iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నట్టు ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేశారు.ఇటీవల వెనక్కి తీసుకున్న కొత్త చట్టాల రూపకల్పనపై కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మరోసారి అసెంబ్లీ ముందుకు బిల్లులు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే బడ్జెట్ సమావేశలలో చట్టాలను రూపొందిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దాంతో మూడు రాజధానుల విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.
దానికి అనుగుణంగానే ఇప్పటికే కర్నూలులో పలు కార్యాలయాలు ప్రారంభమవుతున్నాయి. తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సహా పలు కార్యాలయాల ఏర్పాటుకి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని కొందరు వ్యతిరేకిస్తూ కోర్టులో పిటీషన్లు వేయడంతో కర్నూలుకి తరలింపు ప్రక్రియ ఆగిపోయింది. టీడీపీ నేతల ప్రోద్భలంతో న్యాయస్థానంలో పెడుతున్న అడ్డంకులను అధిగమించే లక్ష్యంతో అడుగులు వేస్తున్న జగన్ సర్కారు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తో పాటుగా, లోకాయుక్త కార్యాలయాలను కర్నూలులో ప్రారంభించింది. త్వరలోనే మహిళా కమిషన్ కార్యాలయం కూడా చేయాలనే యోచనలో ఉంది.
తాజాగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయవాడ నుంచి ఈ కార్యాలయాన్ని కర్నూలుకి తరలించేందుకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు ఆదేశాలు ఇచ్చారు. దాంతో త్వరలోనే ఈ ఆఫీసు కర్నూలుకి మారడం ఖాయమయ్యింది. ఇప్పటికే వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం పకడ్బందీగా చర్యలకు పూనుకుంటోంది. పలు చర్యలు చేపడుతున్నట్టు అసెంబ్లీలో కూడా ప్రకటించింది. చంద్రబాబు హయంలో నిర్లక్ష్యం చూసిన అంశాలను సరిదిద్దే ప్రక్రియలో ఉన్నట్టు వెల్లడించింది. దాంతో పాటుగా ట్రిబ్యునల్ కూడా కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా భావించాలి.
మైనార్టీ జనాభా అత్యధికంగా ఉన్న కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ఏర్పాటు ముస్లీం వర్గాలకు ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో కర్నూలు న్యాయరాజధాని వైపు వేస్తున్న అడుగుల్లో ఇదో కీలక నిర్ణయంగా కూడా భావించాల్సి ఉంటుంది.
Also Read : Chandrababu, OTS – ఓటీఎస్‌పై బాబు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు..?