iDreamPost
android-app
ios-app

ఉధృతమవుతున్న ఉక్కు ఉద్యమం

ఉధృతమవుతున్న ఉక్కు ఉద్యమం

విశాఖపట్టణం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం ఉధృతస్థాయిలో కొనసాగుతోంది. ఆంధ్రుల హక్కు – విశాఖ ఉక్కు నినాదం మరోమారు మార్మోగుతోంది. విశాఖ ఉక్కు పరిరక్షణకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని అటు వైసీపీ నాయకులు, ఇటు కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్టీల్‌ప్లాంట్‌ జోలికి వస్తే సహించేది లేదని ఉద్యమ కారులు హెచ్చరిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలను కలుపుకొని పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చెబుతోంది. ఉద్యమం ఉధృతం కాకముందే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేస్తోంది.

నాడు కూడా ఉద్యమం ఉవ్వెత్తున రగులుతున్న సమయంలోనే సాధారణ ఎన్నికలు కూడా రావడంతో పార్టీని ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో విశాఖ, కర్ణాటకలోని బళ్లారిలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై 1970 ఏప్రిల్‌ 10న పార్లమెంటులో ప్రకటన చేశారు. దానికి కట్టుబడి 1971 జనవరి 20న విశాఖ బాలచెరువు జంక్షన్‌లో, బళ్లారిలో ఉక్కు కర్మాగారాల నిర్మాణానికి ఆమె శంకుస్థాపనలు చేశారు. ప్లాంట్‌ నిర్మాణం వెంటనే పూర్తయిపోయి, ఉద్యోగాలు వస్తాయని ప్రజలు ఉప్పొంగిపోయి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారు. కానీ గద్దెను ఎక్కిన తర్వాత ఇందిర ఐదేళ్ల పాటు విశాఖ ఉక్కు ప్రస్తావన లేకుండా చేశారు. రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. సర్వేల పేరిట కాలయాపన చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ విశాఖ ఉక్కు ప్రాధాన్యాన్ని, పోరాటాన్ని గుర్తించి 1977లో తొలి విడతగా రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. నాడు కాంగ్రెస్‌ పార్టీ రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మోసం చేస్తే.. నేడు బీజేపీ ప్రభుత్వం ఏకంగా పరిశ్రమను అమ్మేయాలని చూస్తోందని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ కోసం స్థానికంగానే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు గుంటూరు నుంచి విశాఖకు బైక్‌ ర్యాలీ చేపట్టాయి. ఆదివారం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ ర్యాలీకి ఘనస్వాగతం లభించింది. లెనిన్‌ సెంటర్‌లో కొద్దిసేపు సమావేశం అనంతరం ర్యాలీ కొనసాగింది. ఉక్కు పరిశ్రమ సాధనకు పోరాటాన్ని ప్రారంభించిన అమృతరావు విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ 18న విశాఖ చేరుకుంటుందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

కేంద్రమేందిరో.. దాని దూకుడేందిరో…

పోరాటాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేయడానికి మీరెవరంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రా బిడ్డేనని, ఏయూలో చదువుకుని ఆ స్థాయికి వెళ్లిన ఆయన ఇప్పుడు జాతి సంపద ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకోవద్దని కోరారు. పుట్టినగడ్డపై వెంకయ్య మమకారం చూపాలన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రక్షణ ప్రజావేదిక ఆధ్వర్యంలో విశాఖ డాబా గార్డెన్స్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఆదివారం భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తాను పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో స్టీల్‌ప్లాంట్‌ కోసం ఉద్యమం ప్రారంభమైందన్నారు. ఎంతోమంది ప్రాణత్యాగం, స్థానికుల భూముల వితరణతో సాధించుకున్న ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని, దీనికి సీఎం జగన్‌ ప్రత్యేక చొరవ చూపించాలని కోరారు. నష్టాల పేరిట కర్మాగారాన్ని అమ్మేస్తే అందులో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితేంటని ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకేతాటిపైకి వచ్చి స్టీల్‌ప్లాంట్‌ పరాయి పాలుకాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా, సభలో ప్రజల కోరిక మేరకు ‘విశాఖ మనదిరా.. స్టీల్‌ప్లాంట్‌ మనదిరా.. ఈ కేంద్రమేందిరో.. దాని దూకుడేందిరో..’ అంటూ నారాయణమూర్తి గీతాన్ని ఆలపించారు.