iDreamPost
iDreamPost
విభజన గాయంతో, ఆర్థిక లోటుతో సతమతం అవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో రాష్ట్ర బీజేపీ నేతల తీరు విమర్శల పాలవుతోంది. కేంద్రంలో తమ కూటమి ప్రభుత్వం ఉన్నా.. అక్కడి పెద్దలతో మాట్లాడి హామీల అమలుపై ఒత్తిడి చేయకుండా మన్ను తిన్న పాముల్లా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. పోనీ ఢిల్లీ వెళ్లి వీరు ప్రయత్నించకపోయినా రాష్ట్రానికి వస్తున్న పలువురు కేంద్రమంత్రుల వద్దా పెండింగ్ హామీల విషయం ప్రస్తావించడంలేదు. అలాగని ఇతరులకైనా అడిగే చాన్స్ ఇవ్వడంలేదు. అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు.. అన్న చందంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు.
మాటలు తప్ప చేతల్లేవు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ, పలు కేంద్ర సంస్థల ఏర్పాటు, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం నిర్మాణం, వెనుకబడిన ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ వంటి ఎన్నో హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు. నీతి ఆయోగ్ సిఫార్సుల సాకుతో ప్రత్యేక హోదాకు ఇప్పటికే మంగళం పాడేశారు. కొన్నింటిని అరకొరగా అమలు చేస్తున్నా.. ఇంకా చాలా హామీలకు దిక్కుమొక్కు లేకుండా ఉంది. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంటును అమ్మకానికి పెట్టడం పుండు మీద కారం చల్లినట్లుంది. కేంద్రం నిర్వాకాలపై రాష్ట్రమంతా అసంతృప్తితో ఉన్నా బీజేపీ నేతలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. కేంద్రం చూస్తుంది.. చేస్తుంది.. అని రాష్ట్రంలో ప్రసంగాలు చేయడం తప్ప ఢిల్లీ వెళ్లి తమ పార్టీ, ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చే సాహసం చేయలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదని, ఆ విషయంలో తాము గ్యారెంటీ ఇస్తున్నామని ఇన్నాళ్లు మభ్యపెడుతూ వచ్చారు. కానీ కేంద్రం మాత్రం అమ్మకం దిశగా తన పని తాను చేసుకుంటూ పోతోంది. దాంతో రాష్ట్రంలో బీజేపీ నేతల పరువు పోతోంది.
రాష్ట్రానికి వస్తున్న కేంద్రమంత్రులనూ అడగనివ్వడంలేదు
ఢిల్లీకి వెళ్లి అడిగే సత్తా లేని బీజేపీ నేతలు రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్రమంత్రుల వద్ద అయినా పెండింగ్ హామీల గురించి ప్రస్తావించకపోగా.. ఇతరులను కూడా అడగనివ్వకుండా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ కోడలు, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో రెండు రోజులు పర్యటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర పేరుతో తిరుపతి, విజయవాడల్లో పర్యటించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి పలువురు కేంద్రమంత్రులు తరచూ వస్తున్నారు.
వారి వద్దకు వెళ్లి రాష్ట్ర అంశాలు ప్రస్తావించడానికి అవకాశం లేకుండా రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్నారు. చివరికి మీడియా ప్రతినిధులకూ అడిగే అవకాశం లేకుండా కేంద్రమంత్రుల ముందు అడ్డుగోడలా నిలుస్తున్నారు. ఏదో కేంద్ర మంత్రులకు మర్యాదలు చేసి సంతృప్తిపరుస్తున్నామా లేదా అన్నంతవరకే చూస్తున్నారు. మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందిన రెండు మూడు అంశాలు, గొప్పలు చెప్పి తమ పని అయిపోయిందన్నట్లు వెళ్లిపోతున్నారు తప్ప రాష్ట్ర సమస్యలను ప్రస్తావించడంలేదు. నాలుగు నెలల క్రితం జరిగిన తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో కేంద్రం వద్ద పెండింగులో ఉన్న అంశాలే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. వాటి కారణంగానే బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదన్న వాదన ఉంది. బీజేపీ నేతల తీరు ఇలాగే ఉంటే రాష్ట్రంలో ఉనికి కోల్పోక తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read : ఆగస్టు సంక్షోభం .. ఎన్టీఆర్ లాగ ఎంజీఆర్ సీఎం పదవి మీద కుట్ర జరిగిందా?