iDreamPost
iDreamPost
మనిషి శారీరక, మానసిక వికాసానికి కావాల్సిన అన్ని పోషకాలు గల ఆహారాన్ని తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఇటువంటి పోస్టులు చదివినంత ఆసక్తిగా.. వాటిని తినడంపై దృష్టి పెట్టరన్నది వ్యక్తిగతంగా అందరికీ అనుభవమే. కానీ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తున్న వైరస్‌ప్రభావం కారణంగా పౌష్టికాహార ప్రాధాన్యత మరోసారి విస్తృతంగా జనంలో నానుతోంది. అయితే ఇటువంటి విషయాలను సామాన్యుల చెంతకు బలంగా తీసుకువెళ్ళాల్సిన యంత్రాంగా తన పాత్రను సమర్ధవంతంగా పోషించడం లేదన్న సందేహాలున్నాయి. వైరస్ వ్యాప్తిని గురించి భయాలు, అక్కడొచ్చేసింది, ఇక్కడ కూడా ఉంది, ఇంత మందికొచ్చింది, ఫలానా నెలకు ఇన్ని లక్షల మందికి వ్యాపిస్తుందట అంటూ విపరీత వ్యాఖ్యానాల ప్రచారంజోరుగా సాగుతోంది. అయితే ఎటువంటి వైరస్‌లనైనా సమర్ధవంతంగా తట్టుకునే స్థాయిలో శరీరాన్ని సిద్ధం చేయాలంటే అందుకు పౌష్టికాహరమే ప్రధానమన్న విషయానికి తగినంత ప్రచారానికి నోచుకోవడం లేదన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. వైరస్ లక్షణాలు, వైరస్ భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు లభిస్తున్న ప్రచారం పౌష్టికాహారానికి లభించడం లేదన్నది ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నదే.
పౌష్టికాహారానికి నిర్వచనం ఇవ్వడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమైనదేనని చెప్పాలి. దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా పౌష్టికాహారంలో తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు మారిపోతుంటాయి. అందరికీ ఒకే రకమైన ఆహారం కుదరని పని. లభించని పరిస్థితి. స్థానికంగా లభించే అనేకానేక దినుసులు, పళ్ళు, పప్పులే ఎక్కడివారికక్కడే పౌష్టికాహారంగా ఉపయోగపడతాయన్నది ప్రకృతి వైద్యులు చెప్పే మాట. ఎక్కడ్నుంచో చెర్రి పండు తెప్పించుకుని తినేకంటే స్థానికంగా లభించే జామపండు ఎంతో మేలు చేస్తుందన్నది వీరి వాదన. అలాగే ఇతర ఆహార పదార్ధాలపై కూడా అభిప్రాయాలు విస్తృత ప్రచారం ఉన్నాయి. గ్రామీణ స్థాయి వరకు కూడా పౌష్టికాహారం అంటే మాంసాహారమేనన్న అపోహ బలంగా ఉంది. అయితే శాఖాహారం తిన్నవారు కూడా మాంసాహారం తినేవారి కంటే ఆరోగ్యంగానే ఉంటారన్న ఉదాహరణలు కూడా అనేకమున్నాయి. పౌష్టిక ఆహారం పేరుతో మార్కెట్‌లో లభించే ఆయా వస్తువుల నాణ్యతపై కూడా అనేకానేక సందేహాలు కొనసాగుతున్నాయి.
లాక్డౌన్ నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపోయారు. దీంతో రైతులను ఆదుకునేందుకు వివిధ రకాల పండ్లతో కిట్‌లు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అందించే ప్రయత్నం చేసింది. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రాంతాల వారీగా లభించే వివిధ రకాల పౌష్టిక ఆహార పదార్ధాలను విస్తృతంగా వారికి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తే ప్రజలకు అవసరమైన పౌష్టికత లభించడంతో పాటు, అవి పండించే రైతులకు కూడా తగిన ప్రతిఫలం అందే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ప్రభుత్వం ద్వారా అందించేవి కావబట్టి వాటిపై ప్రజలకు కూడా నమ్మకం ఏర్పడుతుంది. తద్వారా ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలను వైరస్‌లను తట్టుకునే విధంగా తీర్చిదిద్దినట్లవుతుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.