్ని పొందుపరిచింది. దీని ప్రకారం.. మొదటి 5 ఏళ్లను ఫౌండేషన్ కోర్సుగా పరిగణించనుంది. ఈ ఫౌండేషన్ లో భాష, గణిత శాస్త్రంపై చిన్న నాటి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించనుంది. అలాగే విజ్ఞాన శాస్త్రం, కళలు, క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. 5 ఏళ్ల కోర్సులో తొలి 3 ఏళ్లు అంటే 3 నుంచి 6 ఏళ్ల వయస్సు పిల్లలకు ప్రీ స్కూల్ విద్య అందనుంది. ఆ తర్వాత 6 నుంచి 8 వయస్సు వారికి ఒకటి, రెండు తరగతుల విద్య బోధిస్తారు. ఇప్పటి వరకూ 5వ సంవత్సరం వస్తేనే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం ఉండేది. మారుతున్న కాలంలో చిన్న పిల్లల మానసిక్ పరిణతిలో కూడా మార్పులు వచ్చాయి. వేగం పెరిగింది. అందుకనుగుణంగా 3వ సంవత్సరం నుంచే పిల్లలు అర్థం చేసుకునే స్థాయి కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు 3వ సంవత్సరంలోనే పిల్లలు స్కూళ్ల వైపు అడుగులు వేసేలా చర్యలు చేపట్టింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పుట్టిన మూడో సంవత్సరం నుంచే ఇక చదువే లక్ష్యంగా మారితే తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాలలో తేడా వస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వ పరంగా లేకపోయినా.. ప్రైవేటులో ప్రీ స్కూల్ వ్యవస్థ ఇప్పటికే ఉందని, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రోత్సాహం అందించడం శుభ పరిణామమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థకు స్వస్తి!
ఇక 8 నుంచి 11 ఏళ్ల వయస్సు వారికి 3 నుంచి 5 తరగతులు, 11 నుంచి 14 ఏళ్ల వయస్సు వారికి 6 నుంచి 8 తరగతులు, 14 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి 9 నుంచి 12 తరగతులు నిర్వహిస్తామంది. అంటే ఇకపై ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థ ఉండదు. సీబీఎస్ఈ మాదిరిగా 11, 12 తరగతుల మాదిరిగానే పరిగణిస్తారు. అలాగే పాఠశాల స్థాయిలో కూడా విదేశీ భాషా కోర్సులను అందుబాటులోకి తేవడం ద్వారా ప్రాథమిక స్థాయి నుంచే వివిధ భాషలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది శుభపరిణామం. ఇప్పటి వరకూ మూడేళ్లుగా ఉన్న డిగ్రీ విద్యను నాలుగేళ్లుగా మార్పు చేశారు. ఇందుకు సరైన కారణాలను వివరించలేకపోయారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ విధానం పార్లమెంట్ లో బిల్లు పాసైన తర్వాత అమలు లోకి వస్తుంది. అనంతరం ఎస్ఎస్ఆర్ఎ (స్టేట్ స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ) ఏర్పాటు చేసి చీఫ్ విద్యా శాఖతో సంబంధం కలిగి ఉంటుంది. ఉపాధ్యాయ కోర్సులు, నియామకాలు, విధులలోనూ ఈ విధానంలో కొన్ని మార్పులు చేశారు. బదిలీ విధానంపై స్పష్టత కరువైంది. పీజీ చేసిన వారికి ఒక్క ఏడాది బీఈడీ కోర్సు తేవడంతో ఆ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.