iDreamPost
android-app
ios-app

VSP, Export House status – విశాఖ ఉక్కుకు ప్రత్యేక హోదా

  • Published Nov 30, 2021 | 12:37 PM Updated Updated Nov 30, 2021 | 12:37 PM
VSP,  Export House status – విశాఖ ఉక్కుకు ప్రత్యేక హోదా

కరిగిపోతానని తెలిసినా కొవ్వొత్తి చివరి క్షణం వరకు వెలుగు ఇస్తూనే ఉంటుంది. దేశీయ ఉక్కు దిగ్గజం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి అలాగే ఉంది. దీన్ని అమ్మేయడానికి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. ఈ ఫ్యాక్టరీ మాత్రం తన సామర్థ్యాన్ని చాటుకుంటూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూ దేశ ఆర్థిక రంగానికి ఇతోధికంగా సాయపడుతోంది. కరోనా సంక్షోభంలోనూ అత్యుత్తమ పనితీరుతో లాభాలు ఆర్జించిన ఉక్కు ఫ్యాక్టరీ.. తాజాగా ఎగుమతుల రంగంలోనూ కొత్త శిఖరాలు అధిరోహిస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నుంచి అత్యంత ప్రతిష్టాత్మక ఫోర్ స్టార్ ఎక్స్ పోర్ట్ హౌస్ హోదా సాధించింది. దేశంలో ఈ హోదా సాధించిన ఏకైక ఉక్కు కర్మాగారంగా నిలిచింది. విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆర్జించే సంస్థగానూ ప్రత్యేకత చాటుకుంది.

వరుసగా రెండో ఏడాదీ రికార్డ్ ఎగుమతులు

కరోనా సంక్షోభం వల్ల దేశంలో మౌలిక వసతుల రంగం దెబ్బతినడం వల్ల ఉక్కు వ్యాపార లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. దాంతో విశాఖ ఉక్కు అధికారులు ఆ లోటును భర్తీ చేసే ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డారు. ఎగుమతుల రంగం వైపు దృష్టి సారించారు. ప్రత్యేక మార్కెట్ వ్యూహాలు అనుసరించారు. అప్పటికే నాణ్యతపరంగా విశాఖ ఉక్కుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ బాగా ఉపయోగపడింది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.3500 కోట్ల విలువైన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయగలిగారు. అదే జోరు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించారు ఫలితంగా వరుసగా రెండో ఏడాదీ రూ.3500 కోట్ల ఎగుమతుల మార్కును దాటారు. అరుదైన ఈ ఫీట్ ను గుర్తించిన డీజీఎఫ్టీ ఫోర్ స్టార్ ఎక్స్ పోర్ట్ హౌస్ హోదాతో గౌరవించింది. భవిష్యత్తులోనూ ఎగుమతులు మరింత వృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్టీల్ ప్లాంట్ సీఎండీ రామ్మోహన్ రావు చెప్పారు.

కేంద్రానికి విదేశీమారక ద్రవ్యం

విశాఖ స్టీల్ ప్లాంట్ చేస్తున్న ఉక్కు ఎగుమతుల్లో అత్యధిక శాతం చైనాకే వెళుతున్నాయి. ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. నేపాల్, శ్రీలంక, సింగపూర్ లకు కూడా విశాఖ ఉక్కు ఎగుమతి అవుతోంది. విదేశీ మార్కెట్ పెంచుకోవడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్
విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆర్జించి పెడుతోంది. మరోవైపు అధిక ఎగుమతులు చేసే సంస్థలకు కేంద్రం పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తోంది. పన్నులు, ఫీజుల్లో తగ్గింపులు కూడా ఉంటాయి. ఇవన్నీ ఉక్కు ఫ్యాక్టరీ ఆర్థిక నిర్వహణ భారాన్ని తగ్గిస్తున్నాయి. ఇన్ని రకాలుగా మేలు చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంటును అమ్మేయాలనుకోవడం బంగారు బాతును అమ్ముకోవడంలాంటిదేనని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అధ్యక్షుడు అయోధ్య రామ్ అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read : BJP, Somu Veerraju – తెగనమ్మడం కన్నా తాకట్టు నేరమా..?