సాధారణంగా ఎన్నికల సమయంలో జంపింగ్ లు జరుగుతూ ఉంటాయి. అ’పొజిషన్లు’ మారుతుంటాయి. అక్కడి నేతలు ఇక్కడికి.. ఇక్కడి నేతలు అక్కడికి మారుతూ ఉంటారు. ఎన్నికలయ్యాక సీన్ రివర్స్ అవుతుంది. అధికార పార్టీలోకి ఇన్ కమింగ్ మాత్రమే ఉంటే.. ప్రతిపక్ష పార్టీ నుంచి ఔట్ గోయింగ్ మాత్రం ఉంటుంది.. పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే సీన్ జరిగింది.. ఎన్నికల తర్వాత అలానే జరుగుతోంది. బీజేపీ గెలుస్తుందని భావించిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు.. కాషాయ కండువా కప్పుకునేందుకు వరస కట్టారు. ఎన్నికలు అయిన మరుసటి రోజు నుంచే సొంత పార్టీలోకి క్యూ కట్టారు.. కడుతున్నారు. బెంగాల్ లో ఎన్నికలు పూర్తయ్యి మూడు నెలలు అవుతున్నా.. చేరికలు ఇంకా ఆగలేదు.
294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో 292 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. టీఎంసీ 213, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్నాయి. నందిగ్రామ్ లో మమతను ఓడించి సువేందు అధికారి సంచలనం సృష్టించినా.. బెంగాల్ కోటను మమత నిలబెట్టుకున్నారు.. తన ఓటమిని లైట్ తీసుకొన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందు నుంచే.. బీజేపీ నుంచి వలసలు మొదలయ్యాయి. బీజేపీలో ముఖ్యమైన నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోతున్నారు. సీనియర్ నేత ముకుల్ రాయ్ చాలా రోజుల కిందటే సొంత గూటికి చేరుకోగా.. సోమ, మంగళ వారాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఎంసీ లో చేరారు. సోమవారం తన్మయ్ ఘోష్, మంగళవారం విశ్వజిత్ దాస్ బీజేపీని వీడారు.
బీజేపీ నుంచి 77 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పటిదాకా ఐదుగురు ఎమ్మెల్యేలు టీఎంసీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరంతా గతంలో టీఎంసీ నుంచి వచ్చి బీజేపీ లో చేరినవాళ్లే. వీళ్ళు కాకుండా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు సహా ఇతర నేతలు.. బీజేపీ నుంచి తిరిగి టీఎంసీ లోకి వెళ్లిపోతున్నారు. రానున్న రోజుల్లో ఘర్ వాపసీ మరింత జోరుగా సాగే అవకాశం ఉంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కంటే ధీటుగా ఎదుర్కొంటున్నారు మమత. ముందు నుంచి ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్రమంలో మమత ను బెంగాల్ లో ఓడించాలని బీజేపీ ప్లాన్ చేసింది. టీఎంసీ నేతలను భారీగా చేర్చుకుంది. కానీ బీజేపీ పాచికలు పారలేదు. మమత వీల్ చైర్ లో కూర్చునే పార్టీ ని గెలిపించుకున్నారు. దీంతో బీజేపీ ప్లాన్ ను రివర్స్ లో అమలు చేస్తున్నారు మమత. రాష్ట్రంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్ష బీజేపీ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు. పార్టీని వీడి వెళ్లిన వారు తిరిగి వచ్చే విషయంలో మొదట వ్యతిరేకత వ్యక్తమైనా.. బీజేపీని దెబ్బకొట్టాలనే ఏకైక వ్యూహంతో ఘర్ వాపసీ ని కొనసాగిస్తున్నారు మమత. ఇంకెంత మంది బీజేపీని వెళ్తారో చూడాలి మరి.
Also Read : కుదిరిన పదవుల పంపకం,రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కినట్లే !