iDreamPost
iDreamPost
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో అతిపెద్ద నగరమైన విశాఖను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా.. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ నగరంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఒకవైపు రాజధాని కళ తీసుకొస్తూ మరోవైపు పారిశ్రామికంగా, పర్యాటకంగా అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తోంది. అదే సమయంలో నగరంలో మౌలిక సౌకర్యాల మెరుగుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా నగర ప్రజల దాహార్తి తీర్చే బృహత్తర తాగునీటి పథకాన్ని తెరపైకి తెచ్చింది. వచ్చే 50 ఏళ్లలో నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏకంగా పైప్ లైన్ ద్వారా విశాఖకు గోదావరి జలాలను తరలించడం కొత్త పథకం లక్ష్యం.
11 టీఎంసీల గోదావరి జలాలు
విశాఖ నగర ప్రస్తుత జనాభా సుమారు 25 లక్షలు. 2051 నాటికి ఇది 50 లక్షలకు పెరుగుతుందని అంచనా. వీరికి తాగునీరు అందించడంతోపాటు.. నగరంలోని పరిశ్రమలకు అవసరమైన నీరు అందించాల్సి ఉంది. ప్రస్తుత నగర అవసరాలకు 108 ఎంజీడీ(మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నీరు సరఫరా చేయాల్సి ఉండగా 85 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇందులో 45 ఎంజీడీలు ఏలేశ్వరం కాలువ నించి ఇస్తుండగా, మిగతా 40 ఎంజీడీలను తాటిపూడి, రైవాడ, గోస్తనీ, మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ల నుంచి అందిస్తున్నారు. ఈ నీరు సరిపోక నగర శివారు ప్రాంతాలకు, మురికివాడలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి వస్తోంది. వేసవిలో నీటి కష్టాలు మరింత పెరుగుతున్నాయి. దీంతోపాటు భవిష్యత్తులో పెరిగే డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఏలేశ్వరం కాలువ ద్వారా 11 టీఎంసీల గోదావరి జలాలను నగరానికి తరలించడం ద్వారా రోజు 125 ఎంజీడీల నీరు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది.
సీఎం జగన్ ఆమోదంతో డీపీఆర్
ఏలేరు కాలువ నుంచి 126 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మించి నీరు తరలించడం ప్రాజెక్టు లక్ష్యం. భూసేకరణ అవసరం కూడా లేకపోవడం విశేషం. రూ. 3494 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ భారీ పథకానికి సీఎం జగన్ ఆమోదం లభించిందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఈ ప్రతిపాదన చాలా ఏళ్ల నుంచి ఉంది. అయితే గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం విశాఖ నగరానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ తాగునీటి పథకం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండు నెలల్లోనే డీపీఆర్ సిద్ధం చేసి.. ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు జీవీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : విశాఖ సినీ హబ్ .. జగన్ ఆలోచన అద్భుతం