Idream media
Idream media
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ముదురుతోంది. ప్రాజెక్టులు నిండక ముందే.. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుండగా.. తమ హక్కు మేరకే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచే కాకుండా మంగళవారం నుంచి పులిచింత ప్రాజెక్టు వద్ద కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండడాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రధానంగా సాగునీటి అవసరాలకే నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం దిగువకు విడుదల చేసే నీటిని ప్రకాశం బ్యారేజీలో నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో ఆ జలాలు వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. నిబంధనలకు విరుద్దంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
నీరు వృథాగా పోకుండా ఉండేందుకు.. పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఈ.. ఈ రోజు తెలంగాణ జెన్‌కో ఎస్‌ఈకి లేఖ రాశారు. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని విన్నవించారు. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడం లేదని, నీరు విడుదల చేయాలనే ఇండెంట్ కూడా రాలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటూ ఏపీ అధికారులు ఈ రోజు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సాగర్ కొత్త వంతన వద్దే మాచర్ల ఆర్డీవో, డీఎస్పీ, ఇరిగేషన్ అధికారులను తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. తాజాగా పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద పోలీసులను మోహరించింది.
ఏపీ ప్రభుత్వం ఆందోళన, ఇరిగేషన్ అధికారులు వినతులను పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం నిరాటంకంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు వద్ద పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. అక్కడ ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులను మోహరించింది.
ఏపీ అందోళనను, రైతుల ప్రయోజనాలను పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం.. తమ హక్కు మేరకే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని చెబుతోంది. కృష్ణా నది నీటిని నాగార్జున సాగర్ నుంచి ఏపీ ప్రభుత్వం చోరీ చేస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఉత్పత్తిని ఆపబోమని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. తాము విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని ఎవరూ ఆపలేరంటున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల విషయంలో మళ్లీ మొదలైన వివాదం.. చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇరు రాష్ట్రాలు నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పరస్పరం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు అక్రమమంటూ తెలంగాణ ఆరోపిస్తుండగా..పాలమూరు – రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను అక్రమంగా కడుతూ, నెట్టంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం విస్తరిస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా విద్యుత్ ఉత్పత్తి విషయంలో మొదలైన జల వివాదం రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
Also Read : పోలవరం ముంపు సమస్యకు పరిష్కారం చూపిన జగన్ సర్కార్