iDreamPost
iDreamPost
ఒకే అంశం మీద పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేయడం , గతంలో మాట్లాడిన దానికి పొంతన లేకుండా ప్రస్తుతంలో మాట్లాడటంలో చంద్రబాబుని మించిపోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది పవన్ కళ్యాణ్ . విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిర్ణయం కేంద్రానిది కాగా ఈ నిర్ణయం పై రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని వ్యతిరేకిస్తున్నానంటూ నిన్న చేసిన దీక్షలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేని గెలిపించిన తనకు కేంద్రం చాలా గౌరవం ఇస్తుందని , అలాంటిది 151 మంది ఎమ్మెల్యేలు , 22 మంది ఎంపీలు ఉండి మీరేం చేస్తున్నారని అన్నారు .
గతంలో ఇదే బిజెపి తనకు విలువ ఇవ్వట్లేదని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా వాపోవడం గమనార్హం . 2014 ఎన్నికల ప్రచారంలో తిరుపతి వేదికగా మోడీ , బాబు , పవన్ త్రయం ఉమ్మడిగా చేసిన ప్రచారంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ గురించి తర్వాతి రోజుల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేంద్రం తనకు విలువ ఇవ్వట్లేదని తాను నిస్సహాయుణ్ణని చెప్పుకొచ్చారు . అధికారంలో ఉన్న చంద్రబాబు ఆడిగితేనే హోదా ఇవ్వట్లేదని , కేంద్రంతో మాట్లాడే స్థాయి తనది కాదని పలుమార్లు చెప్పిన పవన్ చివరికి కేంద్రం ప్యాకేజి ప్రకటించాక బిజెపి రెండు పాచిపోయిన లడ్లు ఇచ్చిందని వ్యాఖ్యానించి సరిపెట్టుకొన్నారు .
అంతేతప్ప హోదా పై ఏ రోజూ బిజెపితో చర్చించే ప్రయత్నం చేయలేదు . అదే సమయంలో హోదా వద్దు అని ప్యాకేజి తీసుకొన్న టీడీపీని సూటిగా విమర్శించే సాహసం కూడా చేయలేదు . పైగా నాటి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ సరిగా ప్రశ్నించలేదు , పోరాడలేదు , వైసీపీ ఎంపీలు రాజీనామా చేయలేదు అంటూ విమర్శల వర్షం గుప్పించారు . వైసీపీ పార్టీ బిజెపికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే తాను దేశవ్యాప్తంగా 80 మంది ఎంపీల చేత మద్దతు ఇప్పిస్తానని వైసీపీకి సవాల్ విసిరిన పవన్ కళ్యాణ్ , తరువాతి పార్లమెంట్ సమావేశాల్లో హోదా విషయంలో బిజెపి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది అంటూ వైసీపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా పవన్ కళ్యాణ్ 80 మంది ఎంపీల మద్దతు ఇప్పించకపోగా , ఈ అంశం పై ప్రశ్నించిన వారికి తాను చెప్పిన తారీఖుల్లో అవిశ్వాసం పెట్టలేదని డొంకతిరుగుడు సమాధానం చెప్పడం విశేషం .
Also Read : కాంగ్రెస్ కూడా కాషాయం జపం చేస్తోందా?
2019 ఎన్నికల్లో టీడీపీ , బిజెపిలతో పొత్తు లేకుండా పోటీ చేసిన జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలవడం , గెలిచిన ఎమ్మెల్యే కూడా పవన్ తీరు సరిగా లేదంటూ వైసీపీకి మద్దతుగా ఉండటంతో సొంతంగా ఏమీ చేయలేననుకొన్న పవన్ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకొని హిందూత్వ బాట అందుకున్నారు . కానీ ఏ విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలోని బిజెపిని అడిగే సాహసం చేయకపోగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు కురిపించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు .
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోగా అందుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయటమే కాక , ప్రయివేటీకరణ చేయకుండా లాభసాటిగా కొనసాగించే అవకాశాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి , ప్రధానికి లేఖలు రాశారు . అంతేకాక అఖిల పక్షంతో కలిసి వెళ్లి ప్రధానితో చర్చించటానికి అపాయింట్మెంట్ కూడా కోరింది వైసీపీ ప్రభుత్వం . అయితే కేంద్రం నుండి దీనికి సమాధానం రాలేదు . ఈ అంశాల పై చర్యలు తీసుకోని సమాదానమివ్వని కేంద్రాన్ని ప్రశ్నించకుండా వైసీపీ సరిగా స్పందించలేదు అని వ్యాఖ్యానించడం పలు విమర్శలకు తావిస్తోంది .
ఇప్పటికైనా విశాఖ ఉక్కు పైన కానీ , హోదా అంశం పైన కానీ పవన్ బీజేపీని ప్రశ్నించకపోతే , ఒక్క ఎమ్మెల్యేని గెలిపించిన పవన్ కి గౌరవం ఇస్తున్న బిజెపిని ఆయన ఎందుకు ప్రశ్నించరు , ప్రశ్నిస్తే బిజెపి ఆ పాటి గౌరవం కూడా ఇవ్వదని జనసేనాని భయపడుతున్నాడని జనంతో పాటు జనసైనికులు కూడా భావించే ప్రమాదం లేకపోలేదు .
Also Read : విశాఖ ఉక్కు దీక్ష – నానాజీ కీలక వాఖ్య