iDreamPost
android-app
ios-app

ఉద్యోగ సంఘాల నాయకుల్ని ఏమని బ్లాక్ మెయిల్ చేశారట?

  • Published Feb 08, 2022 | 12:39 PM Updated Updated Feb 08, 2022 | 12:39 PM
ఉద్యోగ సంఘాల నాయకుల్ని ఏమని బ్లాక్ మెయిల్ చేశారట?

పీఆర్సీ అమలుకు సంబంధించి ఉద్యోగుల జేఏసీ, మంత్రుల కమిటీ మధ్య చర్చలు సఫలమై సమ్మె నిర్ణయాన్ని ఉద్యోగులు విరమించడాన్ని పచ్చబ్యాచ్‌ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే రోజుకో విధంగా ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలు గుప్పిస్తోంది. దీనికి పెంపుడు మీడియా యథాశక్తి సహకరిస్తోంది. చర్చల్లో ప్రభుత్వం ఆధిపత్య ధోరణి ప్రదర్శించిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  ఉద్యోగులను బెదిరించారని చంద్రబాబు అడ్డగోలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మరో రూపంలో ప్రభుత్వంపై నిందలు వేశారు. అమరావతిలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నాయకుల్ని బ్లాక్ మెయిల్ చేసి ఉద్యమాన్ని నీరుగార్చారని విమర్శించారు. నాయకుల స్వార్థం కోసం ఉద్యోగస్తుల్ని మోసం చేయబట్టే.. ఆ జేఏసీల్లో నుంచి ఉద్యోగులంతా బయటకొచ్చి కొత్త జేఏసీలతో ఉద్యమానికి సిద్ధమవుతున్నారన్నారు.

టీడీపీ అండతో ఆందోళన కొనసాగించే యత్నం

ఉద్యమాన్ని ప్రభుత్వం నీరుగార్చిందని, ఉద్యోగులను బ్లాక్‌ మెయిల్‌ చేసిందని ఆరోపిస్తున్న అశోక్‌బాబు ఏమని బ్లాక్‌మెయిల్‌ చేసిందో చెబితే బావుండేది. ఉద్యోగ సంఘ నాయకుడిగా అప్పటి అధికార పార్టీ టీడీపీకి ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టబట్టే ఎమ్మెల్సీగా ఎదిగారని వైఎస్సార్‌ సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అందరూ ఆయనలాగే ఉంటారన్న ఉద్దేశంతో నాయకుల స్వార్థం కోసం ఉద్యోగస్తుల్ని మోసం చేశారని ఆరోపిస్తున్నారని అంటున్నారు. ఉద్యోగుల ఉద్యమం వెనుక టీడీపీ ఉందని సీఎం జగన్ మాట్లాడింది అక్షరాలా సత్యమని చెబుతున్నారు. రెండురోజులపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం జేఏసీ నాయకులు అందరితోపాటు సమ్మెకు విరమణకు అంగీకరించిన ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇప్పుడు దానికి విరుద్ధంగా మాట్లాడడాన్ని బట్టే టీడీపీ వెనుకుండి నడిపిస్తోందని అర్థమవుతోందని అంటున్నారు. కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఎగదోసి ఉద్యోగుల ఆందోళనను ఎలాగైనా కొనసాగించాలని టీడీపీ, పచ్చమీడియా ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

Also Read : ఏపీ ఉద్యోగులను సజ్జల బెదిరించారట!

ఏ లెక్కన ఆదాయం పెరిగిందో చెప్పగలరా?

ఉద్యోగుల డిమాండ్లు అన్నీ నెరవేర్చడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనటం పచ్చి అబద్దమంటున్న అశోక్‌బాబు పొంతన లేని లెక్కలు చెబుతున్నారు. ప్రభుత్వానికి 2021 డిసెంబర్ నాటికే రూ. 97 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, మార్చి నాటికి రూ. 1 లక్షా 32 వేల కోట్లకు పెరుగుతుందని ఆయన ఏ ప్రమాణాలతో అంచనా వేస్తున్నారని అధికార పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నత అధికారులు ప్రెస్‌మీట్‌ పెట్టి కోవిడ్‌ కారణంగా రాష్ట్రానికి ఆదాయం ఎలా తగ్గిందీ వివరించారు. అదంతా అబద్ధమంటున్న అశోక్‌బాబుకు ఏ ఆధారాలతో ఆదాయాల గురించి మాట్లాడుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర ఆదాయం పెరిగిందే తప్ప తగ్గలేదని పచ్చి అబద్దాలను మాట్లాడడం జనాన్ని తప్పు దోవ పట్టించడానికేనని అంటున్నారు.

నాడు, నేడు పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటోందని,  ఈ అవినీతి లేకపోతే 30 శాతం పీఆర్సీ ఇవ్వొచ్చు అని చెబుతున్న అశోక్‌బాబు… తమ నాయకుడు చంద్రబాబు లాగే అందరూ దోచుకుంటారని అనుకుంటున్నారా? నాడు – నేడు పనుల్లోనే కాదు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏ కార్యక్రమంలోనూ అవినీతికి తావులేకుండా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థలో ఎన్నడూలేని విధంగా తీసుకొస్తున్న విప్లవాత్మక చర్యలను అభినందించకపోతే పోనీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం తగదని వైఎస్సార్‌ సీపీ నేతలు హితవు చెబుతున్నారు.

Also Read : ముందు ఎర్ర జెండా.. వెనుక పచ్చ అజెండా – తూర్పారబట్టిన సీఎం జగన్‌