iDreamPost
iDreamPost
చాలా కాలం తర్వాత టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో రెండు రోజులపాటు పర్యటించారు. గతంలో ఓసారి పర్యటించాలి అనుకున్నా కొన్ని కారణాలవల్ల ఆ పర్యటన వాయిదా పడింది. చివరికి అక్టోబర్ చివరి వారంలో ఆయన పర్యటించారు.
1978 లో తొలి ఎన్నికల ద్వారా చంద్రగిరి నియోజకవర్గం నుండి గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ గాలిలో ఘోరపరాజయం చవిచూశారు. ఆ తర్వాత నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. అయితే 1985లో జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. తిరిగి 1989లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుండి కాక కుప్పం నుండి పోటీచేసి టీడీపీ తరపున శాసనసభకు గెలిచారు. అప్పటి నుండి వరుసగా ఏడు సార్లు కుప్పం నుండి గెలుస్తూనే ఉన్నారు. 1995లో టీడీపీ నాయకత్వం చేపట్టినప్పటి నుండీ కుప్పంలో ఆయన ప్రచారం చేసింది కూడా లేదు. టీడీపీ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాష్ట్రం అంతటా ప్రచారం చేయడమే కానీ కుప్పంలో ఎప్పుడూ ప్రచారం చేయలేదు.
చివరికి ఎన్నికల్లో నామినేషన్ కూడా ఆయన నేరుగా వేసింది లేదు. తన ప్రతినిధులతోనే నామినేషన్ పత్రాలు పంపించి పోటీ చేస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి గెలుపు పత్రాలు స్వీకరించింది కూడా లేదు. ఆ పత్రాలు కూడా తన పార్టీ నేతలే తెచ్చి చంద్రబాబుకు అందజేసేవారు. అదీ కుప్పంతో ఆయనకున్న సంబంధం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
మొట్టమొదటి సారిగా చంద్రబాబు కుప్పంలో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. 2019 ఎన్నికల్లో తొలి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనుకబడ్డారు. ప్రతి ఎన్నికలోనూ 45 వేల నుండి 50 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో మాత్రం 30 వేల ఓట్ల అధిక్యంతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పొందింది. సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా టీడీపీ తగినన్ని స్థానాలు గెలుచుకోలేకపోయింది.
Also Read : TDP Complaint – వైసీపీని చూసి వాతలు పెట్టుకున్న టీడీపీ… బాబూ ఎందుకిలా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యనే కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చారు. ఈ నెలలోనే కుప్పం పురపాలక సంఘానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఆధిక్యతను, తన ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో రెండురోజులు పర్యటించారు. తన పర్యటన ద్వారా నియోజకవర్గంలో తన పట్టు కోల్పోకుండా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేటందుకు కార్యకర్తలను, ఓటర్లను సిద్ధం చేసేందుకు నియోజకవర్గంలో రెండురోజులపాటు పర్యటించారు.
అయితే ఈ పర్యటనలో తన పార్టీని, తన అభిమానులను ఎంత మేర ఉత్తేజపర్చారో కానీ, ఆయన ఇంకా 1978-1980 కాలం నాటి రాజకీయాల్లోనే ఉన్నారని అర్ధం అవుతోంది. 1980 దశకంలో మల్లెల బాబ్జి ఉదంతం చంద్రబాబు రెండురోజుల పర్యటనలో మొదటిరోజు కనిపించింది. ఓ వ్యక్తి ఎవరో చేతిలో బాంబుతో వచ్చినట్టు, టీడీపీ కార్యకర్తలు ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్టు చంద్రబాబు ప్రకటించారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తనను అంతం చేసేందుకు కుట్ర పన్నారు అంటూ చంద్రబాబు సానుభూతికోసం ప్రయత్నం చేశారు.ఆ తర్వాత రెండో రోజు తనలాంటి అనుభవమున్న, దార్శనికత ఉన్న నేతను కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే అంటూ కుప్పం ప్రజలంతా తనకు అండగా ఉండాలంటూ ప్రసంగించారు. తనకు అండగా ఉంటాం అనే హామీ కూడా ప్రజలనుండి తీసుకున్నారు. అయితే వారు ఎంతమేరకు చంద్రబాబుకు అండగా ఉంటారో త్వరలో జరగనున్న కుప్పం పురపాలక ఎన్నికల ఫలితాలు వెల్లడిచేస్తాయి. ఈ ఎన్నికల తర్వాత 2024లో చంద్రబాబు కుప్పం నుండి మాత్రమే పోటీ చేస్తారా లేక మరో నియోజకవర్గం నుండి కూడా పోటీ చేస్తారా అనేది తేలుతుంది.
మొత్తానికి కుప్పం ఓటర్ల అభీష్టం ఎలా ఉందో ఓ అంచనా వేసుకోవడానికి చంద్రబాబు తన రెండురోజుల పర్యటనను ఉపయోగించుకున్నారు. చంద్రబాబుతో ఉన్న ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ బృందంకు కూడా చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుపై ఓ అంచనా వేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడింది. ఇప్పుడు రాబిన్ శర్మ బృందం కుప్పంతో చంద్రబాబు భవిష్యత్ సంబంధాలపై విశ్లేషణలు మొదలు పెట్టింది. రెండు రోజుల పర్యటనలో చంద్రబాబుకు లభించిన ఆదరణ, ప్రజల మూడ్ వంటి అంశాలను రాబిన్ శర్మ బృందం విశ్లేషిస్తోంది. ఈ విశ్లేషణ పూర్తయితే చంద్రబాబు ప్లాన్ ఏంటో తెలిసే అవకాశం ఉంది.
Also Read : Chandrababu – Vizag Steel : బాబు నోటా అఖిలపక్షం మాట..!