iDreamPost
android-app
ios-app

Covid Vaccine, Booster Dose – బూస్టర్ డోస్ ఏమి ఇవ్వబోతున్నారు..?

  • Published Dec 28, 2021 | 1:49 PM Updated Updated Mar 11, 2022 | 10:30 PM
Covid Vaccine, Booster Dose – బూస్టర్ డోస్ ఏమి ఇవ్వబోతున్నారు..?

దేశంలో కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. కొద్దిరోజుల్లోనే 600కు పైగా కేసులతో ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కేసుల తీవ్రత అధికంగా ఉంది. దీని నుంచి రక్షణకు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నవారికి బూస్టర్ డోస్ వేయాలన్న డిమాండును, సూచనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దానికి సిద్ధం అవుతోంది. జనవరి మూడో తేదీ నుంచి ఫ్రంట్ లైన్ వారియర్లకు, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు బూస్టర్ డోస్ టీకాలు వేయనున్నట్లు స్వయంగా ప్రధాని మోదీ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఇందుకు కేంద్రం కోర్బ్ వ్యాక్స్ ను ఎంపిక చేసినట్లు అధికార వర్గాల సమాచారం.

30 కోట్ల డోసులకు ఆర్డర్

ప్రస్తుతం దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోంది. 18 ఏళ్లు పైబడిన జనాభాలో 62 శాతం మంది రెండు డోసులు వేయించుకోగా.. దాదాపు 90 శాతం మంది సింగిల్ డోస్ వేసుకున్నారు. కొత్తగా ప్రబలిన ఒమిక్రాన్ వేరియంట్ నుంచి రక్షణకు బూస్టర్ డోస్ లేదా మూడో డోస్ వేయాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో మొదట వేసుకున్న టీకానే బూస్టర్ డోసుగా ఇస్తారా లేక వేరే టీకా ఇస్తారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం వేస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ కాకుండా మరో మూడు రకాల టీకాలను వ్యాక్సినేషన్ పర్యవేక్షక కమిటీ పరిశీలిస్తోంది. వీటిలో హైద్రాబాదుకు చెందిన బయోలాజికల్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ప్రోటీన్ సెల్ యూనిట్ వ్యాక్సిన్ కోర్బ్ వ్యాక్స్ వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రూ. 1500 కోట్ల అడ్వాన్స్ కూడా చెల్లించి 30 కోట్ల డోసుల ఆర్డర్ ఇచ్చింది. కోర్బ్ వ్యాక్స్ తో పాటు కోవా వ్యాక్స్ టీకాల అత్యవసర వినియోగానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) మంగళవారమే అత్యవసర వినియోగ అనుమతులు కూడా జారీ చేసింది.

దీంతోపాటు సీరం ఇన్ సిట్యూట్ ఆఫ్ ఇండియా,  అమెరికాకు చెందిన నోవా వ్యాక్స్ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవా వ్యాక్స్ కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కోవాగ్జిన్ ఉత్పత్తిదారైన భారత్ బయోటెక్ రూపొందించిన ఇంట్రా నాసల్ వ్యాక్సిన్ను బూస్టర్ డోసుగా ఎంపిక చేయవచ్చు. దీనికి ఇప్పటికే డీసీజీయే అనుమతి లభించింది. జనవరి మధ్యనాటికి ఈ టీకా అందుబాటులోకి వస్తుంది. పుణెలోని జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఎమ్మార్ఎన్ఏ వ్యాక్సిన్ వేయాలన్న సూచనలు కూడా నిపుణుల నుంచి అందాయి. కోవిడ్ టీకా రెండు డోసులు వేసుకుని 9 నుంచి 12 నెలల వ్యవధి పూర్తి అయిన వారికి జనవరి మూడో తేదీ నుంచి బూస్టర్ డోస్ వేస్తారు. దీనికి కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.