గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన ఆదిమ జాతి మహిళకు రాజకీయంగా ఉన్నత పదవి లభించింది. సోషల్ ఇంజినీరింగ్ లక్ష్యంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇంతవరకు అవకాశాలకు నోచుకోని ఎన్నో సామాజిక వర్గాలను గుర్తించి పదవులు ఇస్తూ రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పిస్తున్న వైఎస్సార్సీపీ జెడ్పీ అధ్యక్షుల విషయంలోనూ అదే పంథా కొనసాగించింది. ఎస్టీలకు రిజర్వ్ చేసిన విశాఖ జిల్లా పరిషత్ అధ్యక్ష పదవికి గిరిజనుల్లోనే అత్యంత వెనుకబడిన పొర్జా తెగ మహిళను ఎంపిక చేసి తన ప్రత్యేకతను మరోమారు చాటి చెప్పింది. జెడ్పీ చైర్ పర్సన్ గా జల్లిపల్లి సుభద్ర (అరబిరా సుభద్ర) ఎంపిక, ఆమె జెడ్పీటీసీగా బరిలోకి దిగి ఎన్నికవ్వడం.. రెండూ అనూహ్యంగానే జరగడం విశేషం.
Also Read : విజయనగరం జెడ్పీ పీఠం చిన్న శ్రీనుకే..
పొర్జా తెగకు తొలిసారి అవకాశం
గిరిజనుల్లో ఇంతవరకు వాల్మీకి, భగత, కొండ దొర తదితర తెగలకే రాజకీయ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఎస్టీల్లో అత్యంత వెనుకబడిన ఆదిమ జాతి (పీవీటీజీ) కొందు, పొర్జా, గదబ వంటి మరికొన్ని తెగలు ఉన్నాయి. ఈ తెగలకు రాజకీయ అవకాశాలు లభించడం అరుదు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనవారు కూడా దాదాపు లేరు. అటువంటి పొర్జా తెగకు చెందిన సుభద్రను జెడ్పీ చైర్మన్ వంటి ఉన్నత పదవికి ఎంపిక చేయడం విశేషం. వాస్తవానికి ఈ పదవిని మొదట వేరే మహిళకు ఇవ్వాలని అనుకున్నారు. గతంలో పాడేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా పనిచేసిన విశ్వేశ్వరరావు భార్య, పాడేరు జెడ్పీటీసీ గా ఎన్నికైన శివరత్నం పేరు ఖరారు చేసినట్లు చివరి వరకు ప్రచారంలో ఉంది. కానీ ఎన్నిక జరిగేనాటికి.. అనివార్య కారణాలు, సామాజిక సమీకరణాల వల్ల శివరత్నం బదులు సుభద్రను జెడ్పీ అభ్యర్థిగా పార్టీ ఎంపిక చేసింది. ఆ మేరకు ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Also Read : కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎప్పటి వరకు పదవిలో ఉంటారో తెలుసా?
పోటీ చేయడం కూడా అనూహ్యమే
ముంచంగిపుట్టు జెడ్పీటీసీ గా సుభద్ర 1957 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రైవేట్ స్కూల్లో టీచరుగా పనిచేస్తున్న ఆమెకు విద్యాబోధనే ఇష్టం. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తిలేదు. కానీ సోదరుడి ప్రోద్బలంతో ఎన్నికల బరిలో నిలిచి.. ఏకంగా ఉన్నత పదవినే పొందారు. సుభద్ర అన్నయ్య జగబంధు మొదటినుంచీ వైఎస్సార్సీపీలో కీలకంగా ఉన్నారు. ఆయనకు ముంచంగిపుట్టు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది. అయితే ఆ సీటు మహిళలకు రిజర్వ్ కావడం.. ముగ్గురు పిల్లల నిబంధన వల్ల జగబంధుతోపాటు ఆయన భార్య కూడా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.
దాంతో జగబంధు టీచరుగా ఉన్న తన సోదరిని ఒప్పించి పోటీలో నిలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో బరిలో నిలిచిన సుభద్ర తొలి ప్రయత్నంలోనే జెడ్పీటీసీగా.. ఆ వెంటనే జెడ్పీ చైర్ పర్సన్ గా ఎన్నికై.. తన తెగకు రాజకీయ వెలుగు తీసుకొచ్చారు. విద్యాభ్యాసమంతా ప్రభుత్వ బడులు, కళాశాల్లోనే చేసిన ఆమె ఏయూ దూరవిద్య ద్వారా ఎం ఏ చేశారు. చోడవరంలో బీఈడీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్నత అవకాశం ఇవ్వడం ద్వారా అత్యంత వెనుకబడిన తమ జాతిని అభివృద్ధి చేసే అవకాశం కల్పించారని.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ తెగతో పాటు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని సుభద్ర చెప్పారు.
Also Read : మాజీ ఎమ్మెల్యే శ్రీమతికి సిక్కోలు జెడ్పీ పీఠం