Idream media
Idream media
అంతర్జాతీయ క్రికెట్‌లో ‘సుల్తాన్ ఆఫ్ స్వింగ్’, యార్కర్స్ రారాజుగా పాక్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ పేరు గడించాడు. గణనీయమైన వేగంతో బౌలింగ్ చేయగల అక్రమ్ టెస్ట్ మరియు వన్డేలో నాలుగు హ్యాట్రిక్స్ సాధించిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ అరుదైన “డబుల్ హ్యాట్రిక్” రికార్డులలో వన్డేలలో రెండు,టెస్టులలో మరో రెండు సాధించాడు.పైగా రెండు హాట్రిక్స్ ఫైనల్ మ్యాచ్‌లలో సాధించి పాకిస్తాన్ ఛాంపియన్‌లుగా అవతరించడంలో కీలక పాత్ర వహించాడు.
సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా-ఆసియా కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో వసీం అక్రమ్ తన రెండవ వన్డే హ్యాట్రిక్ నమోదు చేశాడు.1990 మే 4న షార్జా వేదికగా జరిగిన వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాక్ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ సయీద్ అన్వర్ 40 పరుగులు చెయ్యగా సలీమ్ మాలిక్ 104 బంతులలో 87 పరుగులు చేశాడు.వసీం అక్రమ్ కూడా తన వంతుగా అజేయంగా 49 పరుగులు చెయ్యడంతో పాకిస్తాన్ తమ నిర్ణీత 50 ఓవర్లలో 266/7 పరుగులు సాధించింది.
దీనికి సమాధానంగా ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ బూన్ 37 పరుగులు, మార్క్ టేలర్ 52 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు.తరవాతి బ్యాట్స్‌మెన్‌లలో స్టీవ్ వా (64), సైమన్ ఓ డోనెల్ 33 పరుగులు చెయ్యడంతో ఆస్ట్రేలియా 46 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించింది. విజయానికి 30 బంతుల్లో 36 పరుగులు సాధించాల్సిన స్థితిలో బంతి చేపట్టిన అక్రమ్ తన పదునైన ఇన్ స్వింగ్, బ్యాక్-టు-బ్యాక్ డెలివరీలలో ముందుగా మెర్వ్ హ్యూస్(9)ను బౌల్డ్ చెయ్యగా, మిగిలిన కార్ల్ రాకేమాన్,టెర్రీ ఆల్డెర్మాన్‌లను పరుగుల ఖాతా తెరవక ముందే “గోల్డెన్ డక్”లుగా బౌల్డ్ చేశాడు.
వన్డేలలో అక్రమ్ రెండోసారీ హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాకిస్థాన్ 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి కప్ చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో వసీం అక్రమ్‌తో పాటు స్పిన్నర్ ముష్తాక్ అహ్మద్ కూడా మూడు వికెట్లు పడగొట్టగా, వకార్ యూనిస్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. బ్యాట్ మరియు బాల్ రెండింటిలోనూ అద్భుతమైన ఆటతీరు కనబరిచినందుకు వసీం అక్రమ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా ఎంపికయ్యాడు.
అక్రమ్ తొలి వన్డే హ్యాట్రిక్ కూడా ‘షార్జా’లోనే:
ఇంతకు ముందు వసీం అక్రమ్ 1989లో షార్జాలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్‌పై తన తొలి వన్డే హ్యాట్రిక్ సాధించాడు.ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసిన దశలో తన స్వింగ్ బౌలింగ్‌తో విజృంభించి వరసగా మూడు బంతులలో జెఫ్ డుజోన్,మాల్కం మార్షల్, కర్ట్లీ అంబ్రోస్‌లను బౌల్డ్ చేశాడు.దీంతో వసీం అక్రమ్ తొలిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో హ్యాట్రిక్ సాధించాడు.
1999లో లాహోర్ గ్రౌండ్‌లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో వరస బంతులలో రోమేష్ కలువితారణ, నిరోషన్ బండరటిల్లకే, ప్రమోద్య విక్రమాసింగ్‌లను ఔట్ చేసి తన తొలి టెస్ట్ హ్యాట్రిక్ సాధించాడు.అదే సంవత్సరములో ఢాకా వేదికగా శ్రీలంకతో జరిగిన ఆసియా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రెండవ ఇన్నింగ్స్‌లో వరుసగా అవిష్క గుణవర్దనే,చమిండా వాస్,మహేలా జయవర్ధనే వికెట్లు పడగొట్టి వసీం అక్రమ్ టెస్ట్ మ్యాచ్‌లలో “డబుల్ హ్యాట్రిక్” సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. టెస్టులలో అక్రమ్ సాధించిన రెండు హ్యాట్రిక్‌లు కూడా శ్రీలంకపై నమోదు చేయడం విశేషం.