iDreamPost
iDreamPost
కామెడీ టైమింగ్, మాస్ అంశాలు సరిగ్గా బాలన్స్ చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడికి ఈ ఏడాది తన దర్శకత్వం వహించిన సినిమా ఇంకా రిలీజ్ కానప్పటికీ రెండు రూపాల్లో కొత్త ఝలక్ వచ్చి పడింది. ఇటీవలే తన పేరు, బ్రాండ్ మీదే ప్రమోట్ చేసుకున్న గాలి సంపత్ మరీ ఇంత దారుణంగా డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. జాతిరత్నాలు ప్రభావమని చెప్పి తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే కేవలం రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ ని నమ్ముకుని కథ కథనాల విషయంలో పూర్తి అజాగ్రత్తగా ఉండటం భారీ మూల్యాన్ని చెల్లించేలా చేసింది. రెండో రోజే నెగటివ్ షేర్లు పడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
శ్రీవిష్ణు ఖాతాలో మరో ఫ్లాప్ పడటం తప్ప ఇంకే ప్రయోజనం కలగలేదు. ఎప్పుడో అరిగిపోయిన కామెడీని నమ్ముకుని అనీష్ దర్శకత్వంలో అనిల్ రావిపూడి కూర్చిన వంటకం ప్రేక్షకులకు రుచించలేదు. మిర్చి రవితో పాటు సంభాషణలు సమకూర్చిన ఇతను స్క్రీన్ ప్లేతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా టైటిల్ కార్డులో వేసుకున్నారు కాబట్టి ఇప్పుడీ పరాజయానికి బాధ్యత తీసుకోక తప్పదు. ఇక జనవరిలో సంక్రాంతికి వచ్చిన అల్లుడు అదుర్స్ స్క్రిప్ట్ లో అనిల్ రావిపూడి సహాయ సహకారాలు అందించినట్టు ఆ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చెప్పడమే కాదు ఇద్దరూ కలిసి వర్క్ చేసిన ఫోటోలు కూడా షేర్ చేసుకున్నారు. దాని రిజల్ట్ చూశాం.
సో ఇప్పుడు ఎఫ్3 అనే పెద్ద బాధ్యతను మోస్తున్న అనిల్ ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన తరుణం వచ్చేసింది. సరిలేరు నీకెవ్వరు కూడా వసూళ్ల పరంగా భారీగా రాబట్టుకుని ఉండొచ్చు కానీ మహేష్ బాబు కెరీర్ బెస్ట్ మూవీగా అభిమానులే చెప్పుకోలేరు. ఎఫ్2 లోనూ వెంకటేష్ అద్భుతమైన టైమింగ్ అందులో చాలా బలహీనతలకు కవర్ చేసింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో. అందుకే పటాస్, సుప్రీమ్ నాటి అనిల్ రావిపూడి బయటికి వచ్చి గట్టిగా హోమ్ వర్క్ చేయాలి. దానికి తోడు ఇలా తనకు సంబంధం లేని ప్రాజెక్టుల్లో ఎక్కువ ఇన్వాల్వ్ కావడం వల్ల లాభం కన్నా జరుగుతున్న డ్యామేజే ఎక్కువ