Idream media
Idream media
తనను పార్టీ ద్రోహిగా సంబోధిస్తూ చంద్రబాబు నాయుడు అవహేళన చేయడాన్ని టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇటీవలనే ముఖ్యమంత్రిని కలిసి తన మద్దతు ప్రకటించిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే గణేష్ కుమార్ చంద్రబాబు చేస్తున్న చిల్లర రాజకీయాలను రాష్ట్ర ప్రజలకు వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే .ఇన్నాళ్లుగా మనసు చంపుకొని టిడిపి లో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాలలోనూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో విప్లవాత్మకమైన మార్పు కనిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగని పనులు వైఎస్ జగన్ పాలనలో జరుగుతున్నాయి. క్షేత్రస్థాయి వరకు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయి. 14 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి కొరకు రూ. 59 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు….. ఆ ఘనత జగన్ సారధ్యంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది.
నా నియోజకవర్గానికి అభివృద్ధి పనుల కోసం చాలా సార్లు ప్రయత్నించినా గత టీడీపీ హయాంలో పనులు జరగలేదు….. బాబు అధికారంలో ఉండగా సామాన్యులకు న్యాయం జరగలేదు సూటు బూటు వేసుకున్న వాళ్ళకే పనులు జరిగాయి. రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు జగన్ గారు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతే టిడిపి నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారు… రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్ లేదు. విశాఖలో లేనిపోని ఉద్యమాలు చేయాలని టిడిపి పెద్దలు నాతో చెప్పారు…. లేని సమస్యలపై నేను ఉద్యమాలు ఎలా చేయగలను ?
విశాఖ ప్రాంతాన్ని వికేంద్రీకరణ లో భాగంగా జగన్ గారు అభివృద్ధి చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. నా పేరు మీద అమరావతిని స్వాగతిస్తూ ఒక లేఖను టీడీపీ నేతలే విడుదల చేసుకున్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వెంటనే నేను స్వాగతించాను. రానున్న విశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ బాధ్యత ఇచ్చినా సమర్థంగా చేపడతాను.’అని గణేష్ కుమార్ స్పష్టం చేశారు.