iDreamPost
iDreamPost
రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన జిల్లాల విభజన విశాఖ ప్రగతిని రెండు రెట్లు పెంచనుంది. ఇక నుంచి విశాఖ మహానగరం రెండు జిల్లాల్లో విస్తరించనుంది. గాజువాక నియోజకవర్గం కొత్తగా ఏర్పడే అనకాపల్లి జిల్లాలో కలవడంతో రూరల్ ప్రాంతమైన అనకాపల్లి పారిశ్రామిక జిల్లాగా ఎదగనుండగా.. మరోవైపు కొత్త విశాఖ జిల్లా పూర్తి నగర ప్రాంతంగా.. స్మార్ట్ సిటీగా, ఐటీ సిటీగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడింది. కాగా విశాఖ అర్బన్ జిల్లాలో భాగమైన భీమిలి కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రంగా అభివృద్ధి అర్థంలో దూసుకుపోనుంది. ఆర్థిక, పర్యాటక రాజధానిగా ఉన్న విశాఖ బహుముఖంగా విస్తరించేందుకు సీఎం జగన్ నిర్ణయం దోహదం చేస్తుందని నగర ప్రముఖులు, పలురంగాల నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక స్మార్ట్ విశాఖ
అనకాపల్లి జిల్లాలో గాజువాక నియోజకవర్గం చేరడంతో విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలు (నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్), భీమిలి నియోజకవర్గాలతో కొత్త విశాఖ జిల్లా ఆవిర్భవిస్తుంది. భీమిలి పరిధిలోని పద్మనాభం మండలం, భీమిలి మండలంలోని కొన్ని గ్రామాలు మినహాయించి ఆనందపురం మండలంతో సహా మిగతా ప్రాంతాలన్నీ ఇప్పటికే మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఉన్నాయి. విశాఖ రెవిన్యూ డివిజన్ ఇప్పటికే ఉండగా భీమిలిని కొత్త డివిజన్ చేస్తున్నారు. ఇక పరిశ్రమల్లో స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్ట్, బీహెచ్ఈల్, కంటైనర్ కార్పొరేషన్, హెచ్పీసీఎల్, డాక్యార్డ్, షిప్ యార్డ్, తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రం, ఐఎన్ఎస్ కళింగ మాత్రం విశాఖ పరిధిలో ఉంటాయి. మిగతా పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాంతాలు అనకాపల్లి జిల్లాలో కలుస్తాయి. దీంతో నగరంపై కొంత ఒత్తిడి తగ్గుతుంది. అదే సమయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలతో కొత్త ప్రగతికి దారులు తెరుచుకోనున్నాయి. ఐటీ సెజ్ ఉన్న మధురవాడ ప్రాంతాన్నీ బెంగళూరు తరహాలో ఐటీ హబ్ గా, సిలికాన్ వ్యాలీగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు ఉన్నాయి.
పరిశ్రమల పుంతగా అనకాపల్లి
గాజువాక ప్రాంతం చేరడంతో గ్రామీణ ప్రాంతంగా ఉన్న అనకాపల్లి పారిశ్రామిక జిల్లాగా గుర్తింపు పొందుతుంది. దువ్వాడలోని విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ తోపాటు లంకెలపాలెంలోని ఫార్మా సిటీ, పరవాడ ఎన్టీపీసీ ఆటోనగర్ వంటివన్నీ అనకాపల్లిలో చేరనున్నాయి. ఇక తూర్పు నావికాదళం రాంబిల్లిలో కొత్తగా నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ నేవల్ బేస్ ఐఎన్ఎస్ వర్ష కూడా అనకాపల్లిలోకే వెళ్తుంది. మరోవైపు ఇప్పటికే అచ్యుతాపురం, నక్కపల్లి ఎస్ఈజెడ్ లు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. ఫలితంగా అనకాపల్లి జిల్లా ఇక పారిశ్రామికంగా దూసుకుపోనుంది.
రెండు జిల్లాల్లో మహానగరం
జిల్లాల విభజనతో మహావిశాఖ నగరం రెండు జిల్లాల పరిధిలో విస్తరిస్తోంది. 98 డివిజన్లు, ఆరు జోన్లతో ఇటు భీమిలి నుంచి అటు అనకాపల్లి వరకు జీవీఎంసీ పరిధి ఉంది. జీవీఎంసీలో భాగంగా ఉన్న గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు అనకాపల్లి జిల్లాలో చేరుతున్నాయి. అనకాపల్లి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాలు కూడా జీవీఎంసీలో ఉన్నందున.. విశాఖ మహానగరంలో దాదాపు సగం ప్రాంతం అనకాపల్లి జిల్లాలోనూ ఉన్నట్లు అవుతుంది. దీనివల్ల స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద అందే నిధులతో అభివృద్ధికి అవకాశం ఉంటుంది.
మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు అతిపెద్ద జిల్లాగా ఉన్న విశాఖ జిల్లా తాజా పునర్విభజనతో విస్తీర్ణంలో చిన్నదిగా మారినప్పటికీ.. జనాభాపరంగా 16.80 లక్షలమందితో పెద్ద జిల్లాగా మారనుంది.